Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తక్కువ చదువు, తక్కువ స్థోమత ఉన్నవాళ్లకు స్వీపర్ పోస్టులైనా దక్కనివ్వరా..?!

September 8, 2024 by M S R

 

దేశంలో నిరుద్యోగ యువత నిరాశానిస్పృహలకు అద్దం ఇది. చదివిన డిగ్రీలు ఎందుకూ కొరగాకుండా పోయిన విషాదమిది. హర్యానాలో రోడ్లు ఊడ్చే కాంట్రాక్ట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే ఆరువేలమంది పిజి చదివినవారు అప్లయ్ చేసుకున్నారు. 40 వేలమంది డిగ్రీ చదివినవారు అప్లై చేసుకున్నారు. ఇంటర్ చదివినవారు లక్ష మందికి పైగా అప్లై చేసుకున్నారు. రోడ్లు ఊడ్చే ఉద్యోగాలు ఉన్నవి మహా అయితే అయిదు వేలే. జీతం నెలకు పదిహేను వేలు.

పేరుకు చేతిలో డిగ్రీలు. చదివిన సబ్జెక్ట్ లలో లోతులు తెలియవు. నైపుణ్యం ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. వెయ్యి ఉద్యోగాలకు ఇరవై లక్షల మంది పోటీపడే విద్యా నిరుద్యోగ విషాదాలు హర్యానాలోనే కాదు. ప్రతి రాష్ట్రంలో ఇదే దుస్థితి.

Ads

పి.జి., పి.హెచ్.డి. చదివినవారు రోడ్లు ఊడవడంలో తప్పులేదు. ఏ చదువుతో నిమిత్తం లేకుండా కనీసం ఇలాంటి ఉద్యోగాలైనా ఇన్నేళ్లుగా తెచ్చుకుంటున్నవారు ఇప్పుడు ఏ ఉద్యోగాలు వెతుక్కోవాలి?

మనం పట్టించుకోవడం లేదు కానీ… నిరుద్యోగం పెను భూతమై దేశాన్ని కబళిస్తోంది. జాతీయంగా, ప్రాంతీయంగా ఎన్నికలవేళ మ్యానిఫెస్టోల్లో కోట్లకు కోట్ల ఉద్యోగాల భర్తీ, కొత్త ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇబ్బడి ముబ్బడిగా ప్రయివేటు ఉద్యోగాలు అని పార్టీలు భూమి ఆకాశం ఒకటి చేస్తూ ఊదరగొడతాయి. తీరా అధికారంలోకి వచ్చాక కోట్ల ఉద్యోగాల హామీలు లక్షల్లోకి; లక్షల హామీ వేలల్లోకి; వేల హామీ వందల్లోకి చేయడానికే ఆయాసపడుతూ ఉంటాయి.

ఐఐటీల్లో తగ్గుతున్న క్యాంపస్ సెలెక్షన్లు
—————-

దేశంలో మధ్యతరగతి కలలుగనే ఐఐటీలు చదివినవారికే ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో కోర్సు పూర్తి చేసినవారిలో 25 శాతం మంది ప్రాంగణ నియామకాల్లో (క్యాంపస్ ఇంటర్వ్యూల్లో) ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయారు. ఉద్యోగాలు తెచ్చుకున్న 75 శాతం మంది జీతాలు కూడా బాగా తగ్గాయి.

కోచింగ్ సెంటర్ల నిలువు దోపిడీ
——-

రకరకాల పోటీ పరీక్షలకు నగరాల్లో లెక్కలేనన్ని కోచింగ్ సెంటర్లు. ఈ మధ్య ఆన్ లైన్ వర్చువల్ కోచింగ్ సెంటర్లు కూడా తోడయ్యాయి. కరోనా తరువాత వీటన్నిట్లో ఒక్కసారిగా ఫీజులు రెండింతలు, మూడింతలు అయ్యాయి.

ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ 1200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు ఇరవై లక్షల మంది అప్లై చేశారు. యుపిఎస్‌సి లా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఒక క్యాలెండర్ ప్రకారం ఏటేటా జరగవు. దాంతో నాలుగయిదేళ్లకొకసారి వచ్చే ప్రకటనలకు నాలుగయిదేళ్ళుగా పోగయ్యే నిరుద్యోగులందరూ కోటి ఆశలతో ప్రిపేర్ అవుతుంటారు.

కోచింగ్ పరిశ్రమ
————–
ఎప్పుడొస్తుందో తెలియని నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండడానికి కొందరు నిత్యం కోచింగు తీసుకుంటూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోచింగ్ తీసుకునేవారు కొందరు. డిగ్రీ తరువాత రాసే పోటీ పరీక్షకు ఎల్.కే.జి నుండే కోచింగ్ తీసుకునేవారు కొందరు. ఇలా కోచింగ్ ఎంత పెద్ద పరిశ్రమో తనకే తెలియనంతగా ఎదిగిపోయింది.

రెండు పడవల మీద ప్రయాణం
—————————-
రాసి రాసి అలసిపోయే అభ్యర్థులు మొదటి సంవత్సరం కాగానే రెండో సంవత్సరం చిన్నాచితకా ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవుతారు. చాలా మందికి ఆ ఉద్యోగాలే శాశ్వతం అవుతూ ఉంటాయి. రెండు పడవల ప్రయాణం పనికిరాదని తెలిసి… ఒక పడవ మీదే రెండు కాళ్లు పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి దానికదిగా వస్తుంది.

ఆన్ లైన్ దోపిడి
—————
ఈ రోజుల్లో ఒక వైపు ఆగ్రాలో యమున ఒడ్డున తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించెను అని గురువు చెబుతుంటే మరోవైపు అభ్యర్థులు గురువు చెప్పింది నిజమో కాదోనని గూగుల్లో చెక్ చేస్తూ ఉంటారు. కోచింగ్ లో కూడా ఆన్ లైన్ దోపిడీ ప్రవేశించింది. లెక్కలేనన్ని యాప్ లు. వీడియో పాఠాలు. వర్చువల్ క్లాసులు.

ప్రభుత్వ కోచింగ్
————–
వెనుకబడిన తరగతులు, ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ప్రారంభించింది. నోటిఫికేషన్లు పలుచబడ్డాక వీటి ప్రభ కూడా తగ్గిపోయింది.

ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే పిజికి విదేశాలకు వెళ్లి, ఆపై ఉద్యోగం తెచ్చుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు. ఎక్కువ శాతం దిగువ మధ్యతరగతి, పేదవారు మాత్రమే కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు.

సగటున గ్రూప్ వన్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి సంవత్సరానికి కోచింగ్ సెంటర్ ఫీజు అరవై వేల నుండి లక్ష. వసతి, భోజనం, పుస్తకాలు ఇతర ఖర్చులు హీనపక్షం నెలకు పదివేలు. అంటే ఒక ఏడాది ప్రిపరేషన్ కు తక్కువలో తక్కువ రెండు లక్షల ఖర్చు. వెయ్యి ఉద్యోగాలకు పది లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే ఈ ఖర్చు పది లక్షలు ఇంటూ రెండు లక్షలు ఈజ్ ఈక్వల్ టు వేల వేల కోట్ల సున్నాలే సున్నాలు.

యు. పి. ఎస్. సి కి ఏటా సెలెక్ట్ అయ్యే అభ్యర్థుల గణాంకాలను పరిశీలిస్తే బీహార్, ఉత్తరాఖండ్, ఒరిస్సా రాష్ట్రాలవారు ఎక్కువగా ఉంటారు. వెనుకబడ్డ ప్రాంతాల నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. అలాగే గ్రూప్స్ లో కూడా వెనుకబడ్డ జిల్లాలవారే ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. సాధించి తీరాలన్న కసి, తదేక దీక్ష ఇందుకు కారణం.

ఆర్థికంగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడడం తగ్గిపోయింది. 1990 ఆర్థిక సరళీకరణల తరువాత ప్రయివేటు ఉద్యోగాలు పెరిగి, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. దాంతో ఒక్కో పోస్టుకు వేలు, లక్షల్లో పోటీ పడుతున్నారు.

ఒకపక్క బి ఎస్ ఎన్ ఎల్, భారతీయ రైల్వే, ఎల్ ఐ సి లాంటి హిమాలయమంత ఎత్తు ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలే ఇప్పుడు నెమ్మదిగా తలదించుకుని ఒదిగి ప్రయివేటు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటివేళ ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తే ఒక్క తెలుగు రాష్ట్రంలో ఒక్క ఏడాది వేల కోట్లు ఖర్చు కావడం తల్లిదండ్రులకు, అభ్యర్థులకు, మొత్తంగా సమాజానికి మంచిది కాదు. రకరకాల ప్రయివేటు ఉద్యోగాలకు తగినట్లు తయారై వేగంగా స్థిరపడకపోతే… దాహం తీర్చుకోవడానికి ఎండమావుల వెంట తిరిగినట్లే ఉంటుంది.

జన్మకో శివరాత్రిలా ఎప్పుడో పడే నోటిఫికేషన్ కే ఇన్ని వేల కోట్లు వ్యయమయితే ఏటేటా ఒకటి ఒకటి ఒకటి అని ఒకటే రొదపెట్టే ఐ ఐ టీ, నీట్ కోచింగులకు ఇంకా ఎన్నెన్నో పోటీ పరీక్షలకు కలిపి ఏటా ఎన్ని కోట్లకోట్లు ఖర్చవుతుందో సున్నాలు లెక్కపెట్టాలంటే…దానికంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడమే చాలా తేలిక అనిపిస్తుంది.

మన చదువులకు ఉద్యోగాలకు ఎక్కడో లంకె తెగిపోయింది. మనవి ఉద్యోగాలకు తగిన చదువులు కావని అర్థమవుతున్నా ఆ ఊబిలోనే ఇంకా ఇంకా లోతుగా కూరుకుపోతున్నాం. మార్కెట్ అవసరాలకు తగిన చదువులు, తగిన నైపుణ్యాలతో సిద్ధం కాకపొతే…

ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆనందో బ్రహ్మలో ముప్పయ్యేళ్ల కిందట హాస్యానికి చెప్పినట్లు-… “అమ్మా! అమ్మా! ఇన్నాళ్లకు మనం కలలుగన్న ఉద్యోగం వచ్చిందమ్మా! యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన నేను…ఏజ్ బార్ కావడానికి ఒక్క రోజు ముందు చివరి ప్రయత్నంలో ఫ్యాన్ కింద ప్యూన్ ఉద్యోగం సంపాదించానమ్మా! ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే అమ్మా! ఇక చెల్లెలి పెళ్లి అయినట్లే అమ్మా! నీకు ఆపరేషన్ అయినట్లే అమ్మా! మనం ఇల్లు కట్టుకున్నట్లే అమ్మా! రేపే ఉద్యోగంలో చేరడానికి పట్నం వెళుతున్నానమ్మా! నన్ను ఆశీర్వదించమ్మా!” అని సీరియస్ గానే తల్లిదండ్రులకు చెప్పాల్సి వస్తుంది! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions