Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!

October 6, 2026 by M S R

.

వేల కోట్లు ఉన్నవాడు చేసే ఔదార్యం కూడా గొప్పదే కావచ్చు … కానీ ‘లేనివాడు చూపించే ఔదార్యం అంతకుమించి ఎన్నోరెట్లు గొప్పది… కరోనా వంటివి మనిషికి ఎన్ని సవాళ్లు విసురుతున్నా, ఎంత క్రూరంగా కదిలించినా, మనుషుల మధ్య ఉండే మంచితనం ఏ మూలనైనా సరే వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్‌లు అక్కర్లేదు, విశాలమైన మనసు ఉంటే చాలని నిరూపించిన ఓ యువకుడి స్ఫూర్తిదాయకమైన యథార్థ కథ ఇది.

చెన్నైలోని సోలింగనల్లూర్, గాంధీ నగర్ ఎరికరై ప్రాంతం… ఆ ప్రాంతంలో సూర్యకళ ఇరుకైన గదిలో ఇద్దరు పిల్లలతో కలిసి కాలం వెళ్లదీస్తున్న మహిళ… ఆమె దీనస్థితి అందరినీ కలిచివేసేది. భర్త వదిలివేయడంతో, నెలకు 1,200 రూపాయల అద్దె చెల్లించడమే కష్టమైన పరిస్థితి. ఒకప్పుడు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగించిన ఆమెకు, ఇప్పుడు ఆ పని కూడా కరవైంది.

Ads

కనీసం బ్లౌజ్‌లు కుట్టడం వస్తే, తన కాళ్ల మీద తాను నిలబడి పిల్లలను పోషించుకోగలననే ఆశతో ఆమె ఎవరికో సహాయం కోసం ఎదురుచూసింది. ఆమె తల్లిదండ్రులది చెన్నై సిందాత్రిప్పెట్టైలోని అత్యంత పేద కుటుంబం; అక్కడి నుంచి కూడా పెద్దగా సహాయం అందే స్థితి లేదు.

ఈ విషయం తెలుసుకున్న నేను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే నా స్నేహితులకు, మంచి మనసున్న వాళ్ల వాట్సాప్ గ్రూపులకు ఈ పరిస్థితిని పరిచయం చేస్తూ సాయం కోరాను…

మధురై నుంచి కదిలిన స్పందన … ఈ సందేశం గ్రూపుల్లోకి చేరిన కొద్దిసేపట్లోనే మధురై నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆ కుటుంబం పడుతున్న ఇబ్బంది గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు. “ఈ కుటుంబం నిజంగానే సహాయానికి అర్హులా, కాదా?” అని ఆరా తీశాడు. ‘నూటికి నూరుపాళ్లు అర్హులే’ అని బదులివ్వగానే, కుట్టుమిషన్ ధర ఎంత అని అడిగి తెలుసుకున్నాడు. దుకాణంలో విచారిస్తే దాని ధర ₹18,000 అని తేలింది. అదే చెప్పాను.

డబ్బులు నేరుగా నాకు పంపమని కోరినా వినకుండా, “డబ్బు నేరుగా కుట్టుమిషన్ షాపునకే పంపిస్తాను” అని చెప్పి, ఆ వాట్సప్ దాత క్షణాల వ్యవధిలో ఆ మొత్తాన్ని నేరుగా దుకాణదారుడికి జమ చేశాడు. ఆ తర్వాత ఉత్సాహంగా బయలుదేరిన నేను ఒక ఆటో అద్దెకు తీసుకుని.. దాదాపు 45 రోజులకు సరిపడే కిరాణా సరుకులు, కుట్టుమిషన్‌‌కు అవసరమైన దారాలు, బటన్లు, హుక్స్‌ అన్నీ కొనుగోలు చేసి నేరుగా సోలింగనల్లూర్‌లోని సూర్యకళ ఇంటికి వెళ్లి అందజేశాను.

అనుకోని నిజం… అవాక్కయిన క్షణాలు! సూర్యకళ కళ్లలో ఆనందభాష్పాలు ఉప్పొంగాయి. ఆమెను వెంటనే కుట్టుమిషన్ ముందు కూర్చోబెట్టి ఏదైనా కుట్టమని చెప్పి, ఈ దృశ్యాన్ని మధురైలోని ఆ మిత్రుడికి వీడియో కాల్‌ చేసి చూపించాను….

అయితే, ఆ వీడియో కాల్‌లో అవతలి వ్యక్తిని చూడగానే నాకు మతిపోయింది. ఫోన్ అవతలి వైపు ఉన్నది సమాజంలో పేరుమోసిన పెద్ద వ్యాపారవేత్తో, ఉన్నత స్థాయి అధికారో కాదు! సుమారు 25 ఏళ్ల వయసున్న ఒక సాధారణ యువకుడు… తన భుజాన టీ కెటిల్, టీ విక్రయించే సైకిల్‌తో వీధి వీధి తిరిగే నిరుపేద టీ వ్యాపారి!

true charity

“మాకు ఇంత పెద్ద సాయం చేసింది మీరేనా?” అని ఆశ్చర్యంతో అడిగాను.
“అవును, నేనే” అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

కన్నీళ్లు తెప్పించే తమిళరసన్ కథ… తన కథా తెలుసుకున్నాను.  అతని పేరు ఏ. తమిళరసన్. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ. బ్రతుకుదెరువు కోసం చెన్నైకి వస్తే, మెరీనా బీచ్‌ చలిగాలులే అతనికి ఇళ్లయ్యాయి. కొన్ని రోజులు తిండిలేదు, కట్టుకున్న బట్టలు, సామానులు కూడా చోరీకి గురై రోడ్డున పడ్డాడు. ఆకలి బాధ తట్టుకోలేక బిచ్చమెత్తే స్థితికి దిగజారాడు.

కాలం అతన్ని మధురైకి చేర్చింది. అక్కడ బతుకు పోరాటంలో భాగంగా సైకిల్ మీద టీ అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తాను పడిన ఆకలి నరకం ఏమిటో అతనికి తెలుసు. అందుకే, తను సంపాదించే కొద్దిపాటి ఆదాయంలోంచే ప్రతిరోజూ రోడ్డు పక్కన ఆకలితో అలమటించే 20 నుండి 30 మంది నిరుపేదలకు, అభాగ్యులకు తన సొంత ఖర్చులతో భోజనం పెడుతున్నాడు.

“రోడ్డు మీద ఆకలితో అలమటించే వారిని చూస్తే నా గతం కళ్ల ముందు కదలాడుతుంది. అందుకే నా కడుపు నిండకపోయినా పర్వాలేదు, ఆకలితో ఉన్నవారికి పెట్టాలనేదే నా తపన” అన్నాడు తమిళరసన్.

డబ్బులు ఉన్నవాళ్లు దానాలు చేయడం వేరు, తన పూట గడవడమే కష్టమైనా తోటివారి ఆకలి తీరుస్తూ, చెన్నైలోని ఓ నిరుపేద మహిళకు ఉపాధి కల్పించిన ఆ టీ సైకిల్ యోధుడు తమిళరసన్ నిజమైన మానవత్వానికి రూపం. సహాయం చేయడానికి రూపాయిలొ, పెద్ద మనసో ఉంటే చాలదని ఈ కథ మరోసారి నిరూపించింది!

(నిజానికి ఇది పాత కథే… కథ కాదు, యథార్థమే… మళ్లీ తెలుగు సోషల్ మీడియా పేజీల్లో, వాల్స్ మీద కనిపిస్తోంది… తప్పేముంది, ఇలాంటివి మరోసారి గుర్తుచేసుకుంటే మంచిదే కదా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!
  • ఎంతకు తెగించావురా..? ఆ ‘యావ’తో జీవిత ఖైదీనే వదిలేశావు!!
  • తప్పే- కానీ ఆ తప్పు తీవ్రత ఎంత..? తప్పుచేశానా? ఓ రిపోర్టర్ స్వగతం!!
  • ‘డోరతి’ మూవీ… ఇది ‘మరో చరిత్ర’… మరో అంటరాని చరిత్ర…
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!
  • సేమ్… ఫ్రాన్స్‌లోనూ బొద్దింకలు – ఈ స్క్రిప్టులు రాస్తున్నదెవరు?!
  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions