.
నాదబ్రహ్మ త్యాగయ్య తిరుమల వెళ్ళిన సమయానికి స్వామి కనిపించకుండా తెర ఉంది. (కొన్ని సేవలకు తెర వేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది) మనమైతే తెరతీసేవరకు ఒకరిమీద ఒకరు పడి తొక్కుకుంటూ… విసుక్కుంటూ ఉంటాం.
“తెర తీయగరాదా తిరుపతి వేంకటరమణా!” అని త్యాగయ్య కీర్తన పాడడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తెర తనకు తానే తొలగిపోయింది. అక్కడున్న అర్చకులు, భక్తులు త్యాగయ్య భక్తికి పొంగిపోయారు. ఆ కీర్తన ఈ కథకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికీ ప్రచారంలో ఉంది.
Ads
విమానం దిగి శ్రీవాణీ టికెట్టు చేతబట్టి నేరుగా వెళ్ళినా…
లక్షలో, కోట్లో విరాళమిచ్చి దాతలుగా అందరినీ తోసిరాజని డోనర్ టికెట్ల ధనబలంతో వెళ్లినా…
రాజకీయనాయకుల ఎల్ ఒన్ పైరవీ ఉత్తరాల కండబలంతో వెళ్ళినా…
దళారుల చేతులు తడిపి దుర్మార్గంలో వెళ్ళినా…
పది, ఇరవై, ముప్పయ్ గంటలు ఎండలో, వానలో పగలూ రాత్రీ క్యూలో ఉండి భయభక్తులతో సన్మార్గంలో వెళ్ళినా…
ఎవరిని చూడాలి? ఎవరిని చూడకూడదు? అనేది పూర్తిగా వెంకన్న ఇష్టం. “ఫలానా దర్శనంలో పది నిముషాలు స్వామి ముందు నిలుచోబెట్టారు. స్వామితో ఉభయకుశలోపరి బాగోగులు మాట్లాడాను…” అని గర్వంగా చెప్పుకోవడం మన అజ్ఞానం, అహంకారమే తప్ప భక్తి కానే కాదు.
రోజూ బంగారు పూలతో పూజ చేసిన తొండమాన్ చక్రవర్తి పూలు స్వామిని చేరలేదు. తిరుపతికి దగ్గర్లో కుమ్మరి భీముడు ఇంట్లో చేసిన మట్టి పువ్వు, పెంకు మీద పెట్టిన పెరుగన్నం మాత్రం స్వామిని చేరిన నిజకథ వేంకటేశ్వర భక్తివైభవంగా కథలుకథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అన్నమయ్య కీర్తనలో కూడా ప్రస్తావించాడు.
“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ;
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!”
నేను వైకుంఠంలోనో, యోగుల హృదయాల్లోనో ఉండను. నన్ను కీర్తించే భక్తుల హృదయాల్లో ఉంటాను- అని సాక్షాత్తు నారాయణడు నారదుడికి చెప్పిన మాట. ఏది భక్తి? ఏది కాదు? అన్న చర్చ ఇక్కడ అనవసరం.
చిన్నతనంలోనే పూర్తిగా చూపు కోల్పోయిన జగేంద్ర బెంగళూరు వాసి. తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని ఎప్పటినుండో అతడికి కోరిక. ఇరవై శాతం మాత్రమే చూపున్న వ్యక్తి శశికిరణ్. ఇద్దరూ స్నేహితులయ్యారు.
మిత్రుడితో తన మనసులో మాట చెప్పాడు జగేంద్ర. జగేంద్రను తిరుపతికి తోడుకొని వచ్చాడు. శ్రీవారి మెట్లమార్గంలో ఒక్కో మెట్టుకు కర్రను తగిలిస్తూ ఇద్దరూ కొండెక్కారు. స్వామిని దర్శించుకున్నారు.
- దర్శనమయ్యాక శశికిరణ్ చెప్పిన మాట ప్రపంచంలోని సకల భక్తి సూత్రాల సారంలా ఉంది. “ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చాము. స్వామిని కళ్ళతో చూసే భాగ్యం ఈజన్మకు లేకపోయినా…స్వామి ముందు నిలుచున్నామన్న అనుభూతి చాలు. వచ్చే జన్మంటూ ఉంటే స్వామిని కళ్ళతో చూసే అదృష్టమివ్వు…” అని వేడుకున్నారట.
విష్ణుభక్తుల పాదధూళిని తమలపాకుమీద పెట్టుకుని… భక్తి, గౌరవాలతో ఆ తమలపాకును నెత్తిన పెట్టుకుని రమ్మంటాడు యముడు భాగవతం అజామీళోపాఖ్యానంలో. అలా రోజూ లక్షమంది, ఏటా కోట్లమంది స్వామిని దర్శించుకుంటున్నట్లు లెక్కలు, హుండీలో రోజూ పోగయ్యే కోట్ల లెక్కలను దాటి శశికిరణ్, జగేంద్రలాంటివారు రోజూ ఎంతమంది దర్శించుకుంటున్నారని లెక్కకట్టగలిగిన కంప్యూటర్లు ఉంటాయా?
“నీ పాద కమల సేవయు,
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును,
తాపస మందార నాకు దయసేయ గదే!”
మధురానగరంలో రోజూ కృష్ణుడి కోసం పూలహారాలు తయారుచేసి… ఎదురు చూస్తూ ఉంటాడు సుదాముడు. ఒక శుభ ముహూర్తాన కృష్ణుడు అతడి ఇంటికి రానే వచ్చాడు.
కృష్ణుడి మెడలో మాలలు వేసి ఆనందబాష్పాలతో, ముకుళిత హస్తాలతో నిలుచుంటాడు. ఆ పూలహారాల అల్లికకు, పరిమళానికి పొంగిపోయిన కృష్ణుడు ఏమి కావాలో కోరుకో ఇస్తాను- అంటాడు. అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడితో సుదాముడు చెప్పిన మాట ఇది.
- కృష్ణుడు మూడుసార్లు మొహమాటపెడితే ముచ్చటగా సుదాముడు అడిగిన మూడు కోరికలివి. 1. నీ పాదాలను పూజించే భాగ్యం; 2. నీ భక్తులతో స్నేహం; 3. సకల జీవులను సమభావంతో చూడగలిగే భూతదయ. మన పోతన పోతపోసిన కృష్ణభక్తిలో ఇలాంటివి కోకొల్లలు.
కృష్ణుడు నేరుగా మూడుసార్లు అడిగితే… మనమైతే 1. మన పిల్లలకు ఐఐటీలో సీటు, 2. కోకాపేట నియోపొలిస్ లో హై రైజ్ ఇల్లు, 3. పిల్లలకు అమెరికా హెచ్ వన్ బి వీసాలు అడిగేవాళ్ళం.
నాయనా! నీ పేరే శశికిరణ్!
వెంకన్న రెండు కళ్ళు సూర్యచంద్రులు (శశి-కిరణ్). మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు వెంకన్న తన శశికిరణాలను విప్పార్చి చూసే ఉంటాడు. ఇంకా నీలాంటివాళ్ళు లోకంలో ఉండబట్టి వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి. రోజూ సూర్యుడు తూర్పునే ఉదయించి… పడమటనే అస్తమిస్తున్నాడు.
కళ్ళు లేవని మీరు కలతపడద్దు. కళ్ళున్న మాకంటే మీరే స్వామిని దగ్గరగా చూశారు. మీ లోచూపు ముందు మేమెంత? మా ప్రదర్శన పటాటోప దర్శన భక్తి ఎంత? మీ మనోనేత్రం చూపు ముందు మా కళ్ళ చూపు ఎంత? మా అజ్ఞానాంధకారాల్లో మీ భక్తి వెలుగే వెలుగు. మీ భక్తి చూపే చూపు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article