Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలీవుడ్ మొఘల్..! ది రియల్ బాహుబలి దిలీప్‌కుమార్‌..! ఈ సినిమా గుర్తుందా…!!

July 7, 2021 by M S R

దిలీప్ కుమార్… 98 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని వీడివెళ్లిపోయాడు… ఒక లెజెండ్… బాలీవుడ్ మరిచిపోలేని నటుడు… ఎవరితో పోలిక లేదు, పోటీ లేదు… దిలీప్ అంటే దిలీప్… అంతే… యూనిక్ స్టార్… దిలీప్ అనగానే గుర్తొచ్చేది పాతతరం ప్రేక్షకులకు మొఘల్ ఏ ఆజమ్… అసలు ఆ సినిమా చరిత్రే వేరు… దాన్ని కూడా వేరే ఏ బాలీవుడ్ సినిమాతో పోల్చడానికి లేదు… అసలు ఆ సినిమా నిర్మాణమే ఓ విశేష చరిత్ర… ఎస్, ఆ సినిమా గురించి చెప్పుకోవడం అంటే… దిలీప్ గురించి ఎంతోకొంత చెప్పుకోవడమే… ఎందుకంటే… ఆ సినిమా లేకుండా దిలీప్ లేడు కాబట్టి… ఆ సినిమా ముచ్చట్లను స్మరించుకోవడం అంటే దిలీప్ గురించి స్మరించుకోవడమే కాబట్టి… పదండి ఓ సుదీర్ఘ కథనంలోకి… అది మొఘల్ ఏ ఆజం కథకన్నా పెద్ద కథ…
dileep1
— BY…. #Taadi_prakahsh………… 
——————-
***
ఇప్పటికి సరిగ్గా 60 సంవత్సరాల క్రితం….
1960 ఆగస్ట్‌ 5వ తేదీ : భారతదేశం అంతటా
‘మొగలే ఆజమ్‌’ అనే CULT CLASSIC
విడుదలై చరిత్ర సృష్టించింది.
భారతీయ ప్రేక్షకుడు
అలాంటి సినిమా ఎన్నడూ చూసి ఎరగడు.
***
చూపు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్‌తో,
ఈ జన్మికక చాలు అనిపించే మధుర సంగీతంతో,
పృథ్వీరాజ్‌ కపూర్‌ డైలాగుల మేఘ గర్జనతో,
వెండితెర వీనస్‌ మధుబాల వెన్నెల సౌందర్యంతో,
బడేగులాం అలీఖాన్‌ గానామృతధారలతో
నిండిన ఆ సినిమా చూసి ఉత్తరాది, దక్షిణాది
అనే భేదం లేకుండా, వాళ్ళు క్లాసూ,
వీళ్ళు మాసూ అనే తేడా లేకుండా…
యావద్భారతదేశం పులకించిపోయింది.
మొగలే ఆజం చూసి ఒక తరం తరించింది.
***
ఒక పెద్ద వెండిపాత్రని స్టౌ మీద పెట్టి,
అందులో ముందుగా శ్రీశ్రీనీ కృష్ణశాస్త్రినీ వేసి,
రెణ్ణిమిషాల తర్వాత కేవీరెడ్డినీ,
ఎస్వీరంగారావునీ జోడించి,
కొంచెం వేగనిచ్చి రెండు చెంచాల
శేఖర్‌కపూర్‌ని వేసి,
ఆపై తగినంత సత్యజిత్‌రాయ్‌ని చల్లి,
మాంచి మల్టీకలర్‌ వచ్చేదాకా వేయించి,
రుచికోసం చిటికెడు శ్యాంబెనగల్‌ని కలిపి,
రమేష్‌ సిప్పీతో గార్నిష్‌ చేసిన ఆ మాయాదీపాన్ని
లక్ష్మీ,సరస్వతీ, పార్వతీదేవి ఒకేసారి టచ్‌చేస్తే,
***
“అందులోంచి నడుచుకుంటూ….
#మన_కళ్ళముందు_కొచ్చే…
#మహాదర్శకుడే_కరీముద్దీన్_ఆసిఫ్”!!
***
CECIL B DE MILLE OF INDIA
అమెరికన్‌ సినిమా కన్నతండ్రి కీర్తి గాంచిన
సిసిల్‌ డిమిలీ, టెన్‌ కమాండ్‌మెంట్స్, క్లియోపాత్రా,
గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌, శాంసన్‌ అండ్‌ డెలీలా వంటి
ఇంటర్నేషనల్‌ బ్లాక్‌బస్టర్స్‌ తీసిన దర్శక రాక్షసుడు.
ఆయనతో మాత్రమే పోల్చదగ్గ…
#ఏకైక_భారతీయ దర్శకుడు ఆసిఫ్‌.
***
1945లోనే మొగలే ఆజం తీద్దామని ప్లాన్‌ చేశాడు ఆసిఫ్‌.
నర్గీస్ హీరోయిన్‌, చంద్రమోహన్‌
(మనవాడు కాదు) హీరో అనుకున్నాడు.
షూటింగ్‌ మొదలుపెట్టడానికి ముందే
హఠాత్తుగా చంద్రమోహన్‌ చనిపోయాడు.
దీంతో వాయిదా వేసుకున్నాడు.
