A. Saye Sekhar…. టవరింగ్ పర్సనాలిటీస్… అంటే ఎప్పుడూ నిటారుగా నిల్చుని, తలెత్తుకుని బతికేవాళ్లు… హుందాతనం, రాజసం, సంస్కారం, ఉన్నత స్థాయిలో పరస్పర గౌరవాల్ని ఇచ్చుకునే ధోరణి వాళ్లను అలా ఉన్నతంగా ఉంచేవి… అలాంటివాళ్లలో ఇద్దరు… ఒకరు ఎన్టీయార్, మరొకరు మర్రి చెన్నారెడ్డి…
ఆ ప్రఖ్యాత ఎన్టీయార్ 101వ జయంతి నేడు… వెండితెర వేల్పుగా వెలిగి, తరువాత భారత రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషించిన లెజెండ్… వెండి తెర మీదైనా, రాజకీయ యవనికపైనా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే… ఇతరులతో పోలిక కుదరదు… ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయుడు…
వెండి తెర మీద నటనతో అభిమానులైనవాళ్లను పక్కన పెడితే… తనను సన్నిహితంగా మెలిగేవారు, గమనించేవారు తన వ్యక్తిత్వ ధోరణి చూసి కూడా అభిమానులవుతారు… నటనకు సంబంధం లేని కోణమిది… ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్లు రాజకీయాల మాటెలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలు, మర్యాదల విషయంలో ఎలా ఉన్నతంగా మెలుగుతారో చెప్పాలని నా ఈ ప్రయత్నం…
Ads
నా జర్నలిజం తొలినాళ్లలో ముచ్చట ఇది… అప్పటికి ఏడాదిన్నర వయస్సున్న పాత్రికేయుడిని… బహుశా ఇది 1990లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలయ్యాక అనుకుంటాను… మర్రి చెన్నారెడ్డి… మాంచి దమ్మున్న పొలిటిషియన్… ఎన్టీయార్‌కు రాజకీయాల్లో ప్రత్యర్థి… 1989లో ఎన్టీరామారావు నుంచి అధికార పగ్గాలు కూడా తీసేసుకున్నాడు… ముఖ్యమంత్రి అయ్యాడు…
ఆబిడ్స్‌లోని ఎన్టీయార్ నివాసానికి తరచూ వెళ్లేవాడిని… ముందస్తు అపాయింట్‌మెంట్లున్నవారిని ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్టీయార్ కలిసేవారు… తను ప్రతిపక్ష నేత, తనకు కూడా మంచి సంఖ్యలోనే ఎమ్మెల్యేలున్నారు…
ఒక పెద్దమనిషి… పేరు చెప్పదలుచుకోలేదు నేను… కావాలనే ఆయన పేరు, వివరాల్ని దాచిపెడుతున్నాను… కారణాలు బోలెడు… ఆయన ఎన్టీయార్‌ను కలవడానికి వచ్చారు… ఆ సమయంలో ఎన్టీయార్ వద్ద పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు… ఆయన లోపలకు రాగానే ఎన్టీయార్ లేచి నిల్చుని అభివాదం చేశారు… ఆయన కూడా అలాగే ప్రత్యభివాదం చేశారు…
కుశలప్రశ్నలయ్యాక… ఏమిటిలా వచ్చారని అడిగారు ఎన్టీయార్… ఆయన ఓ ఫైలు గురించి ప్రస్తావించారు… నిజానికి ఎన్టీయార్ నేతృత్వంలోని కేబినెట్ కొద్ది నెలల ముందే దాన్ని క్లియర్ చేసింది… కానీ అప్పటికే ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు…
