లక్ష వ్యాసాలు… కోటి కథనాలు… ముక్కోటి స్పూర్తి పోస్టులు…….. ఈ ఒక్క వార్త ముందు దిగదుడుపే…. స్మశానాల్లో శవాల్ని తగలేసే ఈ మహిళామూర్తి ముందు అన్నీ బలాదూర్… దమ్ముండాలి… గుండెలో ధైర్యముండాలి… మెచ్చుకోవడానికి కూడా…! జస్ట్, స్తంభాల్ని ఎక్కే పోల్ వుమెన్ను ఆహాఓహో అనడం కాదు… అంతరిక్షయాత్రకు వెళ్లే వుమెన్ను అభినందించడం కాదు… అంతిమయాత్రల అసిస్టెంట్ గురించి చప్పట్లు కొట్టడానికి ఆత్మ ఉండాలి… అదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ చేయాల్సింది… ఛట్, మహిళలు అన్నీ చేస్తారు, చేయాలి, చేయడాన్ని మెచ్చుకోవాలి… కానీ కొన్ని పనులు చేసే మహిళలను మనస్పూర్తిగా ప్రశంసిస్తేనే అది మహిళాలోకానికి స్పూర్తి… ఇది సోకాల్డ్ వందల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ పత్రికల్లో వచ్చిన వార్త కాదు… వాళ్లకు ఇలాంటివి పట్టవు కూడా… దిశ అనే డిజిటల్ పేపర్లో కనిపించింది… సదరు పత్రికకు కాదు, ఆ వార్త రాసిన రిపోర్టర్ ఎవరో గానీ, తనకు అభినందనలు… దటీజ్ ది రియల్ స్పిరిట్ ఆఫ్ వుమెన్స్ డే…
మహిళ దినోత్సవంపై మన డొల్ల శుభాకాంక్షల్లోని హిపోక్రసీ మనకు తెలిసిందే గానీ… ఈ కథేమిటో తెలుసా..? భద్రాచలం వైకుంఠధామంలో ముత్యాల శ్రీనివాసరావు అనే కాటికాపరి… శవాల్ని దహనం చేసేవాడు… ఇద్దరు పిల్లలు… శవాలతో సహవాసం అంత వీజీ పని కాదు… రేయింబవళ్లు పీనుగులతో పని అంటే మాటలా మరి..? తాగీ తాగీ కాలేయం ఫెయిలై హరీమన్నాడు… ఆయన భార్య అరుణ… ధైర్యంగా భర్త వృత్తినే తనూ చేపట్టింది… శవాలా..? అయితేనేం..? ఈ జీవనకష్టాలకన్నా భయంకరమైనవా..? ఏదయితే అదయింది… ఈ పీనుగులు, వాటిని ఈ లోకం దాటించే పనులు పెద్ద సమస్యా ఏం..? కడుపు నింపుకోవడంకన్నా పెద్ద పనా ఏం..? ఆకలి భయాన్ని మించిన భయమేముంది..? సో, ఆ వృత్తినే చేపట్టింది… ఇద్దరు పిల్లలే కాదు, మరికొందరు అనాథల్నీ చేరదీసింది… ‘ఎహె, బతికున్నవాళ్లకన్నా చచ్చినోళ్లే చాలా మంచోళ్లు’ అంటోంది…
Ads
నిజానికి తాగీ తాగీ మొగుడు సోయి లేకుండా పడిపోతే, గతంలో కొన్ని శవాల అంత్యక్రియల్ని తానే చేసేది… పెద్ద పనేమీ కాదు… భయమేమీ లేదు… అందుకే మొగుడు చచ్చిపోయిన కొన్నాళ్లకే తనూ ఆ వృత్తినే చేపట్టింది… థూ, ఇదేం పని అన్నారు కొందరు… అలా చీదరించుకునే పీనుగులు మన కడుపు నింపవు… అందుకే ఆ పనే శిరోధార్యం అనుకుంది… ‘‘వస్తాయి, కుళ్లిపోయిన స్థితిలో కూడా శవాలు వస్తాయి… కరోనా టైంలో రకరకాల పీనుగులు… ఒకడు ముట్టుకోవద్దంటాడు, ఒకడు తీసుకొచ్చి పారేసిపోయాడు, ఒకడు స్మశానం బయటే పారేసిపోయాడు… అందరినీ నేేనే సాగనంపాను… భయపడితే ఎలా..? ప్రాణం పోయాక ఎవరికీ ఎవరూ ఏమీ కారు… ఇదే జీవితసత్యం… మనిషి పీనుగు ముందే డబ్బుల కోసం పంచాయితీలు పెట్టుకున్నవారిని చూశాను… వీళ్లందరికన్నా పోయినోళ్లే నయం… నాకేం భయ్యం..?’’ అంటోంది ఆమె… గ్రేట్… నిత్యజీవితసత్యం ఇది… ఖగోళంలోకి వెళ్లే ఓ అంతరిక్ష మహిళతో పోలిస్తే… ఈ అంతిమయాత్రల సహకారి ఏమీ తక్కువ కాదు… కాస్త ఎక్కువే… ఎక్కువే…!! పర్లేదు… మీరు ఎవరూ కిరీటాలు పెట్టాల్సిన పని లేదు… శుష్క ప్రశంసలతో ఆమెకు అస్సలు పని లేదు…!!!
Share this Article