***
1945లోనే ఆసిఫ్‌ తీసిన ‘ఫూల్’ సూపర్‌ హిట్‌ అయింది.
తరవాత హల్‌చల్‌ తీశాడు. అది 1951లో విడుదల అయింది.
అప్పటి నుంచి ఇక మొగలే ఆజమ్‌పైనే దృష్టిపెట్టాడు.
ఈసారి మధుబాల,దిలిప్‌ కుమార్లని
ఎంచుకున్నాడు. మూడేళ్ళ ప్లానింగ్‌,
తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిర్మాణం తర్వాత 1960 ఆగస్ట్‌లో
మొగలే ఆజమ్‌ విడుదలయింది.
ఆ ప్రేమ కవిత చరిత్ర సృష్టించింది.
***
mughal
#పూర్తిగా_కలర్‌లో_తియ్యడం_కోసం
లవ్‌ అండ్‌ గాడ్‌ ‘ తలపెట్టాడు. గురుదత్‌ హీరో. నిమ్మి హీరోయిన్‌లు. షూటింగ్‌కి ముందే 1964లో గురుదత్‌ మరణించారు. అనేక మార్పులు చేసి,ఈ సారి సంజీవ్‌ కుమార్ని హీరోగా ఎంచుకున్నారు. సినిమా సగం పూర్తయ్యాక 1971లో ఆసిఫ్‌ చనిపోయారు. ప్రాజెక్టు నిలిచి పోయింది. అచ్చు సినిమాలాగే ఆసిఫ్‌ జీవితం ముగిసిపోయింది.
***
1945-1955లో……
ఒక హిందీ సినిమా తియ్యడానికి పది లక్షలు ఖర్చయ్యేది. మహా అయితే మరో రెండు మూడు లక్షలు అంతే!
అలాంటి రోజుల్లో మొగలే ఆజమ్‌కి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు!
లెక్కలేకుండా ఖర్చు చేయించాడు ఆసిఫ్‌. దర్శకుణ్ణి పూర్తిగా నమ్మిన నిర్మాతలు
నోట్లు విరజిమ్మారు.
***
1951 కావొచ్చు. బొంబాయిలో ఒక సింగిల్‌ రూంలో
వుండేవాడు సంగీత దర్శకుడు నౌషాద్ అలీ.
చాలా మెట్లెక్కి వెళ్ళాలి ఆగదికి.
ఆసిఫ్‌, నౌషద్‌ చాలా మంచి దోస్తులు.
ఒక రోజు ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాడు ఆసిఫ్‌.
టేబుల్‌ మీద వున్న హార్మోనియం ముందు కూచుని వున్నాడు
నౌషద్‌. చాయ్‌ వచ్చింది. ఒన్‌ బైటూ తాగారు. పాన్‌ వేసుకున్నారు.
బీడీ వెలిగించాడు నౌషాద్‌. ‘చెప్పరా’ అన్నాడు
మొగలే ఆజమ్‌ అని దుమ్ము రేగిపోయే సినిమా ప్లాన్‌ చేశా.
***
సలీం అనార్కలీ ప్రేమకథ. సంగీతం నువ్వే.
ఏం చేస్తావో మరి, ఈ దేశం పదికాలాల పాటు
ఆ పాటలు పాడుకోవాలి” అన్నాడు ఆసిఫ్‌.
“మన స్నేహం కోసం నువ్వేం చెప్పినా చేస్తా ఇరగదీద్దాం”
అన్నాడు నౌషాద్‌.
పాటలింకా రాయలేదు. నిర్మాత ఎవరో తెలీదు.
ట్యూన్లు కట్టడం మొదలుపెట్టాడు.
ఆసిఫ్‌ ఇంప్రెస్‌ అయ్యాడు.
మళ్ళీ చాయ్‌, పాన్‌, బీడీలు!
శాస్త్రీయం,జానపదం, సూఫీ, కమర్షియల్,
లలిత సంగీతాల్లో ఆరితేరిన నౌషాద్‌ 25 పాటలకు
మతిపోయే ట్యూన్లు సిద్ధం చేశాడు.
రెమ్యూనరేషన్‌ యివ్వడానిఇకి ఆసిఫ్ దగ్గర డబ్బుల్లేవ్‌.
***
పాటలు రాసే పనిని కవి షకీల్ బదాయునెకి అప్పజెప్పాడు.
1960లో సినిమా రిలీజ్‌ అయి,హిట్టయ్యాక,
ఆసిఫ్‌ మళ్ళీ ఆ మెట్లు ఎక్కి నౌషాద్‌ దగ్గరకెళ్ళాడు.
లక్ష రూపాయల నోట్ల కట్టలు తీసి, హార్మోనియం మీద పెట్టాడు.
“ఏంట్రాయిది ! మన స్నేహం కోసం చేశానురా,
డబ్బు కోసం కాదు” అంటూ నౌషాద్‌ ఎడం చేత్తో నోట్ల కట్టల్ని తోసేశాడు.
పక్కనున్న కిటీకీలోంచి అవి కిందకి పడిపోయాయి.
దారిన పోయేవాళ్ళు ఏరుకుని డబ్బు పట్టుకుపోయారు.
ఖిన్నుడయిన ఆసిఫ్‌ క్షమాపణ చెప్పారు. నౌషాద్‌ భార్య రాజీ చేయడంతో
వాళ్ళు మళ్ళీ కలిసి పనిచేశారు.
