నిజమే, కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసింది… ఆరేడేళ్లుగా అనేకానేక ఉపఎన్నికల్ని, ఎన్నికల్ని కేసీయార్‌కు ధారబోసిన ఉత్తమకుమార్‌రెడ్డిని హుజూరాబాద్ ఉపఎన్నిక అయిపోయేవరకూ ఉంచాల్సింది… తెలంగాణ కాంగ్రెస్ మీద ఓ చివరి ఇటుక పేర్చిన సంపూర్ణ ఖ్యాతి దక్కేది… తను ఎన్నిసార్లు రాజీనామాలు చేశాడో, ఎంతకాలంగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారో కాంగ్రెస్‌కే తెలియదు… అసలు జాతీయ స్థాయిలోనే ఆ పార్టీకి ఓ దిక్కూదివాణం లేకుండా పోయింది… తెలంగాణ శాఖ ఎంత..? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌ను చంపీ చంపీ, కొట్టీ కొట్టీ, దాన్ని ఒక అస్థిపంజరంగా మార్చి, దాంతోనే కేసీయార్ పోరాడుతూ వచ్చాడు ఇన్నాళ్లూ… చేతికి గాండీవాలు, పాశుపతాలు ఇచ్చినా లేచి కొట్లాడే స్థితిలో ఆ పార్టీ లేదిప్పుడు… ఇన్నేళ్లుగా ముక్కీమూలిగీ, నానా కసరత్తులూ చేసి ఓ జాబితాను ప్రకటించింది… టీం కెప్టెన్‌గా రేవంత్‌రెడ్డిని ప్రకటించింది…
కాంగ్రెస్‌లో తన వయస్సు ఎంత..? అసలు తను చంద్రబాబు మనిషి కదా..! ఆ పదవికి ఒక్క బీసీ గానీ, ఒక్క ఎస్సీ గానీ కనిపించలేదా..? కాంగ్రెస్ ఎప్పుడూ రెడ్ల పార్టీయేనా..? కేసీయార్ మీద కొట్లాటకు ఆనుతాడా తను..? ఈ ప్రశ్నలు, వీటి మీద బోలెడు అభిప్రాయాలు, చర్చలు, పెదవి విరుపులు, అలకలు, ఆగ్రహాలు ఉంటే ఉండొచ్చు గాక…. కానీ ఇక్కడ రెండు కోణాలు… 1) రేవంత్‌రెడ్డికి ఫుల్ ఫ్రీహ్యాండ్ దక్కినట్టే… తన పరుగుకు అడ్డుపడే వాళ్లెవరినీ పీసీసీ కొత్త లిస్టులోకి రానివ్వలేదు ఎఐసీసీ… అది బలమో, శాపమో కాలం తేల్చాల్సిందే… ఇక లేస్తామో, ఇంకాస్త కూరుకుపోతామో ఆ ఒక్కడే తాడోపేడో తేల్చనీ అన్నట్టుగా… ఒక్క వ్యక్తికి, అదీ తమ పార్టీతో తక్కువ అనుబంధం ఉన్న నాయకుడికి అప్పగించడం కాంగ్రెస్ పార్టీ కోణంలో అత్యంత అరుదు… 2) అసలు సరైన టీం లేకుండా, ఒక్క కెప్టెన్ కేసీయార్ వంటి పోతపోసిన ఉద్దండపిండంతో పోరాడగలడా..?
Ads
కేసీయార్ పార్టీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసుకోలేని వైఫల్యం దగ్గర నుంచీ ఈరోజు దాకా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తప్పుటడుగులు వేస్తూనే ఉంది… కేడర్ లేక కాదు, పనిచేసే లీడర్లు లేక కాదు, సరైన నాయకత్వం లేక… మార్గదర్శకత్వం లేక… వోకే, రేవంత్ ఒక కోణంలో మంచి హిట్ ప్లేయరే… దూకుడుగా ఆడగలడు… కానీ ఒక్కడు ఆడితే చాలా..? ఏరీ..? జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్‌బాబు, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ… ఏరీ వీళ్లంతా..? ఈ జాబితా చూడండి… వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అయిదుగురు… కులాల సమతూకం సరే, ఇద్దరు బీసీ, ఒక రెడ్డి, ఒక మైనారిటీ, ఒక ఎస్సీ… కానీ వీళ్లలో ఎవరైనా తెర మీద యాక్టివ్‌గా ఉన్నారా..? ఎవరైనా సబ్జెక్టువారీగా టీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇవ్వగలరా..? పాపులర్ లీడర్లా..? జనాన్ని ఉత్తేజపరిచేలా మాట్లాడగలరా..? ఎత్తుగడలు వేయగలరా..? ఇక పది మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లలో రెండు మూడు పేర్లు పార్టీ కేడర్‌లోనే చాలామందికి తెలియదు…
విమర్శలూ, విశ్లేషణలూ సరే… నచ్చనివాళ్లు ఏం చేస్తారు..? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్సెట్రా లీడర్లు ఎటు పోవాలి..? ఈ ఎంపికలు నచ్చని సీనియర్ల నుంచి కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహకారం తీసుకోగలడా..? ఉంటే ఉండనీ, పోతేపోనీ అన్నట్టు తన ధోరణిలో తను వెళ్లిపోతాడా..? అది పార్టీకి నష్టమా..? లాభమా..? పాత సరుకు పోతేపోనీ, కొత్తకొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తూ కొత్త రక్తం నింపే ప్రయత్నం చేస్తాడా..? ఎలాగూ కేసీయార్ మీద పోరాటంలో కాంప్రమైజ్ అయ్యే కేరక్టర్ అయితే కాదు… వీహెచ్ వంటి నేతల్ని వదిలేయండి, ఊదు కాలదు, పీరు లేవదు… కానీ ఇతర సీనియర్ల మాటేంటి మరి..? స్థూలంగా చూస్తే… పెద్ద మార్పులు చేర్పులేమీ ఉండవ్… ఇప్పటికే ఓవర్ లోడ్‌తో సతమతమవుతున్న టీఆర్ఎస్ వీళ్లలో ఎవరినీ తీసుకునే స్థితిలో లేదు… ఇన్నేళ్లలో ఎవరినీ చేర్చుకోలేక, ఉన్నవాళ్లకే కాపాడుకోలేక కుంటి నడకతో సాగుతున్న బీజేపీలో కూడా పెద్ద చాన్స్ ఉండకపోవచ్చు… షర్మిలకు ఇన్నిరోజులుగా తెలంగాణ సమాజంలో ఏమాత్రం యాక్సెప్టెన్సీ వచ్చిందో చూస్తూనే ఉన్నాం, పైగా ఆ బాణం చేధించాల్సిన లక్ష్యాల మీద లక్ష సందేహాలు… సో, ముక్కుతూ, మూలుగుతూ, సణుగుతూ వీళ్లంతా ఆ సొంత పార్టీనే అంటిపెట్టుకుని వేలాడాల్సిందే… లేదు, ఇంకా డ్రాస్టిక్ మార్పులు ఉంటాయీ అంటారా..? చూద్దాం… టైం చెబుతుందిగా…!!
Share this Article