A. Saye Sekhar…. నిన్న, అంటే మే 27… అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యా మంత్రి శ్రీమతి యెర్నేని సీతాదేవి హైదరాబాదులో కన్నుమూశారు… న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో ఆ వార్తలు చదవగానే మనస్సు కలుక్కుమంది, కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి…
ఆమె నాకు బాగా తెలుసు… కానీ నేనే ఆమెకు పెద్దగా తెలియదు… నేనేమీ ఆమెకు సన్నిహితుడిని కాను, ఏమీ కాను… కానీ ఆ పేరు చూడగానే పాత సంగతులు, నా అనాలోచిత చిలిపి వ్యాఖ్యలు, ఆమె సహృదయంతో ఓ కొడుకుగా నన్ను సాదరంగా క్షమించేసిన వైనం గుర్తొచ్చింది… నిజానికి అదొక మధురమైన జ్ఞాపకం అనాలో వద్దో నాకు తెలియదు, చెప్పలేకపోతున్నాను…
అందరికీ తెలుసు… సీతాదేవి గౌరవప్రదమైన ప్రవర్తన తీరు, మర్యాదస్తురాలు, మృదుస్వభావి… ఏ వివాదంలో తలదూర్చరు… 2013లో బీజేపీలో చేరారు, కానీ అక్కడ ఆమెకు సముచిత గౌరవం, పోస్టులు ఏమీ దక్కలేదు, సరే, అదిక్కడ సందర్భోచిత ప్రస్తావన కాదు… దానికంత ప్రాముఖ్యత కూడా లేదు…
Ads
ఆమె 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు… అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ఆమెకు విద్యాశాఖను అప్పగించారు… ఆమె ఆ పోర్ట్ ఫోలియోను సమర్థంగా, వివాదరహితంగా, గౌరవప్రదంగా నిర్వహించారు… ఆమె ప్యానల్ స్పీకర్ కూడా… కానీ 1989 ఎన్నికల్లో ఓడిపోయారు… అప్పట్లో చాలామంది టీడీపీ వాళ్లు ఓడిపోయారు…
మళ్లీ 1994లో తిరిగి ఎన్నిక… మళ్లీ తెలుగుదేశం గాలి వీచింది కదా… మంచి రికార్డు మెజారిటీతో గెలిచారామె… అలా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లో దిగి, మొయినాబాద్, అంటే ఎన్టీయార్ నివాసమైన ‘తెలుగు విజయం’లో సమావేశం కావాలి… ఇదీ పార్టీ నిర్దేశించిన భేటీ… అదేనండీ, దాన్ని గండిపేట ఆశ్రమం అనేవారు…
ఇది డిసెంబర్ 1994… ఉదయం… క్యాంపస్ మొత్తం పసుపు రంగు పులుముంది… ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరైతేనేం… పసుపు దుస్తుల్లో హాజరు… మహిళలు పసుపు చీరెల్లో… ఒక్కొక్కరే వాహనాల్లో వస్తున్నారు, దిగుతున్నారు… అందరూ వచ్చాక పెద్దాయన వచ్చి, నేరుగా ఆశ్రమ మైదానంలో పార్టీ జెండా ఎగురవేయాలనేది పార్టీ ప్లాన్…
ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీ జెండా ఎగురవేసే ప్రాంతం వైపు నడుస్తున్నారు, అక్కడ ఉన్న చిన్న గద్దెల మీద పాత్రికేయులు కూర్చున్నారు… నేను తెలుగుదేశం బీట్ రిపోర్టర్‌ను కదా, చాలామంది తెలుసు నాకు… కొందరు కొత్తవాళ్లు తెలియదు… నాతో ఉన్న సహవిలేఖరులు ఎవరెవరు ఏ నియోజకవర్గమో, ఏం పేరో చెప్పాల్సిందిగా నన్ను కోరారు… మనకూ ఆనందమే కదా…
ఒక్కొక్కరూ వస్తున్నారు, నేను చెబుతున్నాను, అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అంటే, శాటిలైట్ టీవీలు లేవు, యూట్యూబర్లు ఊహల్లోనే లేరు… డిజిటల్ మీడియా ఊసే లేదు… పత్రికల విలేకర్లు మాత్రమే… టీవీ అంటే సంజీవ్ థామస్, రేడియో అంటే భండారు శ్రీనివాసరావు… అంతే… సంజీవ్ థామస్ నా పక్కనే కూర్చున్నారు…
ఒక అందమైన స్త్రీ, పసుపు పట్టు చీర ధరించి, మా వెనుక వైపు నుండి నడుస్తోంది… సంజీవ్ నన్ను అడిగాడు “ఆమె ఎవరు?”… అంతకు ఒక ఏడాది ముందే అర్జున్, మధుబాల నటించిన జెంటిల్‌మన్ సినిమా వచ్చింది… అందులో ముదినేపల్లి మడి చేలో… ముద్దుగుమ్మా అనే హిట్ పాట ఉంది… ఆ పాటకూ ఈ ఎమ్మెల్యేకూ సంబంధం ఏముందిలే గానీ… ఆమె నియోజకవర్గం ముదినేపల్లి, ఈమె అందగత్తె… వెంటనే నా నోటి నుంచి చిన్నగా ఆ పాట పల్లవి కాజువల్‌గా వచ్చేసింది…
పాడాక నేనే నాలుక కర్చుకున్నాను… ఆమె విని ఉండదులే అనుకున్నాను… కానీ ఆమె విన్నారు… వెనక్కి తిరిగి చూశారు, ఆమె మొహంలో కోపం లేదు, చిరునవ్వు… నాకు ఇబ్బందిగా ఉంది, అసలేమిటి, అనాలోచితంగా అలా పాడాను… నేరుగా నా దగ్గరకు వచ్చింది, అందరూ లేచి నిల్చున్నాం… నా భుజం మీద చేయి వేసి నువ్వెవరు అనడిగారు సూటిగా… నేను డీసీ రిపోర్టర్‌నమ్మా అని చెప్పాను…
నా మొహంలో అసహజంగా కాస్త సిగ్గు, అభావంగా ఓ నవ్వు… తలెత్తుకోలేక… ఆమె నా అసౌకర్యాన్ని గుర్తించారు… ‘నీ వ్యాఖ్యకు ధన్యవాదాలు, అవును, పెద్ద పిల్లలు ఉన్నా సరే నా వయస్సు అంతగా కనిపించదు, అది మళ్లీ గుర్తుచేసినందుకు థాంక్స్’ అని నవ్వి కరచాలనం చేశారు… నా వీపు మీద చొరవగా తట్టి ‘బాగానే పాడావు, మా ముదినేపల్లిని హైలైట్ చేసే పాట కదా, నాకు నచ్చింది, కానీ నీకు తెలుసా..? నాకు నీ వయస్సున్న కొడుకున్నాడు…’ అని వెనుతిరిగి వెళ్లిపోయారు…
ఆ తర్వాత జెండా ఎగురవేసి తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ ఎన్నికయ్యారు… అదంతా చరిత్ర… ఇక్కడ సీన్ కట్ చేయండి… ఓ పదేళ్లు ముందుకు వెళ్దాం…
నేను ది హిందూ పత్రిక విజయవాడ బ్యూరోకి హెడ్‌గా ఉన్నాను… రైతుల ఆందోళనలు నడుస్తున్నాయి… నాగేంద్రనాథ్ అనే పెద్దమనిషి వాటికి నాయకత్వం… వ్యవసాయం, సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి… గుడివాడలోని ఆయన ఇంట్లో కలుస్తానని అడిగాను, ఆయన సరే, వచ్చేయండి అన్నారు… నేను వెళ్లాను, అసలు రైతుల వర్తమాన సమస్యేమిటో చెప్పారు, రాసుకున్నాను, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు… రండి, భోజనం చేద్దాం అన్నారు… నేను వద్దన్నా వినలేదు, డైనింగ్ టేబుల్ చేరుకున్నాం… ఆయన భార్య, యెర్నేని సీతాదేవి స్వయంగా భోజనం వడ్డించారు…
రుచిగా, శుచిగా, మధురంగా ఉంది భోజనం… ఆమెకు నేనెలా తెలుసో భర్తకు చెప్పారు… మొహం మీద విశాలమైన ఓ నవ్వు… ఆహ్లాదంగా…! అప్పటి నా పాటనూ గుర్తుచేశారు… మొత్తం విన్న నాగేంద్రనాథ్ పకపకా నవ్వారు… తరువాత విజయవాడ వచ్చేశాను… 2023లో నాగేంద్రనాథ్ మరణించారు… ఇప్పుడు ఆమె మరణవార్త… ఇవన్నీ గుర్తొచ్చి కంటిచివర కన్నీటి బొట్టు… అమ్మా, నీకు నివాళి… ఆ స్వర్గంలోని మీ భర్తను చేరుకున్నారుగా… ప్రశాంతంగా ఉండండి…!!
Share this Article