నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావూ..,
నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ…!
**
ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ…? జ్ఞాపకాల నీడలేంటీ…? దశదిశలా కమ్మేసిన మానసిక ఆక్సిజన్ నువ్వు…! నిను వలచని మనిషెవ్వడు…? నిన్నెవరు మరువగలరు..?
Ads
మగవాడికోసం అసంఖ్యాక ప్రేమగీతాలు పాడావు, ఆడమనిషి కోసం “ఎటేపమ్మ ఒంటరి నడకంటూ” అన్నవై సుద్దులు చెప్పావు. తృతీయలింగపు “సూడు పిన్నమ్మా, పాడు పిల్లాడంటూ” పాటా పాడేశావు..!
హాస్యగాడి కోసం “ముత్యాలూ వస్తావా..!” అన్నావ్..! దేశభక్తిని “జననీ జన్మభూమిశ్చ” పాడి ఉద్దీపన చేశావ్..! గిరిజనుణ్ని “కృషివుంటే మనుషులు ఋషులౌతారంటూ” మేల్కొలిపావు…! శ్రామిక వనాల కోసం వసంతం తనంతట తానే తరలివస్తుందని భరోసానిచ్చావు..! క్షుద్రులెరుగని రుద్రవీణని సాక్షాత్తూ పరమశివుడికే అవధరించి విని తరించమంటూ తాంబూలాలిచ్చేశావ్..!
ఎన్ని గుండెలు జారుతున్నాయో ఊహించగలవా..? ఎన్ని కన్నీళ్ళు పారుతున్నాయో లెఖ్కెట్టగలవా..?
బాలూ..,
నీ ఒదిగిన మాట గురించీ, ఎదిగిన బాట గురించీ రంధ్రాణ్వేషకులూ, నిత్యశంకితులూ నిరంతరం తీర్పులిస్తూనే ఉంటారు. రికార్డింగ్ రూముల్లో నాదస్వర విన్యాసాలు తప్ప, రోడ్డు మీది సత్రకాయగాళ్ల సన్నాయి నొక్కులు వినే తీరిక నీకెప్పుడుండిందనీ…?
నీ పాట గురించీ, గళవిన్యాసం గురించీ రెండో అభిప్రాయం లేదు బాలూ…! అది సినిమాపాటకు తాతా, తండ్రీ, పెనిమిటీ, సోదరుడూ, కొడుకూ, మనవడూ…! సంగీతమున్నంత కాలం, మానవజాతికి బధిరత్వం రానంతవరకూ నువ్వుంటావ్..! ఇప్పుడు కూడా ఎక్కడో భూతపు గొంతేసుకుని “ఓబాలా మసజసతతగా శార్దూలా..!” అంటూ ఫిల్ ఇన్ ద ట్యూన్ కూడా ఫీల్ తో పాడుతున్నావు..!
నీ ఇంటిపేరు శ్రీపతిపండితారాధ్యుల కావచ్చు కానీ, నిజానికి నువ్వు శ్రీపతిపామరారాధ్యుల వారివి. నాబోటి మాస్ గాడికి జతులూ, కృతులూ, శృతులూ,గతులూ ఏమర్ధమవుతాయి చెప్పూ..? నువ్వు “బంగారు కోడిపెట్టా వచ్చెనండీ” పాటలో ఓచోట “కుక్కుర్కూ..!” అంటావ్ చూడూ. అదీ నువ్వు…! అందుకే నువ్వంటే మాకు లవ్వు…!
బాలూ,
నీ పుణ్యాన ఎంత మంది పిల్లలు గాయకులయ్యారో తెలుసా..? ఎంత మంది నీ పేరు చెప్పుకుని కబళం తింటున్నారో ఊహించగలవా..?
నీ మూలాన గాయకులు కాలేదని చెప్పుకుంటున్న పెద్దవాళ్లకన్నా కొన్ని వేల రెట్లు..! వాళ్లలో చాలామంది తమను తాము స్వర్ణభాండాల్లాగా భావించుకునే సత్తుగిన్నెలు..!
నాకు సంతాపం చెప్పడం ఇష్టం లేదు బాలూ..! నీ కన్నా గొప్పగాయకులు పుంజీలుపుంజీలుగా ఉన్నారు. కానీ సినిమా పాట మాతృపెనిమిటి మాత్రం నువ్వే…!
“నాస్తితేషాం యశఃకాయే జరామరణ జంభయం” కదా..! నువ్వు అడ్డంగా నిలువెత్తు పాటవి..!
ఆ నారదుడికీ, తుంబురుడికీ, గంధర్వులకీ ప్రవేటు తీసుకో..! ఆ శివయ్య ముందు భక్తకన్నప్ప కిరాతార్జునీయం పాట పాడు గానీ, ఆయనతో డాన్సులూ గట్రా చెయ్యమాక..! అసలే పర్సనాలిటీలో ఆయన పెద్దకొడుకు లాంటోడివి..!
మామనీ, ఎమ్మెస్వీనీ, ఘంటసాల మాస్టార్నీ, పంచమ్ దా నీ, వేటూరీ సినారే ఆత్రేయల్నీ అడిగినట్టు చెప్పు..! ఆ మహ్మద్ రఫీతో కావలసినన్ని పాటలు పాడించుకో..!సీతారావుడు సరిగ్గా కుదురుకున్నాడో లేదో కనుక్కో…!
పిల్లాడు దారిన పడ్డాడ్లే.., వాడి దిగులేం పెట్టుకోకు.
పని రాక్షసుడిలా అక్కడా రోజూ మూడుషిఫ్టులూ పాడేయకు. సుఖంగా, సుబ్బరంగా విశ్రాంతి తీసుకో..!
సరస్వతీ దేవి తన ముద్దుల బిడ్డని చూసుకొని మురిసిపోతుంది. తన మావగారి పక్కనే ఓ రెండో శేషుడి పడకేయిస్తుంది. సుబ్బరంగా పడుకో..! ఆ గంధర్వుల సతీమణులు ఒక్కసారి నీ గొంతిన్నారంటే తినడం మానేసి పోటీపడి నీ కాళ్లొత్తుతూ సెటిలైపోతారు. “ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే..!” అంటూ పాడాల్సిన అవసరమే రాదు. పైగా “నడిరాతిరిలోనా నీ పిలుపూ…!” అంటూ వాళ్లే ఎదురుపాడినా దిక్కులేదు.
ఇవాళేంటో మధ్యాహ్నం నుండి పూలు గుసగుసలాడటం లేదు., నవ్వులూ రువ్వడం లేదు. నువ్వు పాడని పుష్పవిలాపాన్ని పాడుతున్నాయి..!
ఇవాళేంటో గాలి సైగలు చేయడం లేదు. నువ్వు పాడని పడవప్రయాణపు పాట పాడుకుంటోంది..!
బాలూ..,
చాలాసార్లు చెప్పినట్టే ఇప్పుడూ చెబుతున్నా..!
ఐ లవ్యూ…!
ఇవాళ్టి సంఘటన పట్ల నీగురించి నాకేం దిగుల్లేదు బాలూ..! నువ్వు పాడిన పాటల్ని ఇంకో రౌండ్ వింటే, తర్వాత నీ లైవ్ కాన్సర్టే వినొచ్చు…!
కానీ వృద్ధులైన నా తల్లిదండ్రులు పాడుతా తీయగా, స్వరాభిషేకం వదలకుండా చూస్తారు. వాళ్లేమవుతారో అని దిగులుగా ఉంది.
అమ్మ హాస్పిటల్లో ఉంది బాలూ..,ఈ విషయం తెలియదు. తను నకిలీ స్టాంపుల కుంభకోణంలో తెల్గీని అరెస్టు చేసినప్పుడే “పాపం” అంటూ దిగులు పడింది. ఇదెలాగూ తెలుస్తుంది. తెలిసాక “ఏంటా..?” అని భయమేస్తోంది.
నా కుటుంబంలో శాశ్వతసభ్యుడివి ఎందుకయ్యావు బాలూ…?
**
తేరే మేరే బీచ్ మే కైసాహై యే బంధన్ అంజానా..!
మైనే నహీ జానా తూనే నహీ జానా…!
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుకా..?
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగకా…!
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావూ..
మమ్ము తోలుబొమ్మలను చేసీ ఆడిస్తావూ..!
“ఋణానుబంధేన రూపేణ
పశుపత్నిస్సుతాలయః
ఋణక్షయే క్షయంయాంతి
కాతత్రపరివేదనా…?”
అనేసి వదిలేద్దామంటే నువ్వా లిస్టులో లేవు. నీ ఋణం తీరదు..!
**
“పెరుగుతుంది వయసనీ అనుకుంటారు,
కాని తరుగుతుంది ఆయువనీ తెలుసుకోరు..!”
ఎంత సరిగ్గా అర్ధం చేసుకున్నావు బాలూ…? *** గొట్టిముక్కల కమలాకర్
Share this Article