ఎలా రాయాలి? ఒక వారం రోజులుగా ఇదే ఆలోచన. ఆమె మరణవార్త తెలిసాకే మిగిలిన వివరాలు తెలుస్తున్నాయి. కానీ నాకింతవరకు ఆమెతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయం లేదు.
నా స్నేహితులు, FaceBook స్నేహితులు చాలామందికి ఆమె తెలుసు. వారు ఒక్కొక్కరు పంచుకున్న వివరాలు తెలిసాక దుఃఖంతో పాటు సిగ్గు వేసింది. ఇన్నాళ్లు ఎందుకు తెలుసుకోలేదా అని.
ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలరా అనే ఆశ్చర్యంతో పాటు ఎందరికో స్ఫూర్తి దాతగా నిలవడమంటే మాటలు కాదు. అటువంటి అరుదైన సాయిపద్మ గురించి నాలుగు మాటలు రాయాలనిపించింది.
Ads
కొద్దిపాటి శారీరక తేడాలకే కుమిలిపోతూ సెల్ఫ్ పిటీ లో బతికేవారు లెక్కలేనంతమంది.
తమ లోపాలకు తల్లిదండ్రులదే బాధ్యత అంటూ బ్లాక్ మెయిల్ చేసేవారూ కోకొల్లలు.
ఏ పనీ చేయకుండా దానికి వైకల్యం కారణమనే వారినీ చూస్తున్నాం
కానీ ఈవిడేంటి? ఊహ తెలియని వయసులోనే అనారోగ్యం, ఆపై దిక్కులేనన్ని ఆపరేషన్లు. పైగా కుటుంబంలో అందరూ వైద్యులే. అంతా పద్మ తన కాళ్ల మీద నిలబడాలని తపించినవారే. అలా నిలబడే క్రమంలో తనవారందరినీ కోల్పోయింది. కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉంది. అప్పుడే ఆమె తిరిగి జన్మించింది. జీవితం అనుభవించడానికే గానీ బాధ పడటానికి కాదని తెలుసుకుంది. చదువుకుంది. సంగీతం కూడా నేర్చుకుంది. ఆర్థికంగా వెనకబడిన వారి పిల్లల కోసం ‘గ్లోబల్ ఎయిడ్’ సంస్థ నెలకొల్పి ఎందరో చిన్నారుల జీవితాల్లో నవ్వులు పూయించిన చల్లని తల్లి.
వికలాంగులకు కోరికలుండవా? వారు అందరిలాగే పెళ్లి చేసుకోకూడదా అని ప్రశ్నించి తన సహచరుడిని ఎంపిక చేసుకున్న ధీర. అనేక సభలు, సమావేశాల్లో తన జీవన సాఫల్యాన్ని వివరించిన సాహసి. ఆమె సేవా కార్యక్రమాలకు పలు పురస్కారాలూ అందుకున్నారు. అటు అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధైర్యం నూరిపోసేవారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు. శారీరక వైకల్యం కన్నా మానసిక వైకల్యం చేటు అని పద్మ అభిప్రాయం. ఇటీవలే యూట్యూబ్ ద్వారా చిన్న చిన్న వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇంతలోనే హఠాత్తుగా శాశ్వతంగా శెలవు తీసుకున్నారు.
ఆమెను కలిసిన వారిలో నాకు తెలిసిన చంద్రక్కని అడిగాను పద్మ గురించి. ‘ఎలా చెప్పాలో తెలియడం లేదు శోభా! ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి. అంత పాజిటివిటీ నేను ఎక్కడా చూడలేదు. జీవితాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేవారు’ అంది. నిజమే కదా అంతులేని చింతలతో జీవితాన్ని బాధామయం చేసుకోకుండా సాయి పద్మ దృక్పథం అలవరచుకుంటే ఎంత బాగుంటుంది? రియల్లీ మిస్ యూ పద్మగారూ!
వికసిత పద్మం
– కర్ణాటక సంగీతంలో డిప్లొమా (ఆమె గొంతు ఎన్నో ఆపరేషన్ల తర్వాత సాధ్యమైందని గుర్తుంచుకోవాలి)
– కవయిత్రి
– మోటివేషనల్ స్పీకర్
– పారా స్పోర్ట్స్ ప్రమోటర్. అంతేకాదు పారా ఎయిర్ రైఫిల్ శిక్షణ పొంది క్యాంప్స్ నిర్వహించారు
-2017 లో బిబిసీ వారి 100 విమెన్ ఛాలెంజ్ లో ఎంపికైన ప్రభావశీలురైన మహిళల్లో ఒకరు
– కోస్తా తీరప్రాంతాల ప్రజలు, పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు… -కె. శోభ shobhas292@gmail.com
Share this Article