స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రీమియర్ షోలను మించిపోయి… కొన్ని నెలలుగా తెలుగిళ్లల్లో దుమ్మురేపిన కార్తీకదీపం కథ కంచికి చేరబోతున్నట్టే…! స్టార్ మాటీవీ వాడి రేటింగ్ సాధనసంపత్తిని బట్టి చూస్తే ఏ సీరియల్‌నైనా దింపేయగలడు, ఎత్తుకోగలడు… తనే ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాడు… సో, కథ ముగింపుకు రాబోతున్నదని అర్థం చేసుకోవాలి… కొద్దివారాల రేటింగ్ ట్రెండ్స్ చూసినా… వేరే సీరియళ్ల రేటింగ్స్ పెరుగుతున్న తీరు చూసినా స్పష్టంగా అర్థమవుతోంది అదే… నిజానికి ఈ సీరియల్ ఈ స్థాయిలో హిట్ కావడమే ఓ అద్భుతం… ఎందుకంటే, హీరో ఓ నల్కా కేరక్టర్… పేరుకు ఓ పెద్ద డాక్టర్, పెళ్లాన్ని అనుమానిస్తాడు, తన పిల్లలు కాదంటాడు… ఆ కేరక్టరైజేషన్ నిజానికి ఓ నవ్వులాట… ప్రస్తుత తరంలో ఎవరిని అడిగినా సరే, వాడో డాక్టర్, ఆమాత్రం తెలివిలేదా..? డీఎన్ఏ టెస్టు దగ్గరుంచి చేయించుకుని, చూసుకోలేడా..? తనకు పిల్లలు పుట్టరనే రిపోర్టును క్రాస్‌చెక్ చేసుకోలేడా..? పోనీ, దరిద్రుడు సరే, విడాకులు ఇవ్వొచ్చు కదా…. కానీ ఈతరం అభిప్రాయాలతో సంబంధం లేకుండా సీరియల్ హిట్ కావడం నిజంగా ఆ నిర్మాతల అదృష్టం అంతే…
అఫ్ కోర్స్, నల్లపిల్ల స్మార్ట్ మహిళగా మారిపోయినా జనం పట్టించుకోలేదు… ఇష్టారాజ్యంగా పాత్రలు వస్తుంటయ్, పోతుంటయ్, కథ బోలెడన్ని లాజిక్ లేని మలుపులు తిరుగుతూ ఉంటుంది… అసలు టీవీ సీరియళ్లంటేనే ఆ దరిద్రం తప్పదు కాబట్టి ప్రేక్షకులు క్షమించేశారు అనుకోవాలి… కానీ ఏమాటకామాట, సౌందర్యగా అర్చన, దీపగా ప్రేమి, మోనితగా శోభాశెట్టి, పిల్లలు సహృద, కృతికల నటన సీరియల్‌ను నిలబెట్టింది… వాళ్లే ఈ సీరియల్ సక్సెస్‌కు సగం కారణం… ప్రత్యేకించి ప్రేమి..! ప్లజెంట్ అప్పియరెన్స్…! మలయాళం సీరియల్ కథను ఇష్టమొచ్చినట్టుగా మార్చేశారు… ఒరిజినల్ కథలో అసలు స్పిరిట్ కూడా చంపేశారు… సాగదీసి సాగదీసి సీరియల్ జీడిపాకం అయిపోయింది… తాజాగా అయితే ఎమోషనల్ సీరియల్ కాస్తా క్రైం థ్రిల్లర్‌లా మార్చిపారేశాడు దర్శకుడు ఎవరో గానీ… ఈసారి కనీసం పద్మశ్రీకి అర్హుడు… వోకే, వోకే… గొంగట్లో తింటూ వెంట్రుకల్ని తిట్టిపోయడం ఎందుకు లెండి… ఓసారి ఈ సీరియల్ తాజా ట్రెండ్స్ చూడండి, దిగువ టేబుల్‌లో…
Ads
బార్క్ రేటింగుల విశ్లేషణ ఇది… 40 వారం నుంచి 44 వారం వరకు చూడండి… కార్తీకదీపం రేటింగుకూ గుప్పెడంత మనసు రేటింగుకూ తేడా ఒకటీ ఒకటిన్నర మాత్రమే… పైగా ఒకప్పుడు 18 దాకా వెళ్లిన కార్తీకదీపం రేటింగ్ ఇప్పుడు 13కు దిగజారిపోయింది… పేరుకు టీవీ రేటింగుల్లో టాప్ సీరియల్ అదే… కానీ ట్రెండ్ పతనం… ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ కూడా గుప్పెడంత మనసుతో పోటీపడుతోంది… దాదాపు సమానం… ఇక ఈ కార్తీకదీపం పని అయిపోయిందిరా బాబూ అని చెబుతున్న గణాంకాలు ఇవి… ఆల్ రెడీ కథ అదుపు తప్పిపోయింది, జనం చూడటం మానేస్తున్నారు, ఇక ఇప్పుడు సీరియల్‌ను లేపడం కష్టం… ఎప్పుడో ఓ ముహూర్తం చూసి, ఏ దిక్కుమాలిన ట్విస్టో ఇచ్చేసి, శుభం కార్డు వేయడమే… లేదంటే మరింత భ్రష్టుపట్టి, ఎప్పుడు ముగిస్తున్నార్రా నాయనా అంటూ నెటిజన్లు బూతులు తిట్టే దుస్థితి తప్పేట్టు లేదు..!! అన్నట్టు, ప్రేమికి వేరే సీరియల్ ఏమీ లేదిప్పుడు, ఆమధ్య ఏదో పోలీస్ పాత్రలో సొంత సినిమా అని చెప్పింది, ఏమైందో తెలియదు, ఆమె భారీ రెమ్యునరేషన్ భరించాలే గానీ వేరే సీరియల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే హిట్ గ్యారంటీ… ఆమెకు ఆ స్టార్‌డం ఉంది… పేరున్న ఏ హీరోయిన్‌కూ ఆమె తక్కువ కాదు…!! ప్రతి తెలుగు లోగిలి ప్రేమించే నటి..!!
Share this Article