Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచు కొండల మీదుగా… ఇది మన సైనికుల మరో యుద్ధం…

May 23, 2024 by M S R

మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు

కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి. ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అతి ఎత్తయిన దారి కర్దుంగా పాస్- సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. కనువిందు. దక్షిణ భారతం నుండి వచ్చినవారికి కనుచూపు మేర పరచుకున్న ఈ మంచు; ఎముకలు కొరికే చలి ఒక వింత అనుభవం.

కర్దుంగా పాస్ దగ్గర కాపలా కాస్తున్న సైనికులతో హైదరాబాద్ నుండి వచ్చాము అని నన్ను పరిచయం చేసుకుని మాట కలిపాను. చలికాలంలో కూడా ఇక్కడ మిలటరీ బేస్ ఉంటుందా? అని అడిగితే అప్పుడే కదా ఎక్కువ అవసరం అన్నారు. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? అని అడిగాను. మైనస్ 35డిగ్రీల చలిలో అంతా గడ్డకట్టి ఉంటుంది. పగలు కూడా కంటికి రంగు కళ్లద్దాలు పెట్టుకోకపోతే మంచుమీద ప్రతిఫలించే కిరణాల వెలుగుకు దేన్నీ చూడలేము. ఒక నిముషంలో కనురెప్పలమీద కూడా మంచు పేరుకుపోతుంది- అన్నారు. మా భద్రతకోసం మీరుపడే కష్టానికి ఒక పెద్ద సెల్యూట్ అని నమస్కరించాను. ఆ గుంపులో నుండి ఒక సైనికుడు వచ్చి గట్టిగా కౌగలించుకుని- ఇది మా విధ్యుక్త ధర్మం. దాన్ని గుర్తించి… గౌరవించినందుకు ధన్యవాదాలు అన్నాడు.

Ads

ఎప్పటినుండో సింగిల్ రోడ్డుగా ఉన్న దారిని ఇప్పుడు డబుల్ రోడ్డు చేస్తున్నారు. దారిపొడవునా ఆ పనులే జరుగుతున్నాయి. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఆరు నెలలు విపరీతమైన చలిగాలులు. మంచు కురుస్తూ ఉంటుంది. మైనస్ డిగ్రీల వాతావరణం. పగలు కరిగే మంచుతోపాటు కొండలమీది నుండి పెద్ద పెద్ద బండరాళ్లు కింద పడుతూ ఉంటాయి. రోడ్డు విస్తరణకు, కనీసం మరమ్మత్తులకు కూడా అనువుగా ఉండదు. దాంతో ఏప్రిల్ నుండి పనులు మొదలుపెట్టి చేయగలిగినంత సెప్టెంబర్ లోపు చేస్తుంటారు.

ఒకవైపు లోయ. మరోవైపు రాతి కొండ. ఉన్న సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు కావాలంటే రాతి కొండను తొలచాలి. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ వాహనాలు. జె సి బీ లు. క్రేన్లు. రాతిని బ్లాస్ట్ చేసే ఆధునిక పద్ధతులు. అలాగని ఉన్న అరకొర దారిని పూర్తిగా మూసివేసి పనులు చేయడనికి వీల్లేదు. ఎక్కడ డ్రిల్లింగ్, బ్లాస్ట్ జరుగుతోందో అక్కడ మాత్రమే ఒకటి రెండు కిలోమీటర్లు వాహనాలను ఆపడం, పగిలిన రాళ్లను, మట్టి దిబ్బలను వెంటనే తొలగించి ఆ దారిలోనే వాహనాలను పంపడం. ఇదంతా పల్లపు ప్రాంతాల్లో మామూలు రోడ్డు కార్మికులు చేసే పనులు కావు. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు రహదారి సంస్థ- బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్- బి ఆర్ ఓ చేస్తున్న పనులివి.

నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఒక్క ఊరు ఉండదు. మనిషన్నవాడు కనిపించడు. రాత్రిళ్లు అక్కడే ఉండడానికి వీలుగా ఎక్కడికక్కడ తాత్కాలిక గుడారాలు. ఒరిస్సా, ఝార్ఖండ్, బీహార్, యు పి, పంజాబ్, హర్యానాల నుండి వచ్చిన వేల మంది కార్మికులు అహోరాత్రాలు పనిచేస్తున్నారు. కొట్టిన రాళ్లమీదే కూర్చుని చేతిలో రొట్టె ముక్క మీద కూరను పెట్టుకుని స్ప్రింగ్ రోల్లా చుట్టి తింటున్నారు. మధ్యాహ్నం కునుకు పడితే ఆ బండల మీదే పడుకుంటున్నారు. పగలు కూడా లెదర్ జాకెట్లు, మంకీ క్యాప్ లు, చేతులకు గ్లౌజ్ తప్పనిసరి.

దారిపొడవునా రోడ్డు నిర్మాణ కూలీలను చూస్తుంటే- కారులో కూర్చున్న నా చెవుల్లో
“తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు ?” అన్న శ్రీశ్రీ ప్రశ్నే ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటిచోట్ల నల్లేరు మీద బండి నడకలా మన హాయి ప్రయాణానికి ఎన్ని కొండలను పిండి కొట్టడానికి ఎన్ని గుండెలు ఎంతగా అవిసిపోయాయో! పనుల్లో ఎన్నెన్ని ప్రమాదాల్లో ఎందరు ప్రాణాలు కోల్పోయారో! ఎందరి శ్రమ రక్తం చెమటగా చిందితే ఈ దారులు పరచుకుంటున్నాయో!

“True Ladakh begins where the road end”
“దారి ఆగిపోయిన దగ్గరే అసలు లడాఖ్ మొదలవుతుంది”.
అని లడాఖ్ వాసులు గర్వంగా చెప్పుకుంటారట. నిజమే . ఇప్పుడంటే ఈ ఆటోమేటిక్ డ్రిల్లింగ్ వాహనాలు, జె సి బీ లు. ఇవేమీ లేని రోజుల్లో చైనా నుండి యూరోప్ వరకు 6,400 కిలోమీటర్ల దూరపు “గ్రేట్ సిల్క్ రూట్” ఉంది కదా! రెండో శతాబ్దం నుండి పద్నాలుగో శతాబ్దం దాకా వెయ్యేళ్లకు పైగా ఆ సిల్క్ దారిలోనే గుర్రాలు, ఒంటెలు, గాడిదల మీద అంతులేని వ్యాపారం జరిగింది కదా! తలచుకుంటేనే నిలువెల్లా పులకించిపోవాల్సిన ఆ శతాబ్దాల సిల్క్ దారి ఇప్పుడు ఈ లేహ్- లడాఖ్ తారు రోడ్డు కింద మౌన గీతాలు పాడుకుంటూ ఉందేమో! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions