.
Subramanyam Dogiparthi ………. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే . ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో ఇంద్రుడికి !?
మారుమూల గ్రామాల్లో ఉండే అస్పృశ్యత , విద్య లేమి , అమాయకులను వడ్డీలతో పీల్చిపిప్పి చేసే వడ్డీ వ్యాపారం , వెట్టిచాకిరి వంటి సామాజిక ఆర్థిక అంశాలపై గొప్ప సినిమా 1982 డిసెంబర్లో వచ్చిన ఈ త్రిశూలం సినిమా . డా అనంద రామం వ్రాసిన జాగృతి అనే నవల ఆధారంగా ఈ సినిమా యువచిత్ర బేనరుపై నిర్మించబడింది . వంద రోజుల బొమ్మ .
Ads
గూడెంలో పుట్టిన ఓ బాలుడు చదువుకోవాలి అనుకునే పట్టుదలతో పట్నం వెళ్లి చదువుకుని తాను పుట్టిన ఊరికే స్కూల్ మాస్టారిగా వచ్చి పేద జనం సమస్యలను పరిష్కరిస్తానికి అంకితం అవుతాడు . ఆ ప్రక్రియలో తనను ఆరాధించే మరదల్ని పోగొట్టుకుంటాడు . ప్రేమించిన సర్పంచ్ కూతురిని కాకుండా తమ గూడెం స్త్రీని పెళ్లి చేసుకుంటాడు .
భార్య మరోసారి మానభంగానికి గురయి ఆత్మహత్య చేసుకుంటుంది . రాముడు ఉగ్రుడై ఓ రౌడీని , వాడిని పురమాయించిన వడ్డీ వ్యాపారస్తుడిని చంపి జైలుకు వెళతాడు . తాను జైలు నుండి తిరిగి వచ్చేదాకా అతని ఆశయాలను అతని పూర్వ ప్రేమికురాలు కొనసాగిస్తుంటుంది . ఈ కధంతా రైల్లో యువతులకు హీరో ఫ్లాష్ బేక్ లో చెపుతాడు .
కృష్ణంరాజు ఆదర్శవంతుడైన యువకుడిగా , కార్యోన్ముఖుడిగా , ధీరోదాత్తుడిగా చాలా బాగా నటించారు . అతనికి మంచి పేరు వచ్చిన సినిమాలలో ఒకటి ఇది . రెబెల్ ఇమేజి నుండి ధీరోదాత్త ఇమేజి లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు .
ఈ సినిమాలో మూడు స్త్రీ పాత్రలు చాలా ఆదర్శవంతమయినవే కాకుండా ధైర్యం , పట్టుదల , తెగువ ఉన్న చాలా స్ట్రాంగ్ పాత్రలు . బహుశా నవల రచయిత స్త్రీ కాబట్టి కావాలనే అంత స్ట్రాంగ్ పాత్రలను సృష్టించారేమో ! ఆమెని అభినందించాలి .
సర్పంచ్ కూతురుగా శ్రీదేవిది మొదటి స్త్రీ పాత్ర . అస్పృశ్యుడిగా హేళన చేయబడుతున్న చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి , పెళ్లి చేసుకోలేక పోయినా అతని ఆశయాల కోసం ధృఢంగా నిలబడిపోతుంది . రెండో గొప్ప స్త్రీ పాత్ర రాధికది . బావను ఆరాధిస్తుంది . బావను రక్షించుకోవటానికి తన మీద కన్నేసిన రౌడీని పెళ్లి చేసుకుంటుంది . బావ భార్యను కాపాడే బాటలో ప్రాణాలను కోల్పోతుంది .
మూడో గొప్ప స్త్రీ పాత్ర జయసుధది . అయిదు రూపాయలకు మానాన్ని పోగొట్టుకున్న గూడెం మహిళగా చాలా బాగా నటించింది . ముగ్గురు హీరోయిన్లూ తమ తమ పాత్రలను బ్రహ్మాండంగా పోషించారు .
విలన్లుగా గొల్లపూడి మారుతీరావు , రావు గోపాలరావులు నటించారు . వాళ్ళిద్దరి పాత్రల్ని అటూఇటూ మార్చి ఉంటే ఇంకా బాగుండేది . రౌడీగా చలపతిరావు . గ్రామంలో మంచి మాస్టారిగా ప్రభాకరరెడ్డి , MLA గా అల్లు రామలింగయ్య , గ్రామస్తులుగా సుత్తి జంట నటించారు . ఫ్లాష్ బేక్ కధ వినే అమ్మాయిలలో ఇద్దరుగా రాజ్యలక్ష్మి , తులసి కనిపిస్తారు .
సినిమా విజయానికి మరో ప్రధాన కారణం కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది . రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు మరచిపోలేనివిగా ఉండాలి కదా ! అలాగే ఉంటాయి . బిందెలు , ఫలపుష్పాలు కాకుండా తప్పెట్లను పెట్టాడు ఈ సినిమాలో . గోదావరి ఒడ్డున తప్పెట్లతో పన్నిండేళ్ళకు పుష్కరాలు పదహారేళ్ళకు పరువాలు అనే డ్యూయెట్టుని పెట్టారు కృష్ణంరాజు , రాధికల మీద . రాధిక చేత కూడా బాగా డాన్స్ వేయించారు .
కృష్ణంరాజు శ్రీదేవిల మీద డ్యూయెట్లు వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం , అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని , పెళ్ళంటే పందిళ్ళు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ కృష్ణంరాజు జయసుధల మీద చాలా పాపులర్ అయింది . ఆత్రేయ గారు చక్కటి అర్ధవంతమైన సాహిత్యాన్ని అందించారు . రాయిని ఆడది చేసే రాముడివా గంగను తలపై మోసే శివుడివా పాటలో ఇద్దరూ పోటాపోటీగా నటించారు .
ఈ సినిమాలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు రాని రాజకీయాలపై చెణుకులు బాగానే వేసారు . మా MLA కనిపించడంలేదు అని పత్రికల్లో వేయించడం , ఓట్ల నాడు నాట్ల నాడు నెత్తిన పెట్టుకొని కోతల నాడు కోసేయటమే వంటి చెణుకులు బాగానే వేసారు . సినిమా అంతా పదునైన డైలాగుల్ని వ్రాసారు సత్యానంద్ .
తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో నయా కదం అనే టైటిలుతో తీసారు . రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు . రాజేష్ ఖన్నా హీరో . కృష్ణంరాజే బాగా నటించాడు . శ్రీదేవి తన పాత్రను తానే వేసింది . జయసుధ పాత్రను జయప్రద , రాధిక పాత్రను పద్మిని కొల్హాపురి వేసారు .
తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . సామాజిక సమస్యల మీద సందేశాత్మక సినిమాయే అయినా రాఘవేంద్రరావు మార్క్ అందం , సున్నితత్వం , రొమాన్స్ పుష్కలంగానే ఉంటాయి . 1+3 సినిమా అనుకోవచ్చు . తప్పక చూడవలసిన సినిమాయే . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పడేసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article