***
mughal2
#బడేగులాం_అలీఖాన్‌_పాట
***
సలీం అనార్కలిని వెన్నెల వేళ ఉద్యానవనంలో కలుసుకున్నపుడు బ్యాక్‌గ్రౌండ్లో ఒక పాట వుండాలనీ, అది ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ పాడితే అద్భుతంగా వుంటుందనీ ఆసిఫ్‌ అనుకున్నారు. హిందుస్థానీ సంగీత హిమాలయంగా పేరుగాంచిన బడేగులాం సినిమా పాట పాడటమా?
అయ్యే పని కాదు. అయితే బడేగులాం గౌరవించే నౌషాద్‌ అలీ అడిగితే పని జరగొచ్చు అని ఆసిఫ్‌ అంచనా. ఇద్దరూ కలిసే వెళ్ళారు.నౌషాద్‌ బెరుకుబెరుగ్గానే బడేగులాంని అడిగారు. సినిమా పాట పాడనని ఆయన తెగేసి చెప్పారు. రెమ్యునరేషన్‌ భారీగా యిస్తాము అన్నాడు ఆసిఫ్‌. వాళ్ళని వొదిలించుకోవాలనే ఉద్దేశంతో పాటకి 25 వేలు యిస్తారా? అని అడిగారు బడేగులాం.
సర్రున చెక్కుతీసి సగం డబ్బు అడ్వాన్స్ యిచ్చాడు ఆసిఫ్‌. పెద్దాయన కాదనలేకపోయాడు.
***
ఇలా పాడితే సరిపోతుందా? అంటూ పాట మొదలుపెట్టి కచేరీ చేసే అలవాటు ప్రకారం బడేగులామ్ మూడు గంటలసేపు ఇరగదీసి,ఇది సరిపోతుందా? అని అడిగారు. కంగుతిన్న నౌషాద్, అయ్యా మొత్తం సినిమానే మూడుగంటలు వుంటుంది. మీ పాట అయిదారు నిమిషాలుంటే చాలు అన్నారు.
చెప్పవేం అలాగే చేద్దాం అని ఐదున్నర నిమిషాలకు కుదించి పాడారట. అప్పట్లో స్టార్‌ సింగర్స్ రఫీ, లతామంగేష్కర్‌ పాటకి మూడు నాలుగొందల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అదన్నమాట బడేగులాం అలీఖాన్‌ లెవెల్‌ ! మొగలే ఆజంలో పాడిన రెండు పాటలకు ఆయనకి ఆసిఫ్‌ 50 వేలు పారితోషికంగా ఇచ్చారు.బడే గులాం పాడిన “ప్రేమ్‌ జోగన్‌ బన్‌కే ” గీతం ఎప్పటికీ ఎవ్వర్‌గ్రీన్ గానే నిలిచి వుంటుంది.
***
సినిమా నిడివి విపరీతంగా పెరిగిపోవడంతో, మొత్తం 20 పాటల్ని 12కి కుదించారు.
సినిమాలో కీలకమైన “ప్యార్‌ కియాతో డర్నా క్యా” పాట లిరిక్స్ షకీల్‌ బదాయుని రాసినా నౌషాద్‌కి నచ్చలేదు. నౌషాద్‌ ఇంట్లో ప్రత్యేకంగా సిటింగ్‌ వేసి ఒక రాత్రి అంతా సీరియస్‌గా చర్చించారు. ” నేను ప్రేమించాను. అంతే…దొంగతనం మాత్రం చేయలేదు” అనే అర్ధం వచ్చే ఉత్తరప్రదేశ్‌ జానపద గీతాన్ని నౌషాద్‌ గుర్తు చేసి, అలా బావుంటుందని సూచించారు. ” ప్యార్‌ కియ కోయి చోరీ నహీ”
అని షకీల్‌ రాశారు. పాట ఫైనల్‌ అయింది.
***
అక్బర్‌ ఎదుట, శీష్‌ మహాల్లో (అద్దాల మేడ ) అనార్కలి ఆ పాట పాడాలి. వందలవేల అద్దాలతో మెరిసిపోయే శీష్‌ మహల్‌ కోసం బెల్జియం నుంచి ప్రత్యేకంగా అద్దాలు తెప్పించారు. మొగలే ఆజమ్‌ బ్లాక్ అండ్ వైట్‌ సినిమా. ఏళ్ళ తరబడి నిర్మాణం జరుగుతుండడంతో, అప్పటికి కలర్‌ ఫిల్మ్‌ల నిర్మాణం మొదలైపోయింది. ఆసిఫ్‌ పట్టుబట్టడంతో ప్యార్ కియాతో డర్నా క్యా పాట వరకూ కలర్‌లో షూట్‌ చేశారు. ఆ రోజుల్లో ఆ ఒక్క పాటకే 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అప్పట్లో అది ఒక సినిమాకి అయ్యే ఖర్చు, ఆ సూపర్‌ హిట్ పాటని లతామంగేష్కర్ పాడారు. ఆమె ఉర్దూ ఉచ్ఛారణ స్వచ్ఛంగా లేదని హీరో దిలీప్ కుమార్‌ అన్నారు. దాంతో ఉర్దూ పండితులతో లతకి క్లాసులు చెప్పించి, ఆమె దోషాలు సవరించుకునేలా చేశారు. ఆ పాట పాడేటపుడు ప్రతిధ్వని (ECO) రావాలని నౌషాద్‌ భావించారు.
***
అలా ప్రతిధ్వని వచ్చే ఆధునిక టెక్నాలజీ ఆ కాలంలో లేదు. అంచేత రికార్డింగ్‌ స్డూడియోలో పింగాణీ టెయిల్స్‌ తాపడం చేసి వున్న బాత్‌రూంలో ఆ పాట పాడాలని నౌషాద్‌ లతకి చెప్పారు. అలా ఆ సంగీత దర్వకుడు కోరుకున్న ఎఫెక్ట్‌ సాధించారు. క్లయిమాక్స్‌లో ” జిందాబాద్‌, జిందాబాద్‌, హే మొహబ్బత్ జిందాబాద్‌” అని రఫీ హై పిచ్‌లో పాడే పాట వుంటుంది. దానికి వందమంది కోరస్‌ పాడారట.కాదు. వెయ్యి మంది కోరస్‌ పాడారని మరికొందరు అంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ పాట ‘మెహే పన్‌ ఘట్‌ పే…’ ఈ సినిమాలో ప్రత్యేకమైనది. అప్పటి ప్రసిద్ద డైరెక్టర్‌ విజయ్‌ భట్‌ దీనికి అభ్యంతరం చెప్పారు. మొగలే ఆజమ్‌తో ఆయనకి సంబంధం లేకపోయినా, అక్బర్‌ చక్రవర్తి పాలనలో హిందూ పండగ సెలబ్రేట్‌ చేయడం సినిమాని దెబ్బతీస్తుందని భట్‌ అన్నారు. అక్బర్‌ లౌకికవాది అనీ, పైగా పాటలో జోదాభాయ్‌ (దుర్గ ఖోటే) వుంటుందనీ నౌషాద్ అలీ చెప్పారు.ఈ అర్ధం ధ్వనించేలా ఒక డైలాగ్‌ కూడా చొప్పించారు.
***
dileep
#Perfectionist_జగమొండి_ఆసిఫ్!‌
***
సినిమాలో ప్రతి చిన్న డీటేయిల్‌ కూడా ఫర్‌పెక్ట్‌గా వుండేలా, ఎక్కడా రాజీలేకుండా చిత్రీకరించే వాడు ఆసిఫ్‌. అగ్రనటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ అక్బర్‌ పాత్రలో అరిపించారు. ఒక సన్నివేశంలో కొడుకు సలీం(దిలీప్ కుమార్‌) నడిచి ముందుకువెళ్ళి
తండ్రిని ప్రశ్నించాలి. దిలీప్ నడక ఆసిఫ్‌కి నచ్చలేదు. “వీడికి బంగారు బూట్లు చేయించండి” అన్నాడు. నిర్మాతలు ఆశ్చర్యపోయారు. పసుపు రంగు బూట్లు వేస్తే సరిపోతుందిగా, అయినా బూట్లెవరు చూస్తారు? అని అడిగారు. బంగారు బూట్లు సిద్ధం చేయాల్సిందే అన్నాడు ఆసిఫ్‌. దిలీప్ ఆ బూట్లు వేసుకున్నాక “పుట్‌పాత్‌ మీద పళ్ళు అమ్ముకునే వాడి కొడుకువి కావు నువ్వు, అక్బర్ చక్రవర్తి కొడుకువి, కాబోయే పాదుషావి. గంభీరంగా, హుందాగా నడవాలి” అన్నాడు ఆసిఫ్‌.
***
#ఒకప్పుడు దిలీప్‌కుమార్‌ తండ్రి పళ్ళు అమ్ముకునే వాడట.
మరో ముఖ్యమైన సన్నివేశం… అనార్కలిని జైల్లో బంధిస్తారు. సంకెళ్ళు వేస్తారు. ” మొహబ్బత్‌కి ఝూటీ..జవానీ పే రోయీ…” అనే గుండెల్ని మెలి పెట్టే విషాదగీతం వుంటుంది. మామూలుగా తేలికపాటి చెక్కతో చేసిన సంకెళ్ళు వేస్తారు. మధుబాల మొహంలో సరైన EXPRESSION పలకడం కోసం ఒరిజినల్‌ ఉక్కు సంకెళ్ళు వేయాలని ఆదేశించాడు దర్శకాసురుడు. ఆ ఇరవై కిలోల సంకెళ్ళ భారం మోస్తూ మధుబాల నటించాల్సి వచ్చింది. అప్పటికి ఆమె గుండె జబ్బుతో ఉందికూడా.మరోసీన్‌లో, అనార్కలి మెడలో ముత్యాలహారం తెగి, గచ్చు మీద ముత్యాలు దొర్లిపోతాయి. ఖరీదైన,నిఖార్సయిన మంచి ముత్యాలు తెప్పించి హారం రెడీ చేయమన్నాడు ఆసిఫ్. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫిల్మ్‌కి ఇంత వోవర్‌ యాక్షన్‌ తగదనీ ప్లాస్టిక్‌ పూసలు చాలు కదా అని నిర్మాత మొత్తుకున్నా దర్శకుడు ఒప్పుకోలేదు. ఖరీదైన ముత్యాలే తెప్పించారు. సినిమా నిర్మాణంలో ఇలాంటి గొడవలు జరిగినపుడు ఆసిఫ్‌ వాకౌట్‌ చేసి వెళిపోయేవాడు. షూటింగ్‌ కొన్ని నెలలు ఆగిపోయేది. అందుకే నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్ళు పట్టింది. నిర్మాత షాపూర్‌జీ పల్లోంజి మరికొందరు ఆసిఫ్‌ మీద పూర్తి నమ్మకంతో దర్శకుడి వేషాలన్నీ భరించారు. ఒక పక్క సినిమా అపురూపంగా సిద్ధం అవుతోందనీ, బాక్సులు బద్దలు అవడం ఖాయమనీ వాళ్ళకి అర్ధం అవుతూనే వుంది.
