Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘రాముడి’పై ఇదేం కొత్త లొల్లి… పాత వీడియోను పట్టుకుని రచ్చ!

September 18, 2026 by M S R

.

ప్రసాదం తినలేదని భక్తి లేదంటారా? రాముడి పాత్రకే అనర్హుడంటారా?
రణ్‌బీర్‌పై ఇదేం ట్రోల్‌.. పాత వీడియోను పట్టుకుని కొత్త రచ్చ!

సోషల్ మీడియాకు ఓ విచిత్రమైన అలవాటు ఉంది. ఎవరో ఒక సెలబ్రిటీ ఏదో చిన్న పని చేస్తే చాలు.. దాన్ని పట్టుకుని గోరంతలు కొండంతలు చేయడం. సందర్భం ఏమిటి? వీడియో ఎప్పటిది? అసలు అక్కడ ఏం జరిగింది? ఇవేమీ పట్టించుకోకుండా.. తమకు నచ్చిన అర్థం తీసుకుని ట్రోలింగ్ మొదలుపెట్టడం ఇప్పుడు సాధారణమైపోయింది.

Ads

ఇప్పుడు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ విషయంలోనూ అదే జరుగుతోంది.

గణేశ్ చతుర్థి సందర్భంగా రణ్‌బీర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడిని దర్శించుకున్న తర్వాత పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని రణ్‌బీర్ తీసుకుంటాడు. ఆ తర్వాత తాను డైట్‌లో ఉన్నానని చెబుతూ దాన్ని అక్కడున్న మరో వ్యక్తికి ఇచ్చేస్తాడు. అంతే.. సోషల్ మీడియాలో కొందరికి రణ్‌బీర్‌పై తీర్పు చెప్పడానికి ఇదే పెద్ద సాక్ష్యంగా మారిపోయింది.

“గణపతి ప్రసాదం కూడా తీసుకోలేదు.. ఇతను రాముడి పాత్ర ఎలా పోషిస్తాడు?” ఇదీ కొందరి వాదన.

ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి రణ్‌బీర్ వ్యక్తిగత ఆహారపు అలవాట్లను, అతడి భక్తిని, చివరికి ‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడి పాత్రను కూడా ఈ చిన్న వీడియోతో ముడిపెట్టేశారు. కొందరు అయితే మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

రణబీర్

కానీ ఇక్కడ మొదట గుర్తించాల్సిన విషయం ఒక్కటుంది. ఆ వీడియో ఇప్పటిది కాదు. 2023 నాటిది. అంటే మూడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను ఇప్పుడు తీసుకొచ్చి, ప్రస్తుతం జరుగుతున్న గణేశ్ చతుర్థి వేడుకలతో కలిపి కొత్త వివాదంలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇక అసలు ప్రశ్న.. ప్రసాదం తినకపోతే భక్తి లేనట్టేనా? ఒక వ్యక్తి దేవుడి దర్శనానికి వెళ్లాడు. అక్కడ పూజలో పాల్గొన్నాడు. దేవుడికి నమస్కరించాడు. పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని కూడా తీసుకున్నాడు. కానీ తాను డైట్‌లో ఉన్నానని చెప్పి ఆ స్వీట్‌ను తినకుండా పక్కన ఉన్నవారికి ఇచ్చాడు.

ఇందులోంచి అతడికి దేవుడిపై భక్తి లేదనే నిర్ధారణకు ఎలా వస్తాం? అది ప్రసాదం కాబట్టి గౌరవంగా స్వీకరించాలి అనే భావన ఉండొచ్చు. ఎవరైనా అలా భావించి రణ్‌బీర్‌ను తప్పుపట్టవచ్చు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం.

కానీ ఒక స్వీట్ తినలేదనే కారణంతో ఒక వ్యక్తి భక్తినే ప్రశ్నించడం మాత్రం చాలా పెద్ద దూకుడు. ఎందుకంటే ప్రసాదం స్వీకరించడం, ప్రసాదం తినడం రెండూ ఒకటే కాదు. ఇంకో విషయం కూడా ఉంది. ప్రసాదం అంటే తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థమేనా? లేక దేవుడి ఆశీర్వాదంగా భావించి గౌరవంగా స్వీకరించడమా?

ఎవరైనా షుగర్ కారణంగా తినకపోవచ్చు. డైట్‌లో ఉండొచ్చు. ఆరోగ్య కారణం కావచ్చు. ఉపవాసం కావచ్చు. ఆ సమయంలో తీపి పదార్థం తినకూడదనుకుని ఉండొచ్చు. ఇక్కడ రణ్‌బీర్ స్వయంగా “నేను డైట్‌లో ఉన్నాను” అని చెప్పినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అతను ప్రసాదాన్ని తీసుకుని అక్కడే పడేయలేదు. అక్కడున్నవారికి ఇచ్చాడు.

అంతేకాదు.. అతను వినాయకుడి దర్శనానికి వెళ్లాడు అంటేనే దైవం పట్ల విశ్వాసినని ప్రకటించినట్టే కదా… సో, భక్తి ఉందా లేదా అన్నది చేతిలోని ప్రసాదం తిన్నాడా లేదా అన్నదానితోనే నిర్ణయించాలా? ఇంకో విచిత్రం ఏమిటంటే.. రణ్‌బీర్ ప్రస్తుతం ‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నాడు. అందుకే ఈ పాత వీడియోను ఇప్పుడు మరింత పెద్దదిగా చేసి చూపిస్తున్నారు.

అంటే నటుడు పోషించే పాత్రకు, నటుడి వ్యక్తిగత జీవితంలోని ప్రతి చిన్న చర్యకు ఒకే కొలమానం పెట్టాలా? ఒక నటుడు శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నాడంటే ఇక నుంచి అతను చేసే ప్రతి పనినీ పురాణంలోని శ్రీరాముడి ప్రవర్తనతో పోల్చాలా? అది నటన అనే విషయాన్నే మరిచిపోయినట్టవుతుంది.

సోషల్ మీడియా ట్రోలింగ్‌లో అసలు సమస్య ఇదే. ఒక చిన్న వీడియో తీసుకోండి. దానికి ఒక క్యాప్షన్ పెట్టండి. దాని చుట్టూ ఒక కథ అల్లండి. ఆ తర్వాత వేలమంది అదే కథను నిజమని నమ్మి షేర్ చేస్తారు. చివరికి అసలు వీడియోలో ఉన్న విషయం కంటే.. దానికి సోషల్ మీడియా పెట్టిన అర్థమే పెద్దదైపోతుంది. రణ్‌బీర్ విషయంలోనూ ఇప్పుడు అదే కనిపిస్తోంది… ఆ వీడియో సమయంలో తను ‘యానిమల్’- ఇప్పుడు రాముడు... తేడా లేదా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రాముడి’పై ఇదేం కొత్త లొల్లి… పాత వీడియోను పట్టుకుని రచ్చ!
  • శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!
  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!
  • రిపోర్టర్ చాకచక్యం! నిజాం నవాబు మరణవార్త అలా బయటికొచ్చింది!
  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !
  • తెలంగాణ విముక్తిలో జోధ్‌పూర్? ‘షెకావత్’ మాటలకు అర్థమేంటంటే..!
  • రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!
  • సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?
  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions