.
ఎవరో అనుభవించే నొప్పిని మనం అనుభవిస్తూ… వాళ్లకు నొప్పి లేకుండా చేయడం సాధ్యమేనా..? మొన్న కామాఖ్యకు వెళ్లొచ్చినప్పట్నుంచీ ఓ మథనం, ఓ సందేహం… నమ్మాలో వద్దో తరువాత సంగతి, వినడానికి మాత్రం చాలా ఆసక్తికరంగా…
కామాఖ్య గుళ్లలో పాంచ్ బలి పూజకు ఓ మిత్రుడు కూర్చున్నాడు… ఫుల్ రష్… గోడ పక్కన మిత్రులం కూర్చున్నాం… పదే పదే స్టాఫ్ వచ్చి పూజలు చేసుకునేవాళ్లు తప్ప మిగతావాళ్లు దర్శనానికి వెళ్లిపోవాలనీ, ఆ స్పేస్ ఖాళీగా ఉంచాలని చెబుతున్నారు…
Ads
నిజంగానే అంబుబాచీ తరువాత రోజులు కదా, విపరీతమైన రష్… పైగా ఆ దారి బలి తలల్ని స్ట్రెయిటుగా, పూజస్థలికి తీసుకొచ్చేది… అలాగే కూర్చున్నాను, నా ఇరుపక్కలా ఇద్దరున్నారు… ఒకాయన కండువా కప్పుకుని ఉన్నాడు… లోపల ఓ సంచీలో జపమాల… అది కనిపించకుండా తిప్పుతున్నాడు… ఏదో పఠిస్తున్నాడు…
మరోవైపు దాదాపు అలాగే… వాళ్లను మాత్రం ఎవరూ వెళ్లిపోవాలని చెప్పడం లేదు… పైగా ఓ పెద్దాయన వచ్చి, వాళ్లు ఉన్నారా లేదా చూసి కన్‌ఫరమ్ చేసుకుని వెళ్తున్నాడు… ఏమిటీ జపం అనడిగితే మొదట చెప్పడానికి ఇష్టపడలేదు… మళ్లీ మళ్లీ గోకేసరికి చెప్పాడు ఒకాయన… ఆ తంతు పేరేదో చెప్పాడు, గుర్తురావడం లేదు…
‘‘ఒకరి నొప్పిని నా దేహంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, ఎవరైనా ఏదో వ్యాధితో నొప్పి భరిస్తుంటాడు, కర్మ ఇక్కడే అనుభవించాలి కాబట్టి ప్రాణం దేహాన్ని వదిలివెళ్లదు… అదుగో వాళ్ల నొప్పిని మనం భరించే తంతు ఇది… అయిపోయాక ఆ దేహాన్ని జీవుడు వదిలేస్తాడు’’ అని చెప్పాడు…
ఎవరో చేయాల్సిన జపాలను వేరేవాళ్లతో చేయించడం తెలుసు… మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు అలా చేసేవాళ్లు… ఆ పుణ్యం చేయించుకున్నవాళ్లకు దక్కుతుంది… ఏవైనా కర్మలు చేసేటప్పుడు మన తరఫున కూడా పురోహితులు తంతు నిర్వహించడం కూడా తెలిసిందే కదా… మనం మమ అంటాం అంతే…
కానీ ఆయన చెప్పింది కొత్త… మరి ఇటుపక్కాయన చేసే తంతు ఏమిటి అనడిగితే… అదీ అలాంటి తంతే, కాకపోతే ఒకరి కర్మఫలాన్ని అనుభవించడం కాదు, కేవలం ఎవరిదో నొప్పిని మనం అనుభవించడం అని చెప్పాడు… ఏమో… సరిగ్గా అర్థమయ్యీకానట్టు…
కావచ్చు, రకరకాల పూజలు, తంతులు కేవలం కొందరికి ఉపాధి అనే విమర్శలు తరాలుగా వింటున్నవే… కానీ వాటికి భిన్నంగా ఏదో మార్మికత భారతీయ ఆధ్యాత్మిక సాధన, దృక్పథంలో ఉంది… మనిషి తనలోకి తాను ప్రయాణిస్తూ, సాధన చేస్తూ, అంతర్గత శక్తుల్ని చైతన్యవంతం చేసుకుంటూ, అంతిమంగా ముక్తి పొందడం లేదా దైవంలో విలీనం కావడం చాన్నాళ్లుగా వింటున్నదే…
భారతీయ ఆధ్యాత్మిక మార్మికత ఏమిటో తెలుసుకోవడానికి విదేశీయులు కూడా ఆసక్తి కనబరుస్తుంటారు, ఇదొక అంతులేని అన్వేషణ… ఇవన్నీ నెమరేసుకుంటూ గర్భాలయం వైపు దర్శనం కోసం కదిలాను..!!
Share this Article