తెలంగాణ తల్లి అంటే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిచోటా ప్రతిష్టించిన విగ్రహాల్లో… ఒక చేతిలో బతుకమ్మ… మరో చేతిలో మక్క కంకి, జొన్న కంకి… తలపై కిరీటం… పట్టు చీరె… బంగారు హారాలు, వడ్డాణం, గాజులు… సర్వాలంకార శోభిత స్వర్ణ తెలంగాణ ఆమె… ఇన్నేళ్లూ ఆమెకే ప్రణమిల్లుతున్నాం కదా… నిజానికి తెలుగు తల్లికీ తెలంగాణ తల్లికీ పెద్ద తేడా ఏమీ ఉండదు… తెలుగు తల్లి అయితే ఒక చేతిలో కలశం, మరో చేతిలో వరికంకులు ఉంటయ్… అంతే తేడా…
అసలు తెలంగాణ తల్లి అలా ఉండకూడదు అంటోంది తెలంగాణ కాంగ్రెస్ తాజాగా… అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ అనే గీతాన్ని తెలంగాణ జాతీయ గీతంగా మారుస్తాం అని ఆల్‌రెడీ చెప్పింది కదా… వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్ బదులు టీజీ అక్షరాలు వాడతామని కూడా చెప్పింది కదా… ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని చెబుతోంది… దానికి కారణాలను కూడా ఏకరువు పెడుతోంది… ఇప్పుడు కేసీయార్ ప్రభుత్వం బలవంతంగా మనపై రుద్దిన రూపం గడీలో దొరసాని రూపం తప్ప ఓ సగటు తెలంగాణ మహిళ రూపం కాదని అంటోంది…
కొత్త రూపంలో ఆల్‌రెడీ ఓ నమూనా విగ్రహం కూడా రూపొందుతోంది… భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో తిరుగుతున్నప్పుడు బహుశా రాహుల్ గాంధీతో ఇలాంటి విగ్రహాలను అక్కడక్కడా ఆవిష్కరింపజేస్తారేమో… టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఏమంటాడంటే…
Ads
‘‘తెలంగాణ తల్లి కష్టజీవి. ఊరి సంస్కృతికి ప్రతిరూపం. మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదు… ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి, రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదు. పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకల జన తెలంగాణకు, సబ్బండ వర్గాల జనులకు తమ తల్లిని స్ఫురించే రూపం తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలవుతుంది తప్ప… దొరల గడీలలోని దొరసాని రూపమో, రాచరికపు లక్షణాలు కలిగి ఉన్న మహారాణి రూపమో మన తల్లి కాదు… కాబోదు.
అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తెలంగాణ సబ్బండ వర్గాలకు ఆమోదయోగ్యమైన “తెలంగాణ తల్లి” ని కూడా ఆవిష్కరిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించబోతోంది. మన రాష్ట్రం, మన తల్లి, మన గేయం, మనగానే, మనజెండా, మన ఎజెండా, మన రాష్ట్ర ఆంగ్ల సంక్షిప్త రూపం… ఇలా సర్వం సకలజన ఆమోదయోగ్యంగా… నిజమైన తెలంగాణ సంస్కృతికి వారసత్వ పున:ప్రతిష్ఠకు సంకల్పం తీసుకుంది. తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతి పట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం… ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదాం…’’
చూశారు కదా… కాంగ్రెస్ రూపకల్పన చేస్తున్న కొత్త తెలంగాణ తల్లి విగ్రహం… సింపుల్‌గా, ఏ అలంకారాలూ లేకుండా ఉంది… చేతిలో బతుకమ్మ కాదు, బడితె పట్టుకుంది… ఒక చేయి అభయహస్తంలా ఉంది… కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అదే కదా… సో, రాజకీయంగా ఫాయిదా ఆలోచించకుండా ఏదీ చేయరు కదా… టీఆర్ఎస్ మీద మొదలుపెట్టిన సాంస్కృతిక దాడిలో ఇదీ ఓ భాగమే అంటోంది కాంగ్రెస్… ఇదంతా సరే, కాంగ్రెస్‌కు దీటుగా టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్న బీజేపీ గనుక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకుంటే… ఏం మార్పులు చేస్తారో… ఒక చేతిలో కమలం, మరో చేతిలో జొన్న కంకులు పెడతారేమో…!! కిరీటం మాత్రం కంపల్సరీ…!!
Share this Article