***
#అనార్కలి_వుందా_ఆమె_ప్రేమకథ_నిజమేనా?
***
అక్బర్‌ చక్రవర్తికి లేక లేక కొడుకు పుడతాడు. జోధాభాయికి సేవలు చేసే ఒకామె ఈ శుభవార్త అక్బర్‌ చెవిన వేస్తుంది. పరమానంద భరితుడై చక్రవర్తి వేలి వుంగరం బహుమతిగా ఇస్తాడు. ఎప్పుడైనా ఒక కోరిక కోరుకో, చెల్లిస్తా అంటాడు.ఆ సేవకురాలు అనార్కలి తల్లి! పెరిగి పెద్దవాడైన సలీం బాధ్యతారహితంగా తిరుగుతున్నాడని కలత చెందిన అక్బర్, కొడుకుని యుద్ధానికి పంపిస్తాడు.
తిరిగి వచ్చాక అక్బర్‌ ఆస్థాన డాన్సర్లలో ఒకరైన నాదిరాని యిష్టపడతాడు. అక్బర్ ఆమె కళ చూసి ‘అనార్కలి’ (దానిమ్మ మొగ్గ) అంటాడు.సలీంతో అనార్కలి గాఢమైన ప్రేమలో వుందని గమనించిన మరో ఆస్థాన నాట్యకారిణి ప్రేమ రహస్యం బైటపెడుతుంది. అక్బర్‌ ఆగ్రహంతో వూగిపోతాడు. అది జరగని పని అంటాడు. సైన్యాన్ని పోగేసిన సలీం, తండ్రిపై యుద్దానికి వెళతాడు. ఓడిపోతాడు. సలీంకి మరణశిక్ష వేస్తాడు చక్రవర్తి. అయితే ఎక్కడో దాక్కుని వున్న అనార్కలి వచ్చి, యీ శిక్షకి తాను సిద్ధం అంటే సలీంని వదిలేస్తామని చెబుతారు. బైటికి వచ్చిన అనార్కలి సరే అంటుంది. ఆమెని సజీవ సమాధి చెయ్యాలని అక్బర్ ఆదేశం. శిక్షకి ముందు కొన్ని గంటలు సలీంతో గడిపే అవకాశం యివ్వాలని అనార్కలి అభ్యర్థిస్తుంది. అందుకే ఓ షరతు పెడతాడు అక్బర్‌, ఆమె సజీవ సమాధిని కొడుకు అడ్డుకోకుండా వుండడానికి సలీంకి మత్తు మందు యివ్వాలని అంటాడు. అనార్కలి అంగీకరిస్తుంది.
***
అక్బర్ యిచ్చిన మాటని గుర్తు చేస్తూ కూతురి ప్రాణాలు కాపాడాలని కోరుతుంది తల్లి.
మనసు మార్చుకున్న అక్బర్‌, అనార్కలిని విడుదల చేయాలని అనుకున్నా, దేశం పట్ల బాధ్యతని విస్మరించలేకపోతాడు. తల్లీ కూతుళ్ళు రహస్య మార్గం గుండా దేశం విడిచి వెళ్లి పోవాలనీ,
వాళ్ళు సజీవంగా వున్నట్టు సలీంకి ఎప్పటికీ తెలియకూడదనీ చెబుతాడు. నరాలు తెగే ఉద్వేగంతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది.
***
కథ హృదయానికి హత్తుకునేలా వున్నా,చరిత్రలో అసలు అనార్కలి అనే ఆమె లేదని అంటారు. ఈ సినిమా చరిత్రని వక్రీకరించిందనీ, అతి నాటకీయత, కమర్షియల్‌ మసాలా కలిపి కొట్టారనీ విమర్శకులు గట్టిగానే అన్నారు. అయినా యింత మహత్తరమైన సినిమా భారతీయ వెండితెరమీద మునుపెన్నడూ చూడలేదనీ ఒప్పుకున్నారు.మొగలే ఆజంకి సంగీతం ఆత్మ అనీ, నౌషద్‌ అలీ పేరు చరిత్రలో నిలిచిపోతుందనీ పత్రికలు రాశాయి. ఆర్‌.డి. మాథుర్‌ అసాధారణమైన సినిమాటోగ్రఫీ
ఈ సినిమాని మరపురాని ఒక HISTORIC DOCUMENTగా రూపుదిద్దింది.
ఆసిఫ్‌ రాసిన వెండితెర కవిత్వానికి సంగీతామృతంతో నౌషాద్‌ ప్రాణం పోస్తే,
ఆ గాథని ప్రేమకావ్యంగా మలిచినవాడు మాథుర్‌.
***
dileep2
#ఫలితమ్!
తొమ్మిదేళ్ళ సుదీర్ఘ శ్రమకి ప్రతిఫలంగా
కోట్ల రూపాయల లాభాల్తో నిర్మాతలు
పండగ చేసుకున్నారు.
***
1960లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలచిన
మొగలే ఆజం రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులూ గెలుచుకుంది.
***
సౌందర్యరాశి మధుబాల ఆ తెలివెన్నెల నవ్వుతో,
ఆ సొగకళ్ళ చూపుల్తో భారతీయ యువకులెవ్వరికీ నిద్ర పట్టకుండా చేసింది.
******
#REAL_LIFE_LOVE_STORY
సినిమా తీస్తున్నపుడు దిలీప్‌ కుమార్‌, మధుబాల నిండా ప్రేమలో మునిగివున్నారు. వాళ్ల తొమ్మిది సంవత్సరాల ప్రేమకథకి మధుబాల తండ్రి అడ్డు పడ్డాడు. మధుబాల బాగా హర్ట్‌ అయిపోయింది. వాళ్ళ మధ్య మాటల్లేకుండా పోయాయి. ఆసమయంలో హీరోహీరోయిన్ల మీద గాఢమైన ప్రేమ సన్నివేశం చిత్రీకరించాల్సి వుంది. నేపథ్యంలో బడేగులాం అలీఖాన్ పాట, ఎడమొహం పెడమొహంగా వున్న దిలీప్‌, మధుబాలకి నచ్చజెప్పి ఒప్పించి, చివరికి ఆ సన్నివేశాన్ని
అద్భుతంగా పండించాడు ఆసిఫ్‌
***
1960 ఆగస్టు 5 : బొంబాయి సినీ స్టూడియోల్లో మండే రాజస్తాన్‌ ఇసక ఎడారిలో ఒక మహా సంగ్రామమే చేసిన ఆసిఫ్‌,ఎట్టకేలకు మొగలే ఆజమ్‌ని రంగరంగవైభవంగా విడుదల చేశాడు.
ఆ దిగ్భాంతి నుంచి తేరుకోడానికి భారతీయ సినీ సమాజానికి చాలా ఏళ్ళు పట్టింది.
సత్యజిత్‌రే, కేవీరెడ్డి, ఆసిఫ్‌ అనే త్రివేణీ సంగమంలో భారతీయ ‘చిత్రకళ’ పుణ్యస్నానం చేసింది. ఉత్తమాభిరుచి, ఉన్నతమైన కళ, నిప్పులాంటి నిబద్ధత… వినూత్న సృజన్మాతక ద్వారాలు తెరిచాయి. సినిమా వైపు చూస్తున్న కొత్త తరానికి వెలుతురు దారులు పరిచాయి.
***
1960లోనే మే నెల ఆరోతేదీన విడుదలైన ‘కోహినూర్‌’ సూపర్‌హిట్‌ అయింది. మీనాకుమారి, దిలీప్‌కుమార్‌ నటించిన ఈ సినిమా నిర్మాణానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అయింది.
దానికి కూడా సంగీతం నౌషాద్‌ అలీనే. 1955-60 ఈ అయిదు సంవత్సరాలు భారతీయ సినీ చరిత్రని మేలి మలుపు తిప్పాయి.
***
#ఆసిఫ్‌_కల_పండిన_రోజు
***
అందమైన అలంకరణలో మెరిసిపోతున్న ఏనుగులు రోడ్ల మీద నడిచి వెళ్లడాన్ని ఆశ్చర్యంతో
చూస్తున్నారు బొంబాయి జనం. మహాలక్ష్మి ఫిల్మ్ స్టూడియో నుంచి కాంతులీనుతున్న
‘మరాఠా మందిర్‌’ థియేటర్‌కి, మొగలే ఆజమ్‌ సినిమా రీళ్ళు వున్న అల్యూమినియం
ఫిల్మ్‌ బాక్సులు తీసుకుని వెళ్తున్నాయి.ఆ ఏనుగులు.గ్రాండ్‌ ప్రీమియర్‌ షో కోసం
వస్తున్న బొంబాయి నగర ప్రముఖులతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. మర్నాడు అక్కడి
దినపత్రికల్లో యిదే ప్రధాన వార్త !
***
deleep4
#1960_ఆగస్ట్‌_5: GAME CHANGER
***
మొగలే ఆజం విడుదలై కలెక్షన్ల కనకవర్షంతో తడిసి ముద్దయింది. ఇప్పుడు, సల్మాన్‌ఖాన్‌, ప్రభాస్‌ సినిమాలు మూడు నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఐతే 60 ఏళ్ళ క్రితమే మొగలే ఆజమ్‌ని హిందీ,తమిళ, ఇంగ్లీష్‌ భాషల్లో తీశారు. అంటే ప్రతి సీనూ మూడేసి సార్లు షూట్‌ చేశారు. హిందీ నటులకు తమిళ్‌ రాకపోవడంతో ‘లిప్‌సింక్‌’ తో లాగించేశారు. మొగలే ఆజమ్‌ తమిళ వెర్షన్ అట్టర్‌ ప్లాప్‌ అయింది. ఇంగ్లీష్‌ వెర్షన్‌ రెడీ అయినా ప్రొఫెషనల్‌ ఆంగ్ల నటుల్తో డబ్బింగ్‌ చెప్పించాలని అనుకున్నారు. తమిళ ప్లాప్‌తో ఆ ఆలోచన మానుకున్నారు. డిజిటల్‌గా కలర్‌ చేసిన మొగలే ఆజమ్‌ని 2004లో భారత దేశం అంతటా రిలీజ్‌ చేశారు. జనం మళ్ళీ అదే ఉత్సాహంతో చూశారు. కళాత్మక సృజన కాసులై కురిసింది.
***
16వ శతాబ్దానికి చెందిన ఒక కథ ఆధారగా, నాటక రచయిత ఇంతియాజ్ అలీ 1922లో ఒక నాటకం రాశారు. 1928లో అనార్కలి మూకీ ఫిల్మ్‌ వచ్చింది. 1935లో టాకీ తీసి విడుదల చేశారు. దాన్ని మొగలే ఆజమ్‌ పేరుతో తీద్దామని 1940లో కుర్ర ఆసిఫ్‌, నిర్మాత షిరాజ్‌ అలీ హకీం ఉత్సాహపడ్డారు.
జీనత్‌ అమన్‌ తండ్రి అమానుల్లా ఖాన్‌ (అమన్‌ ) కమాల్‌ అంరోహి, మరో యిద్దరితో కథ,డైలాగులు రాయించారు. 1946లో బాంబే టాకీస్‌ స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టారు. ఉధృతంగా స్వాతంత్ర్యోద్యమం నడుస్తుండటం,దేశ విభజన విషాద సంఘటనల వల్ల సినిమా నిర్మాణం ముందుకు సాగలేదు.
***
విభజన కాగానే నిర్మాత ఫిరోజ్‌ పాకిస్తాన్‌ వెళ్లిపోయాడు. ప్రసిద్ధ వ్యాపారవేత్త షాపూర్జీ పల్లోంజి డబ్బులు పెడతాడని ఫిరోజ్‌ చెప్పి వెళ్లాడు.1949లో నటుడు చంద్రమోహన్‌ చనిపోయాడు. అక్బర్‌ చక్రవర్తి చరిత్రపై ఎంతో మక్కువ వున్న పల్లోంజి, నిర్మాతగా వుండడానికి 1950లో వొప్పుకున్నాడు. అయితే, వీళ్ళతో సంబంధం లేకుండా, అదే కథతో బీనారాయ్‌, ప్రదీప్‌ కుమార్‌లు హీరో హీరోయిన్లుగా ‘అనార్కలి’ 1953లో విడుదల అయింది. నందలాల్‌ జస్వంత్‌లాల్‌ తీసిన
ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.
***
అతి ఖరీదైన చిత్ర నిర్మాణానికి ఆసిఫ్‌,పల్లోంజి సిద్ధం అయ్యారు. అనార్కలి పాత్రకి నర్గీస్‌, సురయా అని వూగిసలాడి చివరికి మధుబాలని ఎంపిక చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎం.కె సయ్యద్‌ విలాసవంతమైన సెట్లు వేశాడు. లాహోర్‌ కోటలో వుండే శీష్‌మహల్‌ని ప్యార్‌ కియాతో డర్నా క్యా పాట కోసం
బొంబాయిలో తిరిగి నిర్మించారు. దాని కోసం చిన్న చిన్న వందల వేల బెల్జియం అద్దాలు వాడారు. ఫిరోజాబాద్‌ కార్మికులు దాన్ని డిజైన్‌ చేశారు.జర్దోసీ ఎంబ్రాయిడరీ నిపుణులైన ఢిల్లీ దర్జీలు
మొగల్‌ దుస్తులు తయారు చేశారు. ఆగ్రా నుంచి చెప్పులు, హైదరాబాద్‌ నుంచి నగలు తెప్పించారు. కొల్హాపూర్‌ వాళ్ళు కిరీటాలు చేశారు.కత్తులూ, డాళ్ళూ, బాణాల, ఆయుధాలూ రాజస్థాన్‌లో తయారుచేయించారు. జోధాభాయి ప్రార్థించే శ్రీ కృష్ణుని విగ్రహం బంగారంతో చేయించారు. అక్బర్‌,సలీంల యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో 2000 ఒంటెలు, 400 గుర్రాలు, 8000 మంది సైనికుల్ని వాడారు.
***
భారత ఆర్మీ జైపూర్‌ అశ్విక దళాన్ని రప్పించారు. ఎడారి ఎండలో భారీ కాస్ట్యూమ్‌లతో పృథ్వీరాజ్‌ కపూర్‌, దిలీప్ కుమార్‌ పడిన బాధలు చెప్పనలవికాదు. కొన్ని సన్నివేశాల్లో ఇసుకలో
వొట్టి కాళ్ళతో నడిచినపుడూ డైలాగ్‌ కుదరక టేకుల మీద టేకులు తీస్తున్నపుడూ నటులు నరకం చూశారు. ఒక దశలో ఈ ఆసిఫ్‌తో పడలేం. సినిమా ఆపేద్దాం అనుకున్నారు నిర్మాతలు. గుండె జబ్బు వున్న మధుభాల ఒక్కోసారి సెట్స్‌లో కళ్ళు తిరిగి పడిపోయేది. అయినా, తెగించి నటించి ఆ పాత్రకి జీవం పోసింది. కొన్ని సన్నివేశాలని 14 కెమెరాలతో షూట్‌ చేశారు. ఒక్క షాట్ తీయడానికి ఫోటోగ్రాఫర్‌ మాథుర్‌ ఎనిమిది గంటల సమయం తీసుకునేవాడు. వందల మంది ఆర్టిస్టులూ, శిక్షణ పొందిన జంతువులతో రాత్రీపగలూ షూటింగ్‌ చేయడం మాటలు కాదు. అందరూ ఒక దీక్ష, పట్టుదల, పూనకంతో పని చేశారు.
***
deleep3
#ఆసిఫ్‌_అసలు_జీవితం:
***
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో 1922 జూన్‌ 14న కె. ఆసిఫ్‌ జన్మించారు. దర్శక నిర్మాతగా,స్కీన్‌ ప్లే రైటర్‌గా పేరుపొందారు. 1945 నుంచి 1971 దాకా సినిమాలు తీశారు. ఆసిఫ్‌ మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య అక్తర్‌, దిలీప్ కుమార్‌ చిన్న చెల్లి. వీళ్ళకి ఆరుగురు పిల్లలు.
తర్వాత ఆసిఫ్‌ చేసుకున్న యిద్దర్నీ అక్తర్‌ గౌరవంగా చూశారు. సంప్రదాయ బద్ధంగా వుండే అక్తర్‌, చివరిదాకా భర్తతోనే వున్నారు. గాయని,నటి సితారాదేవి రెండో భార్య. కొన్ని నెలల తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మన హైదరాబాద్‌కి చెందిన నిగర్‌ సుల్తానా ఆయన మూడోభార్య. వాళ్ళకో కూతురు. నిగర్‌ మొగలే ఆజమ్‌లో ఒక ముఖ్య పాత్ర వేశారు. ఆమె కూతురు హీనా కౌసర్‌ చిన్న నటి. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు UNDER WORLD GANGSTER ఇక్బాల్‌ మిర్చిని పెళ్లి చేసుకోవడంతో హీనా పాపులర్‌ అయింది. ఉత్తమ దర్శకునిగా అవార్డులు పొందిన ఆసిఫ్‌
48 ఏళ్ళ వయసులో 1971 మార్చిలో మరణించారు. ఆసిఫ్‌ అసంపూర్ణంగా తీసిన ‘లవ్‌ అండ్‌ గాడ్‌ ‘ సినిమాని మొదటి భార్య అక్తర్‌ 1986లో విడుదల చేశారు.
***
#సంగీత_దర్శకుడు_నౌషాద్_అలీ!
1919 డిసెంబర్‌ 25న లక్నోలో పుట్టారు. ఆయన కంపోజర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, నిర్మాత, రచయిత, కవి. 1940 నుంచి 2005 దాకా ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం కూర్చారు. ఆయన సంగీతంలో 1944తో వచ్చిన ‘రతన్‌’ విజయం సాగించింది. అప్పట్లో నౌషాద్‌ తల్లి కొడుక్కి ఓ ఉత్తరం రాశారు. “నాన్నా… మన వూరొచ్చి పెళ్ళి చేసుకో. ఒక అమ్మాయిని చూశాను. ఇక్కడ వాళ్ళతో సినిమాలూ, పాటలూ అని పిచ్చి మాటలు చెప్పకు. మా వాడు బొంబాయిలో పెద్ద టైలరింగ్‌ షాపులో కాజాలు తీస్తుంటాడు అని చెప్పాను. ఆ మాటే నువ్వూ చెప్పు”
***
తల్లి మీదున్న ప్రేమతో సొంత వూరెళ్లి పెళ్లి చేసుకున్నాడు నౌషాద్‌. అయితే అతను ప్రఖ్యాత బాలీవుడ్‌ సంగీత దర్శకుడని అక్కడ ఎవరికీ తెలీదు. పెళ్ళి వూరేగింపులో మొహానికి మల్లె పూమాలలు కట్టుకుని, గుర్రంమీద నౌషాద్‌ వెళుతుంటే, అటూయిటూ వున్న బాండ్ మేళం వాళ్ళు నౌషాద్‌ ‘రతన్‌ లోని పాటలే వాయించారు. అవి తాను కట్టిన పాటేలేనని ఒక్క నౌషాద్‌కి మాత్రమే తెలుసు !
***
#బేగం_ముంతాజ్‌_జెహాన్_దెహ్లవి!
***
అందాల నటి మధుబాల అసలు పేరది.దిలీప్ కుమార్ని ప్రేమించినా, ఆమె తండ్రి పడనివ్వలేవు. 1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టిందామె. మొగలే ఆజమ్‌ విడుదలైన 1960లోనే గాయకుడు కిషోర్‌ కుమార్ని పెళ్లి చేసుకుంది. గుండె జబ్బు వల్ల 36 ఏళ్ల వయసులోనే 1969లో ఆమె మరణించారు.
మొగలే ఆజం నటుల్లో ఇప్పటిదాకా బతికివున్నది, ఇప్పుడు దూరమైంది ఒక్క దిలీప్‌ కుమార్‌ మాత్రమే. కోటిన్నర ఖర్చుతో తీసిన మొగలే ఆజం 11 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.
***
__ తాడి_ప్రకాష్ _09704541550

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions