రచయిత యండమూరి ఎక్కడో రాసినట్టు గుర్తు… ఒక నవల క్లైమాక్స్ ఏమీ తోచకపోతే, కథకు కామా పెట్టేసి ముగించేయడమే బెటర్ అని… తద్వారా పాఠకుడికి వదిలేయడం ముగింపు..! అలాగే తను రాసిన తులసి, తులసిదళం నవలల్లో కూడా పేరుకు క్షుద్ర ప్రయోగాలు, హిప్నాటిజం వంటివి ఎక్కువగా ప్రస్తావించినా సరే, సమాంతరంగా వైద్య చికిత్సలనూ వివరిస్తుంటాడు… అంతెందుకు, చంద్రముఖి సినిమాలో ప్రేక్షకులు మరణించిన ఓ నర్తకి ఆత్మ జ్యోతికను ఆవహిస్తుందని భావిస్తారు… కానీ నిజానికి ఆమెది ఓ మానసిక సమస్య…
ఇదంతా ఎందుకు చెప్పడం అంటారా..? సోనీ లివ్ ఓటీటీలో వచ్చిన భూతకాలం అనే సినిమా చూస్తుంటే పైవన్నీ ఓసారి మెదులుతాయి… దీనికి దర్శకుడు ఎవరంటే..? మొన్న భ్రమయుగం అనే ఓ ట్రెమండస్ ప్రయోగంతో అందరినీ ఆకట్టుకున్న రాహుల్ సదాశివన్… ఈ సినిమాకు మమ్ముట్టి దొరికినట్టే… భూతకాలం సినిమాకు రేవతి, షేన్ నిగమ్ దొరికారు ఆయనకు… పోటీపడ్డారు ఇద్దరూ… కాకపోతే ఇది 2022 సినిమా… పేరుకు సూపర్ నేచురల్ హారర్ జానర్ ఇది… కానీ పలు మానసిక సమస్యలను, భయాలను ఎక్స్‌పోజ్ చేస్తాడు దర్శకుడు… బ్యాక్ గ్రౌండ్ మాత్రం దెయ్యాలు, ఆత్మలు…
షేన్ నిగమ్ సినిమా నిర్మాణంలోనే కాదు, ప్రధాన పాత్ర పోషించాడు, సినిమాలోని ఏకైక పాట రాసిందీ తనే… కథకొస్తే… ఆశ (రేవతి) ఓ స్కూల్ టీచర్… భర్త చనిపోతాడు… అమ్మ, కొడుకుతో కలిసి ఉంటుంది… కొడుకు పేరు విను… (షేన్ నిగమ్)… డాక్టర్ కావాలని భావిస్తాడు, కానీ తల్లి ఒత్తిడి మేరకు ఫార్మసీ చదువుతాడు… రెండేళ్లుగా కొలువు కోసం వెతుకులాట, కానీ లాభం లేదు… ఛ, ఇక లాభం లేదు, వేరే ఊరికి పోవాలని అనుకుంటాడు…
Ads
అమ్మమ్మ చనిపోతుంది… ఏవో మానవాతీత శక్తులు ఆ ఇంట్లో తిరుగుతున్నట్టు విను గమనిస్తాడు… మొదట అదంతా మెంటల్ డిజార్డర్ అని భావించి, ఉద్యోగం రావడం లేదనే డిప్రెషన్‌తో మద్యం, పొగకు అలవాటై మెంటల్‌గా డౌన్ అయ్యాడని అనుకున్న ఆశ కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తుంది… తనకు హెరిడిటరీ మెంటల్ డిజార్డర్ అనుకుంటుంది… కానీ అదీ లాభం లేదు… ఈ క్రమంలో ఇద్దరి నడుమ దూరం పెరుగుతుంది… ఒకరినొకరు అనుమానిస్తుంటారు… చివరకు అమ్మమ్మ మరణం మీద కూడా అనుమానాలు… సరే, కథ చివరకు ఏమవుతుందనేది ఇక్కడ వదిలేద్దాం…
దర్శకుడి ప్రతిభ ఎక్కడ కనిపిస్తుందంటే… హారర్, థ్రిల్లర్ సినిమా అనగానే దెయ్యాలను వింత వేషాల్లో చూపించి, వింత ధ్వనులు, వింత చేష్టలతో సినిమా కథను నింపేస్తారు ఇతర దర్శకులు… పాడుబడిన బంగళాలు, ప్యాలెసులను దెయ్యాల అడ్డాలుగా చూపిస్తారు… కానీ ఈ భూతకాలం (ఇక్కడ భూతాలు ప్లస్ పాస్ట్ అని రెండర్థాలూ…) సినిమాలో దెయ్యాలు, భూతాల వేషాలు, పిచ్చి చేష్టలు గట్రా ఏమీ ఉండవు… జస్ట్, సౌండ్స్…
సేమ్, భ్రమయుగంలోలాగే… ఇక్కడా ఓ మూడుగదుల సాదాసీదా ఇల్లు… ఈ ఇద్దరి పాత్రలే ప్రధానం… సౌండ్స్, విజువల్స్‌తో కథంతా నడిపిస్తూ, వాటితోనే భయపెడుతూ చివరిదాకా సినిమాను తీసుకెళ్తాడు… ఈ సౌండ్స్ హైస్టాండర్డ్… నిజానికి వీటిని థియేటర్‌లో హైఎండ్ స్పీకర్ల ద్వారా వింటేనే ఓ థ్రిల్… సినిమాల్లో సౌొండ్ డిజైనింగ్ కూడా ఓ ఆర్ట్ అని చూపించాడు దర్శకుడు… సరే, ఆ ఇంట్లోని అదృశ్య శక్తుల వెనుక మరో ఇద్దరి విషాదగాథ కూడా ఉంటుంది…
సినిమాలో చెప్పుకోదగింది దర్శకత్వ ప్రతిభ, సౌండ్ డిజైనింగ్ మాత్రమే కాదు… రేవతి, షేన్ నిగమ్ నటన… నిజంగా రేవతి నటన సూపర్బ్… క్లైమాక్స్ సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ అచ్చెరువు కలిగిస్తుంది… చివరకు కథను ముగించడం అనూహ్యంగా… యండమూరి చెప్పినట్టే..!
Share this Article