.
Rochish Mon …. చక్రవర్తి పాట … “మూయించిన ఒక వీరుని కంఠం…”
1982లో వచ్చిన విప్లవశంఖం సినిమాలోని పాట “మూయించిన ఒక వీరుని కంఠం…”
చక్రవర్తి… తెలుగు సినిమా సంగీతం ఒక దశలో చక్రవర్తి మయం. ఆయన బతికి ఉన్నంత వరకూ ఆయనే దేశంలో ఎక్కవగా సినిమాలు చేసిన సంగీత దర్శకుడు. 930 పై చిలుకు సినిమాలు చేశారు
.
Ads
సంగీతంపరంగా నాణ్యత విషయంలో ఆయనకు పూర్వం తెలుగు సంగీత దర్శకుల స్థాయి చక్రవర్తికి ఉందా? దాదాపుగా అందరూ చేప్పే జవాబు “లేదు” అనే… అది కాదనలేనిది.
చక్రవర్తి పాటలు 80వ దశాబ్దిలో తెలుగు జనతకు తెగ నచ్చాయి; నప్పాయి. జనరంజకత్వం విషయం పక్కన పెడితే చక్రవర్తి నాణ్యమైన పాటలూ చేశారు.
“చీకటి వెలుగుల కౌగిలిలో…” సినిమా (చీకటి వెలుగులు), “శారదా నను చేరగా…” (శారద,) “నీలాల నింగిలో…” (జేబుదొంగ), “నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి…” (జస్టిస్ చౌదరి), “ఈ మధుమాసంలో …” (కొండవీటి సింహం), “తారలు దిగి వచ్చిన వేళ…” (ప్రేమాభిషేకం), “ఓ బాటసారి ఇది జీవిత రహదారి…” (ఇల్లాలు),
“కుశలమా నీకు కుశలమా…” (బలిపీఠం) “చేతి నిండా గాజులమ్మా…” (కాయ్ రాజా కాయ్), “ఈ దుర్యోధన దుశ్శాసన…” (ప్రతిఘటన) వంటి కొన్ని నాణ్యమైన పాటలు చేశారు చక్రవర్తి. చక్రవర్తి చేసిన మల్లెపూవు సినిమా పాటలు ఆ సినిమా హిందీ మూలం ప్యాసా పాటలకన్నా గొప్ప పాటలు.
చక్రవర్తి అన్ని రకాలుగానూ ప్రతిభావంతంగా చేసిన పాట ఈ “మూయించిన ఒక వీరుని కంఠం…” పాట.
1942లో వచ్చిన రోటీ అన్న హిందీ సినిమాలో అనిల్ బిస్వాస్ చేసిన “రోటీ, రోటీ…” పాట నుంచి మన దేశ సినిమాలో విప్లవ గీతాలు మొదలయినట్టున్నాయి. (నా మాట తప్పని చెప్పేవాళ్లకు కృతజ్ఞుణ్ణి ఔతాను; తప్పు దిద్దుకుంటాను)…
అన్ని దేశ భాషల సినిమాల్లోనూ విప్లవగీతాలు వచ్చాయి. ఆ అన్నిటిలోనూ చక్రవర్తి చేసిన ఈ
“మూయించిన ఒక వీరుని కంఠం…” పాట వంటిది లేదేమో? ఇళైయరాజా చేసిన విప్లవగీతం “మనిదా మనిదా ఇని ఉన్ విళ్షిగళ్ సివన్దాల్…” పాట కన్నా కూడా ఈ పాట మేలైంది.
‘సాయంకాలపు ఉరి కంబం తెల్లవారితే రవి బింబం’ వంటి అద్భుత వాక్యాలతో శ్రీశ్రీ గొప్పగా రాసిన పాటకు చక్రవర్తి చాల గొప్పగా సంగీతం చేశారు. ‘సాహిత్యంపరంగా ఈ పాటకు తులతూగగలిగే సినిమా విప్లవ గీతం దేశంలో మరే భాషలోనూ రాలేదు’ అని చెప్పచ్చేమో?
శక్తివంతమైన వచన కవితలా ఉన్న సాహిత్యానికి చక్రవర్తి ప్రతిభావంతంగా బాణి చేశారు. సాహిత్యంలోని భావానికి తగ్గట్టుగా బాణి నడకను చాల నేర్పుగా మలిచారు చక్రవర్తి.
ఈ సాహిత్యానికి ఇంత నాణ్యమైన ట్యాన్ చెయ్యడం చాల గొప్ప. వాద్య సంగీతం, కోరస్, బాణి మూడూ గొప్పతనం అన్నదానికి అభివ్యక్తి.
ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడారు. చాల గొప్పగా పాడారు. Modulation, mood, emotion, word-throw పరంగా బాలు విశిష్టంగా పాడారు దక్షిణాదిలో ఇంత వరకూ వచ్చిన ఏ గాయకుడూ పాడలేనంత గొప్పగా పాడారు బాలు.
ఒక సంగీత దర్శకుడిగా చక్రవర్తి జీవిత కాలపు పాట ఈ పాట. వినండి….
https://youtu.be/dBAykOHmTrM?si=h86dYnx_BX1R5tWO
రోచిష్మాన్
9444012279
Share this Article