Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…

October 30, 2026 by M S R

.

మాటల మాంత్రికుడు, గురూజీ వంటి అర్థరహిత బిరుదులు, భుజకీర్తుల జోలికి వెళ్లను గానీ… త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖచ్చితంగా పదాలు పేర్చడంలో దిట్ట… లోతు అర్థాలుండే సినిమా డైలాగులకు ప్రసిద్ధి… పౌరాణికాలపై మంచి పట్టున్నవాడే… ప్రసంగం ఆరంభిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రవచనకర్తలకన్నా బాగా మాట్లాడగలడు… డౌట్ లేదు… కానీ..?

ఒక్కోసారి తన మాటలు ఎటెటో వెళ్లిపోతుంటాయి… కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తున్నా సరే, తన ప్రసంగంలోని తప్పులు పంటికింద రాళ్లలా పటుక్కుమంటాయి… వెంకటేశ్ హీరోగా ఓ సినిమా తీశాడు కదా… ఆదర్శకుటుంబం… దాని ప్రిరిలీజ్ ఈవెంటులో తను మాట్లాడుతూ… కృష్ణుడు రెండు గీతలు బోధించాడని చెబుతూ… దానికీ ఈ ఆదర్శ కుటుంబానికి ఏదేదో లింక్ కలిపాడు… మధ్యలో కలహ ప్రియత్వమే సోషల్ మీడియా గుణం అంటూ సందర్భరహిత మరో ప్రస్తావన సరేసరి… (అది కలియుగ ప్రధాన లక్షణమట…)

Ads

తన ప్రసంగం పలుచోట్ల ఆడ్‌గా అనిపించినా సరే… సగటు తెలుగు ప్రేక్షకుడికి శ్రీకృష్ణుుడు రెండు గీతలు బోధించాడనే కొత్త విషయం ఒకటి చెప్పాడు… గుడ్… ఐతే రెండు కాదు, మూడు గీతలు… ఈ ప్రవచనకారుడికి తెలియనట్టుంది… ముందుగా ఓ పొరపాటు చెప్పుకుని మూడు గీతల జోలికి వెళ్దాం…

యాదవులంతా మద్యం మత్తులో ఒకరికొకరు కొట్టుకుని మరణించిన నదీతీరం యమున కాదు త్రివిక్రమా..? అది ప్రభాస తీరం… యమునాతీరం శ్రీకృష్ణుడి బాల్యంలో (మధుర, బృందావనం, గోకులం) ఉంటుంది… కొన్ని పురాణాల ప్రకారం ప్రభాస తీరం ప్రస్తుతం ఈ ప్రాంతం గుజరాత్‌లోని సోమ్‌నాథ్ క్షేత్ర సమీపంలో (హిరణ్య, కపిల, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద) ఉంది…

త్రివిక్రమ్

5000 ఏళ్ల క్రితమే శ్రీకృష్ణుడు కలియుగ లక్షణాల్ని, వర్తమాన సమాజ స్థితిగతుల్ని చెప్పాడు… భగవద్గీత అందరికీ తెలుసు… ఉద్ధవ గీత కూడా తనే చెప్పాడు అని దాని వివరాలు కొన్ని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్… అది నిజమే… కానీ శ్రీకృష్ణుడు చెప్పినవి మూడు గీతలు…

కురుక్షేత్రానికి ముందు బంధువులు, స్నేహితులు, గురువులను చూసి ధనుర్బాణాలు కిందపడేసి, యుద్ధం చేయనని చెప్పిన అర్జునుడిని యుద్ధసన్నద్దుడిని చేయడానికి ఉద్దేశించినదే భగవద్గీత… అందరికీ తెలిసిందే… యుద్ధం మొత్తం పూర్తయ్యాక, ధర్మరాజు పట్టాభిషేకం పూర్తయ్యాక, కృష్ణుడు ద్వారకకు తిరుగుపయనమయ్యే ముందు అర్జునుడు కృష్ణుడికి ఒక విన్నపం చేస్తాడు…

“యుద్ధ సమయంలో నువ్వు నాకు చెప్పిన జ్ఞానమంతా నేను మరచిపోయాను, ఆ ఉపదేశాన్ని మళ్లీ ఒకసారి చెప్పు” అని కోరతాడు… అప్పుడు కృష్ణుడు “అప్పుడు యోగయుక్తుడనై చెప్పిన ఆ జ్ఞానాన్ని యథాతథంగా మళ్లీ చెప్పలేను కానీ, మరొక రూపంలో ఉపదేశిస్తాను” అని చెప్పినదే అనుగీత (మహాభారతం – అశ్వమేధిక పర్వం) … అందులో…

మోక్ష ధర్మాలు & జ్ఞాన మార్గం…: శరీరం, ఆత్మల మధ్య ఉన్న వ్యత్యాసం, సాంఖ్య-యోగ తత్త్వాలు…

గురు-శిష్య సంవాదాలు…: పూర్వకాలపు రుషులు, విద్వాంసుల మధ్య జరిగిన కథల ద్వారా ధర్మ సందేహాలను నివృత్తి చేయడం…

ఆధ్యాత్మిక సాధన…: ఇంద్రియ నిగ్రహం, మనస్సును వశం చేసుకోవడం, కర్మబంధాల నుంచి ఎలా విముక్తి పొందాలో స్పష్టం చేస్తుంది….

https://www.facebook.com/reel/1129269359655155

మరి ఉద్దవ గీత..? (శ్రీమద్భాగవతం – ఏకాదశ స్కంధం)… యాదవ వంశ వినాశనం ముంచుకొచ్చి, కృష్ణుడు తన అవతారాన్ని ముగించే ముందు (ప్రభాస తీర్థంలో) ఆయన పరమ భక్తుడు, ఆప్తుడైన ఉద్ధవుడితో జరిపిన సంభాషణే ఉద్ధవగీత... ఇది భగవద్గీత కంటే సుదీర్ఘమైనది.., సంపూర్ణ వైరాగ్య బోధ కలిగినది… ఈ బోధ ద్వారకలోనే జరుగుతుంది…

ఈ ఉద్ధవుడు ఎవరంటే..? యాదవ వంశానికి చెందిన ప్రసిద్ధ సాధు పురుషుడు… శ్రీకృష్ణుడికి బాబాయి (వసుదేవుడి సోదరుడైన దేవభాగ లేదా దేవశ్రవుడి కుమారుడు) వరస అవుతాడు… అలాగే కృష్ణుడికి అత్యంత ఆప్తుడైన మిత్రుడు, ప్రధాన సలహాదారు (మంత్రి)… ఉద్ధవుడు బృహస్పతి శిష్యుడు. గొప్ప బుద్ధిమంతుడు, న్యాయ కోవిదుడు… ఉద్ధవుడు చూడటానికి కూడా రూపురేఖల్లో, శరీర ఛాయలో శ్రీకృష్ణుడిలాగే ఉండేవాడని భాగవతం చెబుతుంది…

ముఖ్య విషయాలు:

24 మంది గురువుల కథ (అవధూత సంవాదం)…: ప్రకృతిలోని గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, పాము, సాలెపురుగు, పింగళ అనే వేశ్య వంటి 24 అంశాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు/గుణాలను వివరిస్తుంది…

భక్తి & సంసార వైరాగ్యం..: భౌతిక సంబంధాల తాత్కాలిక స్వభావాన్ని, మానవ జన్మ ముఖ్య లక్ష్యం భగవత్‌ప్రాప్తి మాత్రమేనని బోధిస్తుంది…

కలియుగ ధర్మాలు…: రాబోయే కలియుగంలో ధర్మం ఎలా క్షీణిస్తుంది, మనుషుల మనస్తత్వాలు, కలహప్రియత్వం ఎలా పెరుగుతాయో ముందుగానే వెల్లడిస్తుంది…

శరణాగతి…: భగవంతుడికి సంపూర్ణంగా శరణు వేడటమే మోక్షానికి సులువైన మార్గమని నిర్దేశిస్తుంది… మొత్తానికి భగవద్గీత కర్తవ్య బోధ చేస్తే, అనుగీత జ్ఞాన పునశ్చరణ చేస్తుంది, ఉద్ధవగీత వైరాగ్య శరణాగతులను నొక్కిచెబుతుంది...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…
  • … చివరకు ఓటీటీలోనూ ఫాస్ట్‌ఫార్వర్డ్ చేస్తూ సైతం చూడలేకపోతి…
  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’
  • వారణాసి OTT బిజినెస్… జక్కన్న మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా ?
  • శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!
  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!
  • అమెరికాలో ‘హ్యూమన్ కంపోస్టింగ్’… గుర్తొస్తున్న వీరశైవుల అంత్యక్రియలు!
  • టైమ్ లూప్‌లో చిక్కుకున్న కథనం… నవ్వించాలని నీరసపరిచే కామెడీ !
  • హాలోవీన్ కోలాహలం… అమెరికా మొత్తాన్ని ఆత్మలు ఆవహిస్తాయి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions