.
పంథొమ్మది భాషలు 20 వేల పాటలు… వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్… నిజానికి ఈ సంఖ్య కాదు వాణిజయరాం గాత్రమాధుర్యాన్ని, విశిష్టతను పట్టించేది… ఆమె పాడిన పాటలు ఆమె ఏమిటో చెబుతాయి… 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాథ్ నిర్మొహమాటంగా ఆమెనే ఎంచుకున్నాడు… ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం… ఆ గొంతులో ఆ శ్రావ్యత…
ఆనతి నీయరా హరా… శివానీ, భవానీ… తెలిమంచు కురిసింది… పాటలు వినడం పూర్తయ్యాక కూడా కొంతసేపు అలా అలా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి… చర్వితచరణంగా… గానంలా…! పాటలోకి తాదాత్మ్యతను తీసుకురావడం ఎలా..? అది వాణిజయరాంనే అడగాలి… ఒక సుశీల గ్రేట్, ఒక జానకి కూడా గ్రేట్… హిందీలోకి వెళ్తే ఒక లత, ఒక ఆశ… అందరూ గ్రేటే… ఆ గ్రేట్‌నెస్‌లన్నీ ఒక్కచోట కుప్పపోసిన గొంతు మాత్రం వాణీజయరాందే… జన్మనామం కళైవాణి…
Ads
అవో ఇవో గుర్తుచేసుకోవడం దేనికి..? అదే విశ్వనాథ్ తీసిన సినిమా శృతిలయలులో ఆలోకయే శ్రీబాలకృష్ణం, ఇన్నిరాసుల ఉనికి పాటలు కూడా అనితర మధురమే కదా… జగమెరిగిన శంకరాభరణంలో… బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, ఏ తీరుగ నను దయచూచెదవో, మానస సంచరరే… అన్నీ ఆమె గాత్రజననాలే… పూజలు సేయ పూలు తెచ్చాను పాటను పరవశంతో వినని చెవులు చెవులేనా..?
విధి సేయు వింతలన్నీ అంటూ మరోచరిత్రలో పలవరిస్తుంది… భక్తి పాటలే కాదు, రక్తిపాటలూ అంతే అబ్బురంగా పాడి మెప్పించింది… వయసు పిలిచింది సినిమాలో నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా అని గోముగా ఆటపట్టిస్తూ, ఆకాంక్ష రేపుతూ సాగుతుంది గీతం… సీతాకోకచిలుకలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, సాగరసంగమమే, అలలు కలలు పాటలు ఈరోజుకూ చిరగాననీయమే…
స్వర్ణకమలంలో అందెల రవళిది పాట ఆమె నోటకన్నా శ్రావ్యంగా ఎవరు పాడగలరు..? తెలుగులో ఎక్కువగా సంగీత ప్రధానమైనవి, భావాత్మకమైనవి మాత్రమే ఆమెతో పాడించారనేది కరెక్టు కాదు… ఉదాహరణకు ఘర్షణ సినిమా కోసం ఇళయరాజాా ఆమెతో రోజాతోె లేతవన్నెలే, ఒక బృందావనం, కురిసేను విరిజల్లులే వంటి కమర్షియల్ ఛాయలున్న పాటల్నీ పాడించాడు… అవెంత సూపర్ హిట్టో తెలుసు కదా… అలాంటివీ బోలెడున్నాయి…
చెబుతూ పోతే జాబితా తెగదు… నిజానికి సుశీల, జానకి ప్రాబల్యాన్ని తట్టుకుని నిలబడింది వాణీజయరాం మాత్రమే కావచ్చు దక్షిణ సినిమాల్లో… సంఖ్యను పక్కన పెడితే పాటల్ని ఎంత జనరంజకంగా పాడిందో ప్రామాణికం… ఆ పరీక్షలో వాణిది ప్రతి పాటలోనూ డిస్టింక్షనే… తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం భాషల్లో ఆమెకు ఎక్కువగా కో-సింగర్ బాలసుబ్రహ్మణ్యమే… లేదంటే సోలో సాంగ్స్… మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు ఆమె సొంతం…
ఆమె పాడిన భాషలు… తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం మాత్రమే గాకుండా గుజరాతీ, మరాఠీ, మార్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒరియా, ఇంగ్లిష్, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు… ఇంకేం మిగిలాయని..!!
77 ఏళ్ల వయస్సు వరకూ ఆమె సంపూర్ణ సార్థక జీవనాన్ని గడిపింది… కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ ఆమె చేతుల మీదుగా అందుకుని ఉంటే, మరింత బాగుండేది… కానీ విధి సేయు వింతలన్నీ అని ఆమే ఏదో పాటలో పాడినట్టు… మన చేతుల్లో ఏముంది..? మరోసారి స్మరించుకుని, ఘనంగా నివాళి అర్పించడం మినహా..!!
Share this Article