హమ్మయ్య, ఓ క్లారిటీ వచ్చేసింది… ఆప్టరాల్ అమిత్ షా… మరింత ఆఫ్టరాల్ కేసీయార్, జగన్… ఎంత దాచుకుంటేనేం..? ఢిల్లీలో జరిగిన వరుస ఆంతరంగిక, రహస్య, అత్యున్నత భేటీల పరమార్థం ఏమిటో కనిపెట్టడానికి ఆంధ్రజ్యోతులు, ఆంధ్రప్రభలు లేవా ఏం..? ఆ భేటీల్లో జగన్‌కు, కేసీయార్‌కు తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండు ప్రభుత్వాలూ ఎలా సహకరించాలో ఆదేశించి.., తెల్లారే బండి సంజయ్‌ను కూడా అర్జెంటుగా పిలిచి, దుబ్బాకలో బాగా చేశావోయ్, సేమ్, తిరుపతిలో అలాగే చేయి.., కేసీయార్, జగన్ సపోర్ట్ చేస్తారు, కలిసి పనిచేయండి అని చెప్పి పంపించాడట… ఇక తిరుపతిలో కురువృద్ధుడు, భీష్మాచార్యుడు చంద్రబాబును కేసీయార్, జగన్, బండి సంజయ్, పవన్ కల్యాణ్ తదితరులు మూకుమ్మడిగా చుట్టుముట్టి ఆయన కథను ఖతం చేస్తారట…
ఎహె, ఆపు, వాటీజ్ దిస్ నాన్సెన్స్ అని గట్టిగా అరవాలని అనిపిస్తున్నదా..? మరి మన తెలుగు మీడియా ఆ అంచనాకు వచ్చేసింది… తెలుగు మీడియాకు మార్గదర్శి, చుక్కాని వంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా చెబుతున్నాడు… తన కొత్తపలుకు వ్యాసంలో అదే చెప్పాడు… తిరుపతిలో చంద్రబాబును మూడో స్థానానికి నెట్టేయడానికి బీజేపీ అమలు చేసే వ్యూహంలో జగన్ మాత్రమే కాదు, కేసీయార్ కూడా ఉన్నాడట… ఆయనకు అప్పగించిన పనేమిటయ్యా అంటే… హైదరాబాద్ నుంచి డబ్బు ఎటూ పోకుండా కట్టడి చేయడమేనట… డబ్బు వ్యవహారాల్లో ఒక్క తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త, సానుభూతిపరుడు కదలకుండా అష్టదిగ్బంధనం చేయాల్సిందేనట…
ఓసోస్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ అలా చేయడం వల్లే జగన్ గెలిచినట్టున్నాడు… మరి తెలంగాణ పోలీసులు సహకరించాలి అంటే కేసీయార్ చెప్పాలి, అందుకని అమిత్ షా ఢిల్లీకి పిలిపించి, మేం చెప్పినట్టు చేయకపోతే కేసుల పాలవుతావ్ సుమీ అని హెచ్చరించినట్టుగా తెలుగు పాఠకులు నమ్మాలన్నమాట.,.
Ads
కేసీయార్ ఏమిటో, బీజేపీకి తిరుపతిలో సహకరించడం ఏమిటో అని జుత్తు పీక్కుంటున్నారా..? ఇంకా ఉంది… ఇంగె పారు… ఇది చూడండి…
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో కేసీయార్‌కు చెమటలు పట్టించిన రఘునందన్, బండి సంజయ్‌లతో పాటు పాతబస్తీ కాషాయబరిసె రాజాసింగ్‌ను కూడా బరిలోకి దింపిందట బీజేపీ… అక్కడ కల్లోలం సృష్టిస్తే ఇక చంద్రబాబును మూడో ప్లేసుకు నెట్టేయడమేనట… అదేమిటి ఫాఫం… మన సోము వీర్రాజు, మన ఇతర తెలుగు కాషాయ దురంధరుల మాటేమిటి అంటారా..? బండి సంజయ్ చెప్పినట్టు పనిచేస్తే చాలునన్నమాట… మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు అభ్యర్థి అట… అది సరే గానీ.., దుబ్బాక వేరు, తిరుపతి వేరు మహాప్రభో అని మనం ఎదురు మాట్లాడొద్దు… మన పత్రికలు రాస్తాయి, మన చెవుల్లో పూలను పదిలంగా చూసుకుంటూ మనం చదివి తలలూపాలి… అంతే…
ష్, తిరుపతిలో కాపు వోట్లు ఎక్కువట కదా… అందుకని తెలివిగా అమిత్ షా బండి సంజయ్‌ను పంపిస్తున్నాడేమో… నువ్వు మాట్లాడకోయ్, ఈసారికి త్యాగం చేసెయ్ అని పవన్ కల్యాణ్‌కు కూడా చెప్పడానికి ఢిల్లీకి పిలిచి ఉంటారు ఆమధ్య… ఇవన్నీ కలిసి, తిరుపతిలో గెలిచే వ్యూహం కాదట… జస్ట్, చంద్రబాబును మూడో ప్లేసుకు నెట్టేస్తే చాలునట… దాంతో పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులందరూ కాషాయకండువాలు కప్పేసుకుని, రాష్ట్రంలో నెంబర్ టూ అయిపోవడానికేనట…!
వామ్మో, తిరుపతి ఉపఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఉందా..? ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగి ఇద్దరు సీఎంలను, కీలకమైన నాయకులను తన వ్యూహరచనలో భాగస్వాములను చేశాడా..,? ఇవన్నీ విశ్లేషించి… ‘‘బాబు గారు తన వ్యూహం మేరకు మౌనంగా ఉంటున్నాడు, ఆయన్ని ఇలాగే కెలికితే, తనకు తిక్కలేచి, ఎదురుదాడికి దిగితే మాత్రం బీజేపీ కథ వేరే ఉంటది, కాబట్టి బహుపరాక్’’ అని రాధాకృష్ణ కూడా హెచ్చరిస్తున్నాడు… మొత్తానికి తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయమనీ, ఉపఎన్నికల్లో ఇదంతా కామనేనని, రెండో ప్లేసు కోసమే బీజేపీ, టీడీపీ తలపడుతున్నాయని ముక్తాయించాడు… శుభం, తథాస్తు…
Share this Article