చాలామంది వ్యక్తులు దీనిపై ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారాయన ఎన్టీయార్‌తో… అదొక ఇండస్ట్రియల్ క్లియరెన్స్… అన్నిరకాల వడబోతలయ్యాకే కేబినెట్ దాకా వచ్చిందన్నారు… శ్రద్ధగా విన్న ఎన్టీయార్ ఓసారి అవునన్నట్టుగా తలపంకించి, ముఖ్యమంత్రికి ఓసారి ఫోన్ కనెక్ట్ చేయాలని తన సెక్రెటరీకి చెప్పారు…
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కాల్ చేస్తే తను లైన్‌లోకి వచ్చేసరికి మనమే వేచి ఉండటం ప్రొటోకాల్, మర్యాద… ఈ సందర్భంలో కాస్త డిఫరెంట్… ఎన్టీయార్ ఆఫీసు సిబ్బంది సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి, సీఎం గారు గనుక ఫోన్ కాల్‌కు అందుబాటులో ఉంటే ప్రతిపక్ష నేతఎన్టీయార్ తనో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారు… అదే విషయం ఎన్టీయార్‌కు కూడా చెప్పారు…
ఆ వచ్చిన పెద్దమనిషితో ఎన్టీయార్ సంభాషిస్తూనే ఉన్నారు, నిమిషం కూడా గడిచిందో లేదో… ఎన్టీయార్ సెక్రెటరీ వచ్చి, సీఎం గారు ఫోన్ లైన్‌లోకి వచ్చారని చెప్పాడు… కుశలప్రశ్నలు, మర్యాద పలకరింపులు అయ్యాక, క్లుప్తంగా ఆ ఫైల్ గురించి చెప్పారు ఎన్టీయార్… ఒకవేళ సాధ్యమైతే మీరు ఆ ఫైల్ కాస్త చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ నమస్తే అని సంభాషణ ముగించారు…
నేను అక్కడే ఓ మూల పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఇదంతా చూస్తూనే ఉన్నాను… సాయంత్రం నాకు సెక్రెటేరియట్‌లో ఏదో అసైన్‌మెంట్ ఉంది… సీఎం కార్యాలయ వ్యవహారాలు రిపోర్ట్ చేసే ఓ సీనియర్ కొలీగ్‌తో పాటు సీఎం కార్యాలయం ఉండే సీ బ్లాక్ వద్దకు వెళ్లాను… పొద్దున ఎన్టీయార్ వద్దకు వచ్చిన పెద్దమనిషి అక్కడ కనిపించారు… సీఎం ఛాంబర్‌లోకి వెళ్తున్నారు…
నటరాజన్ అంటున్నాడు… ‘ప్రభుత్వం అనేది ఓ నిరంతర ప్రవాహం… విధానపరమైన డిఫరెంటు నిర్ణయాలు గట్రా లేకపోతే ఇలాంటి ఫైళ్లు వాటంతటవే కదులుతుంటాయి… కానీ ఈ కేసులో ఎన్టీయార్ స్వయంగా రిక్వెస్టు చేయడం, చెన్నారెడ్డి ఆనర్ చేయడం… ఉన్నత స్థాయిలోని పొలిటిషియన్స్ కనబరచాల్సిన సంయమనం, మర్యాదలకు ఇదొక మంచి ఉదాహరణ…’
జస్ట్, ఒక గంటలో ఒక ఫైల్ ఎలా పరుగులు తీసిందో చూశాను… అదే పెద్దమనిషి మొదట ఎన్టీయార్ గదిలోకి వచ్చి, ఇప్పుడు చెన్నారెడ్డి గదిలోకి అడుగుపెట్టి, చిరునవ్వుతో బయటికి వచ్చిన తీరూ చూశాను… అలాంటి రోజులు గతించాయి… ఆ నాయకులూ గతించారు… జస్ట్, మీకు తెలిసిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనేతల నడుమ సంబంధాలు, గౌరవాలు, మర్యాదల గురించి పరిశీలించండి… అప్పుడు మీకు ఎన్టీయార్, చెన్నారెడ్డిల హుందా రాజకీయాల ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది..!!
Share this Article