అసలే ఇప్పుడు ఐఏఎస్ లు… అయ్యాఎస్ ల గురించి చర్చ జరుగుతున్న కాలం. మన తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ లు ఎలా రూపాంతరం చెంది కొత్త కొత్త హైట్స్ ను క్రియేట్ చేస్తున్నారు… ఏకంగా పాదాభివందనాలతో రాబోయే తరాలకెలాంటి లౌక్యాన్ని నేర్పి, స్ఫూర్తిగా నిలుస్తున్నారో చూస్తున్నాం. మరిలాంటి కాలంలో కాస్తోకూస్తో జనం కోసం కష్టపడే ఐఏఎస్ లూ ఉన్నారా…? ఇంకా వాళ్లు ఆఫ్టరాల్ సివిల్ సర్వెంట్లుగానే ఉండిపోతూ ఉంటూ ఏం సాధించాలనుకుంటున్నారు…? అయ్యా.. ఏస్ అని హాయిగా బతుకనేర్వడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు..? ఇంకా పేద ప్రజలంటూ ప్యాషన్ తో నిజాయితీని నిరూపించుకునేందుకంత శ్రమిస్తున్నారు..? ఇదిగో నేటి కాలాన ఈ ప్రశ్నలన్నింటికీ ఈ ఐఏఎస్ సురేంద్ర కుమార్ కథే ఓ కారణం! అందుకే ఈ ముచ్చట!!
పేరు సురేంద్రకుమార్ మీనా, పశ్చిమబెంగాల్ లోని అలీపుర్దూర్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కలెక్టర్. కరోనా ప్యాండమిక్ వేళ ఉత్తర బెంగాల్ లోని చాలా మారుమూల ప్రాంతాల్లో.. గిరిజన గూడాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడానికి కొండలూ, గుట్టలూ ఎక్కుతూ సుదూర తీరం ఈయనా సిబ్బందితో కలిసి నడిచాడు. ఏకంగా ఇండియా-భూటాన్ బార్డర్ లో బూక్సా హిల్స్ ప్రాంతంలో ఉన్న అడ్మా అనే ఓ మారుమూల గ్రామానికి చేరడానికి 11 కిలోమీటర్ల దూరం కొండలపైకి ట్రెక్కింగ్ చేశాడు ఈ సివిల్ సర్వీసెస్ అధికారి. అంతేనా మరో 16, 18 కిలోమీటర్ల దూరం కాలిబాటన ప్రయాణిస్తూ పోఖరి, తోరిబరి, షిగావ్, ఫల్బాటి వంటి మారుమూల ప్రాంతాలన్నీ చుట్టేసి… అక్కడ ప్రతీ ఇంటికీ ప్రతీ 18 ఏళ్లు పైబడ్డ ప్రతీ వ్యక్తికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు ఈ కలెక్టర్ సారు.
Ads
ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు… అప్పటివరకూ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొన్నవారిలో అవగాహన కల్పించింది కలెక్టర్ సురేంద్రకుమార్ నేతృత్వంలోని బృందం. అంతేనా మాస్కులు, శానిటైజర్స్ ఇలా అన్నీ ఆ గిరిపుత్రులకు ఫ్రీగా పంపిణీ చేయగా… సురేంద్ర కుమార్ బృందం చేపట్టిన ఈ టాస్క్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారైన ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో పాటు… పలువురి రీట్వీట్లతో వైరలవుతోంది వీరి సర్వీస్. పలువురి మన్ననలందుకుంటోంది. కానీ మన దగ్గరకొచ్చేసరికి… ఛఛా ఇదేం ఐఏఎస్…? అసలేమన్నా లౌక్యమున్నదా…? ప్రజల కోసం ఇంత సర్వీసా…? ఆ ప్రజలను పాలిస్తున్నవారిని కాకా పడితే సరిపోదా…? సార్… సురేంద్ర కుమార్ సార్… వెరీ సారీ సార్… మీరు మాకు నచ్చలా! మీకు ట్రెయినింగ్ ఇచ్చినోళ్లూ నచ్చలా… ఓసారి మా తెలుగు రాష్ట్రాల సివిల్ సర్వెంట్లను చూసి నేర్చుకొండి కనీసం… ఒక్కొక్కరినీ జనం ఎంత పొగుడుతున్నారో గమనించండి… అబ్బే……… రమణ కొంటికర్ల…
Share this Article