Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సత్తుపిండి & ఆడబిడ్డల పాటలు… నిజమైన బతుకమ్మ నీకెంత తెలుసు..?

October 19, 2023 by M S R

సత్తుపిండి ఒక తియ్యటి మధురపదార్థం !

ఈ వారం పదిరోజులు సత్తుపిండ్ల పరిమళంతో

ఉత్తరతెలంగాణ పల్లెలన్ని సుగంధభరితమౌతాయి.

Ads

ప్రతి ఇల్లూ.. కమ్మటి సత్తుపిండి తయారీకేంద్రమే !

బతుకమ్మ ఆటపాటలకున్నట్టే–

నైవేద్యాలకూ తనదైన ప్రత్యేకత ఉంది.

రకరకాల సత్తులూ, ఓరలూ/అన్నాలూ

అమ్మలగన్న అమ్మకు చాలా ప్రీతికరమైనవి.

సత్తు అంటే సత్తువనిచ్చేది..!

సంతానశక్తిని పరిపుష్టం చేసేదే సత్తు.

సత్తుపిండి.. సాక్షాత్తుగ శక్తి స్వరూపం.

అందుకేగదా పెండ్లయిన ఆడిబిడ్డకు

చీరెతోబాటుగా సారె కూడా పెట్టిపంపేది.

ఇక్కడ కూడా గౌరమ్మకు శివునితోపెండ్లిజేసి

అత్తవారింటికి సాగనంపుతూ.. సద్దులు కడుతరు.

సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ రోజున

గౌరిదేవికి రకరకాల సత్తులు & అన్నాలు నివేదిస్తరు.

తెలంగాణ మెట్టభూముల్ల అరొక్క పంటపండుతది,

పాడిపశువులకు పాలుపెరుగుకూ కొదవే లేదు.

తీరుతీరు సత్తులకు ఇవేకదా ముడిపదార్థాలు !

నువ్వులు, పల్లీలు, పెసళ్లు, మినుములు, శెనగలు,

జొన్నలు, సజ్జలు, మక్కజొన్నలు, గోధుమలు, బియ్యం…

ఇట్లా ఏవి అందుబాటునుంటే.. అవి వేయించి, విసిరి

బెల్లం లేదా చెక్కెర (పొడి విసిరి) సరికిసరి జోడించి,

పొడులకు నెయ్యి , ముద్దలకు పాలుకలిపితే సత్తు సిద్ధం !

స్తోమతకొద్ది.. తొమ్మిదిరకాల వరకు సత్తులు చేస్తరు.

ఎవరికి ఏది ఇష్టమైతే దానిచుట్టే.. ఇక ప్రదక్షిణాలు.

పళ్లెంలో పదిరకాలు వడ్డించుకొని తినుడు మధురానుభూతి !

ఇప్పుడు నేను ఫోటో పెట్టింది… పల్లిసత్తు పిండి.

ఓ వాయి పల్లీలసత్తు ఆ తర్వాత మరోవాయి మరోసత్తు

వాయిమీదవాయి తిన్న బాల్యపుఛాయలది బంగారువన్నె !

ఇదీ.. మధురాతిమధురమైన సత్తుపిండ్ల సంగతి !

~~•~~•~~•~~

బతుకమ్మ అంటెనే ఆడిబిడ్డల ఆత్మీయ సమాగమం.

ఎక్కడెక్కడ ఉన్నవారో పండుగకు తల్లిగారింటికి వస్తరు.

పాలి బలుగం, చిన్ననాటి దోస్తులు, వదినలు-మరుదండ్లు

ఊరూరు సబ్బండవర్ణాలు బతుకమ్మకు ఏకమైతయి.

అన్నదమ్ముల – అక్కజెల్లెండ్ల అనుబంధాలు పూలై పూస్తయి.

కనుక ఏడాదికోదినం ఆడిబిడ్డ బతుకమ్మ పండుగకు

తల్లిగారి ఇంటితొవ్వ తొక్కుతది… ఎంత సంబురమది !

బతుకమ్మ పాటల్లో వందలువందలపాటలు —

తల్లిగారింటి ఆత్మీయతతోనే ముడిపడి ఉంటయి.

బతుకమ్మ పాటల్లో.. అక్కెమ్మ కథ చాలా ప్రశస్తం

ఏడుగురు అన్నల తోడబుట్టిన ఆడిబిడ్డ కష్టపు కథ

ఎన్నిసార్లు విన్నా.. కండ్లనీళ్లు తీయనివారు ఉండరు.

ఆరేడురోజులు వరుసగా పాడుకునే పెద్దపాట ఇది.

ఇటువంటివాటిలో మచ్చుకు, మీ కోసం ఒక రెండుపాటలు

ఈరెండూ, రెండు పార్శ్వాలతో మనలనుకదిలిస్తయి.

బతుకమ్మ పాటల జీవనవిలువలు ఏమిటో నిరూపిస్తయి..

తల్లిదండ్రి ఉన్నంతవరకే, తల్లిగారింటి తొవ్వ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

రామరామరామ ఉయ్యాలో,రామ ఓ శ్రీరామ ఉయ్యాలో

రామరామనందె ఉయ్యాలో,రాగమెత్తగరాదు ఉయ్యాలో

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో,పెత్తరమావాస ఉయ్యాలో

బాలలకు వచ్చింది ఉయ్యాలో,బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో

పడతులకు వచ్చింది ఉయ్యాలో,బతుకమ్మ పండుగ ఉయ్యాలో

పెద్దోడ పెరుమాండ్లు ఉయ్యాలో,చెల్లెను తోల్కరార ఉయ్యాలో

నాకు వీలుగాదు ఉయ్యాలో,నడిపోన్ని పంపు ఉయ్యాలో

నడిపోడ నారాయణ ఉయ్యాలో,చెల్లెను తోల్కరార ఉయ్యాలో

చింతల్ల నేనున్న ఉయ్యాలో,చిన్నోన్ని అడుగు ఉయ్యాలో

చిన్నోడ సిరికృష్ణ ఉయ్యాలో,చెల్లెను తోల్కరార ఉయ్యాలో

అవ్వయ్య ఉండంగ ఉయ్యాలో,అక్కెరలు నాకేమి ఉయ్యాలో

తల్లిదండ్రి మనసు ఉయ్యాలో,తల్లడిల్లిపాయే ఉయ్యాలో

నాయిన్న బయలెల్లె ఉయ్యాలో,నాగపురి పట్నమూ ఉయ్యాలో

పోచమ్మగుడిదాటె ఉయ్యాలో,బొడ్డురాయిదాటె ఉయ్యాలో

కూసుండి కోసేటి ఉయ్యాలో,కూరమళ్లూ దాటె ఉయ్యాలో

వంగంగి కోసేటి ఉయ్యాలో,వరిచేండ్లు దాటె ఉయ్యాలో

నిలుచుండి కోసేటి ఉయ్యాలో,నిమ్మతోటలు దాటె ఉయ్యాలో

బర్లమందలు దాటి ఉయ్యాలో,పొలుమారు దాటె ఉయ్యాలో

ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాలో,ఊడుగుల్లూ దాటి ఉయ్యాలో

నాయిన్న జేరెనే ఉయ్యాలో,నాగపురి పట్నమూ ఉయ్యాలో !!

( సశేషం ! ఇంకా చాలా పెద్దకథ ముందుముందు ఉంటది)

🌺🌺🌺🌺🌺

అత్తగారింటి సుఖం – మోచేతికి తాకిన దెబ్బ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కలవారికోడలూ ఉయ్యాలో,కలికి కామాక్షమ్మ ఉయ్యాలో

కడుగుతున్నది పప్పు ఉయ్యాలో,కడవలల్ల పోసి ఉయ్యాలో

అప్పుడే వచ్చిండు ఉయ్యాలో,ఆమెకూ పెద్దన్న ఉయ్యాలో

కాళ్ళకూ నీళ్ళిచ్చి ఉయ్యాలో,కన్నీరుదీసింది ఉయ్యాలో

ఎందుకూ చెల్లెమ్మ ఉయ్యాలో,ఏమికష్టమమ్మ ఉయ్యాలో

తుడుచుకో కనులనూ ఉ, ,ముడుచుకో కురులనూ ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డనూ ఉయ్యాలో,ఎంబడే పోదాము ఉయ్యాలో

పందిరిమంచాన ఉయ్యాలో,పండుకున్న మామ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో,ఏమేమిదెచ్చిరీ ఉయ్యాలో

గుమ్మడీ పూచీరె ఉయ్యాలో,గువ్వకన్ను రవికె ఉయ్యాలో

పాపనికి పట్టంగి ఉయ్యాలో,పాలుదాగే గిన్నె ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,మీ అత్తనడుగు ఉయ్యాలో

కుర్చి పీటలమీద ఉయ్యాలో,కూసున్న అత్తమ్మ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,పెద్దబావనడుగు ఉయ్యాలో

భారతం చదివేటి ఉయ్యాలో,బావ పెద్దబావ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,పెద్దక్కనడుగు ఉయ్యాలో

పెరుగంటు చిలికేటి ఉయ్యాలో,అక్కరో పెద్దక్క ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,నడిపిబావనడుగు ఉయ్యాలో

నాగండ్లు దున్నించు ఉయ్యాలో,బావ నడిపిబావ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,నడిపి అక్కనడుగు ఉయ్యాలో

నాగాలు లెక్కించె ఉయ్యాలో,అక్కరో నడిపక్క ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,చిన్నబావనడుగు ఉయ్యాలో

చిరగోనెలాడేటి ఉయ్యాలో,బావ చిన్నబావ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,చిన్నక్కనడుగు ఉయ్యాలో

చిలుకలకు మేతేసె ఉయ్యాలో,అక్కరో చిన్నక్క ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో,ఏమేమిదెచ్చిరీ ఉయ్యాలో

గుమ్మడీ పూచీరె ఉయ్యాలో,గువ్వకన్ను రవికె ఉయ్యాలో

పాపనికి పట్టంగి ఉయ్యాలో,పాలుదాగే గిన్నె ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో,మీ రాజునడుగు ఉయ్యాలో

రచ్చలూ ఏలేటి ఉయ్యాలో,రాజేంద్ర భోజ ఉయ్యాలో

మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో,మమ్ము పంపుతార ఉయ్యాలో

కట్టుకో బట్టలూ ఉయ్యాలో,పెట్టుకో సొమ్ములూ ఉయ్యాలో

వెళ్ళిరా పైలంగ ఉయ్యాలో,మల్లరా తొందరగ ఉయ్యాలో !!

~ ప్రజా కవిత్వం / మౌఖిక సాహిత్యం……. డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి, కరీంనగర్… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions