Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా పాటకు పర్యాయపదం బాలు… చెరిగిపోని స్వర చేవ్రాలు…

September 25, 2024 by M S R

 

బాలు మాట- పాట- బాట

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పొతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే.

Ads

ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని తంత్రీవాద్య సమన్వితంగా పాడుకోవడానికి వీలుగా రాసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఎలా పాడాలో ఆశ్రమంలో మొదట లవకుశులకే నేర్పాడు. ఆ రామగీతాన్ని తొలిశ్రోతగా తానే విని పరవశించి, తృప్తిగా లవకుశుల ముఖతః లోకానికి వినిపించాడు. వచనం ఎంత గొప్పదయినా గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదు. వచనాన్ని రాగంతో పాడడం చాలా కష్టం. శ్లోకం, పద్యం, పాటలో నియతి ఉంటుంది. రాగం ఉంటుంది. యతిప్రాసలు ఉంటాయి. ఛందోలంకారాలు ఉంటాయి.

రాగం తోడయిన పదం అనురాగమై వెంటపడుతుంది. ఒక తూగులో, లయలో ఆ సాహిత్యం వచనం కంటే పదికాలాలపాటు గుర్తుంటుంది. వచనం కంటే సాంద్రమై నెమరువేతకు సులభమవుతుంది. పాట శ్లోకం, పద్యంగా పరిణమించింది. పాటంటే తెలుగులో సినిమా పాటలే అన్నంతగా వ్యాప్తి పొందింది. ఆ పాటల పూదోటలకు ఘంటసాల ఒక తోటమాలి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మరొక తోటమాలి.

బాలు జీవితకాలం 4-5-1946 నుండి 25-9-2020 వరకు డెబ్బయ్ నాలుగేళ్లు. ఇరవై ఏళ్ల వయసులో పాడడం మొదలు పెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేళ్ళతో భాగిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై పాటలు. అంటే నెలకు అరవై రెండు పాటలు. సగటున రోజుకు రెండు పాటలు పాడినట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? బాలుకు మాత్రమే సాధ్యం.

అతిపరిచయం వల్ల చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. అలా బాలసుబ్రహ్మణ్యం గురించి, ఆయన పాటల గురించి తెలియనిదెవరికి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముంది? గొప్పగా పాడాడు. కష్టమయినవి పాడాడు. సులభంగా పాడాడు. సున్నితంగా పాడాడు. సంప్రదాయం ఒడిసిపట్టుకుని పాడాడు. స్పష్టంగా పాడాడు. తెలుగును తెలుగులా పలికాడు. అక్షరాన్ని మింగేయకుండా పాడాడు. ఊపిరి బిగబట్టి పాడాడు. దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా! అన్నాడు. ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే! అన్నాడు. పారేసుకోవాలనారేసుకున్నావు..
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. అన్నాడు.

ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తే బాలు పాటల చరిత్ర పూర్తవుతుంది? తెలుగుపాట అప్పుడు ఘంటసాలను కోరుకుంది. ఆయన పోతూ పోతూ ఆ పాటను బాలు చేతిలో పెట్టి వెళ్లాడు. బాలు పోతూ పోతూ ఆ పాటను ఎవరిచేతిలో పెట్టాలో తెలియక వెళ్లిపోయాడు. అయినా పిల్లి పిల్లకు పెళ్లి చేసి, పెళ్లీడు పిల్లకు పెల్లి చేసే నేటితరం గాయకులకు, శ ష స అన్నవి దేనికవిగా విడి విడి అక్షరాలని తెలియని గాయకులకు, ఉంటే అనడానికి ఉల్టే అనే గాయకులకు, ఉండిపోరాదే అని అనలేక ఉం డిప్పోరాదే – గుండెనీదేలే, గుండె కేనన్నే … అని భాషోచ్చారణ తెలియని పరవశ గాయకులకు తెలుగు చెప్పడం హత్యానేరంతో సమానం.

పాటంటే నిజానికి ఒక పల్లవి. రెండు చరణాలే. కానీ మాటలు చెప్పలేని భావమేదో పాటలు చెప్పాలి. పాటలో ఒక్కొక్క మాట వేనవేల మాటలుగా ప్రతిధ్వనించాలి. ప్రతిపదం భావార్థంగా ప్రతిఫలించాలి. అలా బతుకంతా పాటలతో ప్రతిధ్వనించి, పాటగా ప్రతిఫలించిన బాలుగురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన పాటలు వినడం సులభం. మనకు పాటల కర్ణామృతాన్ని పంచడానికి ఆయన ఎంత గరళం గొంతులో దాచుకున్నాడో?

“…కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన..
గళసీమలోన.. కటిసీమలోన.. కరయుగములోన.. పదయుగములోన…
నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…”
అని బాలు అంటే సి నా రె సృష్టించిన నాట్య మయూరే ఆడలేను…ఆడలేను…ఆడలేను…అని కాళ్లు కట్టేసుకుని కూర్చుంది. ఇక మనమెంత?
బాలు పాటలు వింటూ ఉండడం తప్ప- ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం?

కొందరు శాశ్వతంగా దూరమవుతారు. కొందరు భౌతికంగా దూరమవుతారు. పాడుతా తీయగా పాటల చర్చలతో బాలు ప్రతి ఇంటికీ వచ్చి మనతో మాట్లాడాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉంటాడు.
మాటే పాటైనవాడు.
పాటే బాటైనవాడు.
మనకు కర్ణామృతమైనవాడు. మనకెప్పుడూ దూరం కానివాడు.

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించీ
జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ?
అవును- అదే బాలు మురళి.
అవును- అదే బాలు పాటల రవళి.

రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు గీతాలు
దొరకునా ఇటువంటి సేవ?
దొరకునా ఇటువంటి బాలు?

(25-9-2024,.. నేడు బాలు నాలుగో వర్ధంతి )

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions