ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు సెలయేరు..
ననుగన్న నావాళ్లు.. కౌగిళ్ల లోగిళ్లంటూ.. ఊరూరా పాడుకునేలా చేసి..
ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న
సీతారాముడి కలానికి.. వన్నెలద్దిన రాగమది..
అందుకే ఆ “మామ” రాగం మనందరి హృదయాల్లో వీణలు మీటిన మెలోడియస్ సాంగైంది.. ఎందుకంటే, జనహృదయతాళమే ఆయన పాటకు తాళం కనుక!
పరవశాన శిరసూగంగా.. ధరకుజారేనా ఆ గంగా.. నా గానలహరి నువు మునగంగా.. ఆనందవృష్టినే తడవంగా అంటూ.. తన తల నుంచి ఇలకు గంగమ్మను పంపే గంగేశ్వరుణ్ని తమకంలో ముంచిన పాట కదా.. అది?!! అప్పటివరకూ సినీగీతాలాపనలో బాలుడిలానే కొనసాగిన బాలూని గానగంధర్వుణ్ని చేసిన గీతం కదా.. అది..?!!
Ads
పేకల్లో జోకర్ లా ఎవడే ఈ షోకిన్ లా మ్యాజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే అంటూ ఆటపట్టించే పాటైనా… రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అంటూ గోరంతదీపం కోసం వెతుకులాడే హృదయవిదార గీతమైనా మామ మదిలోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాలే మరి!
శృతినీవు గతినీవు ఈనాకృతి నీవు భారతీ అంటూ ఆ విద్యాసరస్వతిని వేడుకుంటూనే… తన కెరీర్ కొనసాగింపులో భాగంగా లేలే లేలేలే నా రాజా అనేటువంటి శృంగారగీతాలతో ఆకట్టుకున్న ఆల్ ఇన్ వన్ మహదేవన్.
కలియుగమున్నంతవరకూ… సంగీత పరిశ్రమ వేళ్లూనుకున్నంతవరకూ… గుహుడు ఆ రాముణ్ని కొల్చే రామయ్య తండ్రీ.. ఓ రామయ్య తండ్రి.. మానోములన్ని పండినాయి రామయ్య తండ్రంటూ ఎత్తుకున్న రాగమైనా… మంచిమనసుల్లో ఏవండీ శ్రీవారు ఒక చిన్నమాట అంటూ అలిగివెళ్తున్న అక్కినేనిని ఊరడిస్తూనే ఆటపట్టించే సావిత్రి మత్తుచూపుల కవ్వింపు సాంగైనా… ఆ సినీపాటల గ్రంథసాంగుడి గ్రంథాలయమేగా అందుకు కార్ఖానా?!!
గోదారీ గట్టుంది… గట్టుమీద చెట్టుంది… చెట్టుకొమ్మన పిట్టుంది… పిట్టమనస్సులో ఏముందంటూ ప్రశ్నిస్తూనే ప్రారంభమయ్యే రొమాంటిక్ గీతమైనా.. చేతిలో చెయ్యేసి చెప్పుబావా అంటూ దసరాబుల్లోణ్ని ఒట్టేయుంచుకునే వాణిశ్రీ పలుకులైనా… నేను పుట్టాను లోకం మెచ్చింది… నేను ఏడ్చాను లోకం నవ్వింది… నేను నవ్వాను లోకం ఏడ్చింది… నాకింకా ఈ లోకంతో పని ఏముందీ.. డోంట్ కేరంటూ లోకపు తీరుపై మద్యం మత్తులో బోల్డుగా కుండబద్ధలు కొట్టే ఒకింత ఫ్రస్ట్రేషనైనా.. ఎదగడానికెందుకురా తొందరా… ఎదరబతుకంతా చిందరవందర అంటూ అందాలరాముడు చిన్నారులను లాలించి బుజ్జగించినా.. ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ పాడుకునే ద్వందార్థాల చిలిపిగీతమైనా… ఝమ్మంది నాదం సయ్యంది పాదమంటూ సిరిసిరిమువ్వలు మ్రోగించినా… నెమలికి నేర్పిన నడకలివి… మురళికి అందని పలుకులివీ అంటూ ఓ నాట్యగత్తె తన ప్రతాపాన్ని పట్టిచూపినా.. వరుడి చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు నడిచే సప్తపదికి.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన… గోధూళి ఎర్రన… ఎందువలన అంటే అది దైవఘటన అంటూ విశ్వనాథామృతానికి అద్భుతమైన స్వరవిన్యాసం చేసినా.. అవి మామ మదిలోని మానసపుత్రికలేగా.. మరి?!!
అంతేనా..? జోలాజోలమ్మజోలా జేజేలా జోలా అంటూ … తన ప్రేమకు సూత్రధారైన భానుచందర్ ను జోలపాడే ప్రేమగీతమైనా.. శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లిపుస్తకానికి శ్రీకారం చుట్టి.. వైవాహిక సన్నివేశాలను కళ్లకుగట్టే వివాహవేడుక గీతమైనా… ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ.. ముత్యైదు కుంకుమ బతుకెంతో ఛాయా అంటూ ఓ మహిళకు పసుపు, కుంకుమలెంత ప్రాధాన్యమో తెలియజెప్పే ముత్యాలముగ్గైనా.. ఇన్నిరాసులయునికి ఇంటిచెలువకు రాశంటూ ఆ అన్నమయ్య గీతాన్నే సినీగీతంగా మల్చినా… ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదమై.. విధాత తలపున ప్రభవించిన అనాది జీవనవేదమది. అందుకే ” మామగా” వినుతికెక్కిన మహదేవన్ అజరామర పాటనోసారి తల్చుకుంటూ… ఆయన జన్మదినాన ఓసారి ఆయన యాదిలో…. 🙏…… By…. రమణ కొంటికర్ల
Share this Article