“ధారయతీతి ధర్మః” అని ధరించేదే ధర్మం అని వ్యుత్పత్తి అర్థం. అంటే పాటించేదే ధర్మం కానీ- చెప్పి చేయకుండా ఉండేది ధర్మం కాదని పిండితార్థం. ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో; త్రేతాయుగంలో మూడు పాదాలతో; ద్వాపరలో రెండు పాదాలతో; ప్రస్తుత కలిలో ఒకే ఒక్క పాదంతో కుంటుతూ నడుస్తుంటుందని కొందరు గుండెలు బాదుకుంటూ ఉంటారు. చెప్పుల్లేనివాడు కాలే లేని వాడిని చూసి సంతోషంగా బతకాలని మానసిక వ్యక్తిత్వ వికాస శాస్త్ర ఆదేశం. కలిలో ఒక కాలితో కుంటుతూ అయినా ధర్మం నడుస్తోంది. కలి తరువాత ధర్మానికి కాళ్లే ఉండవు. దేకుతూ, పాకుతూ దుర్భరంగా నడవాలి. దాంతో పోలిస్తే ఒంటికాలి కుంటి నడక ఎంతో నయం.
రూల్స్ ఉన్నవి పాటించడానికే. రూల్స్ పాటించనివారిని పట్టుకోవడానికి పోలీసులు ఉంటారు. సీ సీ టీ వీ కెమెరాలుంటాయి. పట్టుకున్నవారిని దండించడానికి న్యాయస్థానాలుంటాయి. ఎంత కలికాలమయినా సాధారణంగా రూల్స్ ను గౌరవించి, పాటించేవారే ఎక్కువ శాతం ఉంటారు.
Ads
ట్రాఫిక్ రూల్స్ ను పాటించనివారి వల్ల- బుద్ధిగా పాటించి తమ మానాన తాము పోయేవారి ప్రాణాలు పోతుంటాయి. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పెడితే- తాగుబోతులు హిట్ అండ్ రన్ పోటీల్లో పాల్గొంటారు. పోలీసులు క్లాసులు తీసుకుంటే- తాగుబోతులు పోలీసులకు పరీక్షలు పెడతారు. తాగుబోతులు పెట్టే పరీక్షలు రాసి రాసి విసుగెత్తిన పోలీసులు- తాగి వాహనాలు నడుపుతున్నవారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే రెండేళ్లలో తాగి నడిపిన వారిలో నాలుగున్నర వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి.
ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకోవడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. వాహనం పని చేసినా, చేయకపోయినా వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలంటుంది చట్టం. తీరా ఆ వాహనానికి ఖర్మకాలి ఏ ప్రమాదమో అయితే- మన వాహనానికి ఎక్కడ దెబ్బ తగిలిందో అదొక్కటే ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఇన్సూరెన్స్ కంపెనీలను పోషించడానికే మనం ప్రీమియంలు కడుతున్నామనే మౌలికమయిన అవగాహన, స్పష్టత ఉండాలి. ఇలా తాగి నడిపేవారి వాహనాలకు, రాంగ్ పార్కింగ్ చేసే వాహనాలకు, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా పెంచితే కనకవర్షం కుంభవృష్టిగా కురుస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి. భారత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ రిస్క్ ప్రీమియం పెంపు ప్రతిపాదనను ఆమోదించడమే తరువాయి. అప్పుడు వాహనదారుడికి ఒనగూరే ప్రయోజనాలు క్రింది విధముగానుండును.
1 . వాహనం ఇన్సూరెన్స్ సంవత్సరానికి మూడింతల పెంపు.
2. పెట్రో, డీజిల్ పెంపు గోడ దెబ్బకు- ప్రీమియం చెంప దెబ్బ అదనం.
3 . ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి- అదే ఇన్సూరెన్స్ కంపెనీ వారి బ్యాంకులో రుణ సదుపాయం.
4. చివరకు మిగిలేది-
లైసెన్స్ పోలీసులు లాక్కుని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి వాహనం ఇంట్లో పెట్టుకుంటే, పెరిగిన ప్రీమియం కట్టనందున వాహనం రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడం.
5 . బతుకు జట్కా బండి- అనుకుంటూ వాహనాన్ని మనమే తోసుకుంటూ వెళ్లడమే. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆదాకు ఆదా……… BY… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article