దేవుడు వస్తున్నాడు… విమానాల్ని నిలిపివేయండి… రన్ వే మూసేయండి… విమానాల రాకపోకల్ని రీషెడ్యూల్ చేయండి… జాతీయమో, అంతర్జాతీయమో విమాన సర్వీసులకు ముందే చెప్పి పెట్టండి………. ఏమిటిదంతా అంటారా..? నిజమే… మంగళవారం అయిదు గంటలపాటు అన్నిరకాల విమాన సర్వీసులను నిలిపివేశారు ట్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో…!
కారణం సింపుల్… శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న పద్మనాభస్వామి ఊరేగింపు ఆ రన్‌వే మీదుగా వెళ్తుంది కాబట్టి… ఎటొచ్చీ ఏ సెక్యులర్ వాదమూ ఠాట్, మేందీనికి ఒప్పుకోం అంటూ రాద్ధాంతానికి దిగలేదు… కోర్టులకు ఎక్కలేదు… ఆ వార్త చదువుతుంటే అనిపించింది అదే… హిందూ గుళ్ల ఆచారాల్ని అడ్డుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది కదా కొన్నేళ్లుగా… ఉజ్జయిని భస్మారతి కావచ్చు, శనిశింగాపూర్ కావచ్చు, శబరిమల రుతుప్రవేశం కావచ్చు… బోలెడు…
అల్పస్సి ఫెస్టివల్ ముగింపు సందర్భంగా ఆరట్టు ఊరేగింపు జరగడం ఆనవాయితీ… అది మంగళవారం వచ్చింది, దాంతో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రన్‌వేను మూసేశారు… ముందుగానే ఆ ఎయిర్‌పోర్టు మీదుగా షెడ్యూల్ కావల్సిన అన్నిరకాల జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు చెప్పిపెట్టారు… రీషెడ్యూల్ చేశారు… దాదాపు 10 ఫ్లయిట్ల రాకపోకల టైమింగు మార్చాల్సి వచ్చింది…
Ads
‘‘శతాబ్ధాల ఆచారంగా కొనసాగుతున్న ఆల్పస్సి ఆరట్టు ఊరేగింపు సాఫీగా కొనసాగడానికి వీలుగా, ఆ ఊరేగింపు ఈ రన్‌వే మీదుగా సాగాల్సి ఉన్నందున 1600 గంటల నుంచి 2100 గంటల వరకు అన్నిరకాల విమాన సర్వీసులను సస్పెండ్ చేయాల్సి వస్తున్నది’’ అని ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ ముందే ఓ ప్రకటనలో చెప్పింది…
రన్ వే దగ్గర ఆరట్టు మండపం ఉంటుంది… ఊరేగింపు సందర్భంగా అక్కడ కాసేపు దేవుళ్ల విగ్రహాలను ఉంచుతారు… దాని పవిత్రతను అలాగే కాపాడటానికి చర్యలు తీసుకుంటూనే ఉంటాం… ఈ ఆనవాయితీ కొనసాగింపు కోసం అన్ని ఫ్లయిట్ కంపెనీలు సహకరిస్తుంటాయి…’’ అని పోర్టు అధికారులు చెబుతున్నారు… 1932 లో ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది… అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచే ఈ ఊరేగింపు పద్ధతి అమల్లో ఉంది…
ఇన్నాళ్లూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని కాపాడుతూ వచ్చింది… రీసెంటుగా ఈ ఎయిర్‌పోర్టు నిర్వహణను ఆదానీ గ్రూపు టేకప్ చేసింది… ఈ ఆచారం కొనసాగింపు కోసం తగిన చర్యలు ఎప్పటిలాగే తీసుకోవాలని ఆ గ్రూపు పోర్టు సిబ్బందికి ముందే సూచించింది… పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే ఆరట్టు ఉత్సవం తిరువనంతపురం ప్రజలకు ఒక ప్రత్యేకమైన ఘట్టం…
దీనిలో భాగంగా ఆలయంలో నుంచి శంఖుముఖం బీచ్ వరకు… సముద్రంలో పవిత్ర స్నానం (అరట్టు) కోసం సంవత్సరానికి రెండుసార్లు (అల్పాసి, పంగుని ఉత్సవాలు) ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులకు ట్రావెన్ కోర్ రాజకుటుంబం నాయకత్వం వహిస్తుంది. ఆచారబద్ధమైన అభ్యాసాన్ని అనుసరించి ఆలయ మైదానంలో అనేక సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతాయి…
సంప్రదాయ ఆచారం ప్రకారం, ఆలయ దేవతల యొక్క ఊరేగింపు విగ్రహాలను సంవత్సరానికి రెండుసార్లు పవిత్ర స్నానం కోసం విమానాశ్రయం వెనుక ఉన్న సముద్రంలోకి తీసుకువెళతారు… రన్ వే మూసివేత కోసం ఎయిర్ పోర్టు ప్రత్యేకంగా నోటమ్ జారీ చేస్తుంటుంది… (నోటమ్… Notice to Airmen)… వీటిలో అలప్సి అక్టోబరు- నవంబరు నెలల్లో వస్తుంది… పంగుని మార్చి- ఏప్రిల్ మాసాల్లో వస్తుంది…!!
Share this Article