మిలార్డ్! మీరు కొంచెం ఓపిగ్గా వినాలి. నేనేమీ చిన్న పిల్లాడిని కాను. డెబ్బయ్ నాలుగేళ్ల పండు ముసలివాడిని. యాసిడ్ తో కడిగినా శుభ్రం కాని నా నోటితో అనకూడని, మర్యాదస్తులు వినకూడని మాటలు నేనన్నది నిజమే. లోకం విన్నది నిజమే. నాకు లెక్కలేనంత తిక్క ఉంటుంది- దానికి ఏ లెక్కలూ ఉండవు. లెక్కలేనితనమే దాని లెక్క. ప్రపంచానికి పెద్దన్నగా, అగ్ర రాజ్యంగా తనకు తాను అనుకునే దేశాధ్యక్ష స్థానంలో కూర్చున్నంత మాత్రాన నా లెక్కలేనితనం లెక్క తప్పదు. నా మాటలు, చేతలు, చూపులు అన్నిట్లో మూర్తీభవించిన లెక్కలేనితనం ఉందా లేదా అని లెక్క చూసుకోవడం వరకే నా పని. దాని ఫలితం నా లెక్కలోకి రాదు.
నా దృష్టిలో అమెరికా క్యాపిటోల్ బిల్డింగ్ అన్ని బిల్డింగుల్లా ఒక బిల్డింగ్. లెక్కలేనితనంతో నా అనుచరులు క్యాపిటోల్ బిల్డింగ్ మెట్లు ఎక్కలేక గోడలెక్కారు. మెట్ల దారి మూసినప్పుడు పక్కదారి తప్పు కాదు. లోపల చట్ట సభల సభ్యుల పైప్రాణాలు పైనే పోయి చావు తప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డారంటే అది మా లెక్కలేనంత మంది అనుచరుల అంతరాంతరాల్లో ఏ మూలనో దాగి ఉన్న జాలి, దయ, కరుణ, గుండె తడి వల్ల సాధ్యమయ్యింది. గుండె మండినప్పుడు బయట కాల్పులు, లోపల కాల్పులు విశ్వమంతా కాల్పులు సహజం.
Ads
నిజానికి ఎన్నికల్లో నేను ఓడినా- ఓడలేదు. ఆయన గెలిచినా- గెలవలేదు. నేను గెలిస్తే- న్యాయం గెలిచినట్లు. నేను ఓడితే- న్యాయం ఓడినట్లు. ఇప్పుడు ఓడింది నేను కాదు- న్యాయం. కాబట్టి న్యాయంగా ఓడిన న్యాయాన్ని అన్యాయంగా అయినా గెలిపిద్దామని చలో క్యాపిటల్ బిల్డింగ్ పిలుపునిచ్చా. ఆ అన్యాయ మార్గంలో తరువాత “అ” ఒక్క అక్షరం తీసేసుకోవచ్చు. అప్పుడది న్యాయ మార్గమయ్యేది. పన్నెండు రోజుల ముందే అభిశంసనతో నాకు ఉద్వాసన పలకాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి- నాకున్న విచక్షణాధికారంతో నన్ను నేనే క్షమించుకుంటున్నా. దాంతో నాకు విచక్షణ లేనే లేదని తీర్పు చెప్పే విచక్షణాధికారం మీరు కోల్పోతారని గుర్తించాలి. ఆ తరువాత నామీద ఎలాంటి విచారణలకు ఆదేశించినా అవన్నీ చట్ట వ్యతిరేకమవుతాయి అని మీ విచక్షణకు నేను గుర్తు చేయాల్సిన పనిలేదు.
———————–
పన్నెండు రోజుల తరువాత అమెరికా టీ వీ డిబేట్లలో మేధావుల చర్చల సారమిలా ఉండబోతోంది:-
అతడు తెలివయిన మూర్ఖుడు.
అతడు మూర్ఖుడయిన రాజు.
అతడు మూర్ఖుడయిన నియంత.
అతడు మర్యాద తెలియని మూర్ఖుడు.
అతడు అమెరికాలో అణగి ఉన్న మూర్ఖత్వానికి ప్రతీక.
అతడు అమెరికా మూర్ఖ శిఖామణి.
అతడు ఒక మూర్ఖవాద ప్రతినిధి.
———————-
రెండు నెలలు గడిచాయి. ఒక గోల్ఫ్ మైదానంలో పచ్చటి గడ్డి మీద అమర్చిన తెల్లటి బంతి. అతడు గురి చూసి బలంగా కొట్టడానికి గోల్ఫ్ స్టిక్కును గాల్లోకి లేపాడు. భుజబలంతో కొట్టాడు. ఆ బంతి కనుచూపు మేరలో కనపడకుండా పోయింది. ఆ పోయిన బంతితో పాటు అమెరికా తనకు తాను గొప్పగా చెప్పుకుని మురిసిపోయే ప్రజాస్వామ్య పటాటోపం కూడా పోయింది. భాషలో “అతడు” సర్వనామం. భావంలో “అతడు” సర్వనామవాచకం.
అర్థంలో అతడు కొట్టగా కనిపించకుండా పోయిన ఆ బంతి- “అమెరికా పరువు”……. By……. పమిడికాల్వ మధుసూదన్
Share this Article