.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై “రైస్ డంపింగ్” ఆరోపణలు చేస్తూ ప్రసంగించిన క్లిప్ వైరల్ అయిన మరుక్షణమే, న్యూజెర్సీలోని “దక్షిణ భారతీయ సంఘం” వాట్సాప్ గ్రూపుల్లో అగ్గి రాజుకుంది…
“విన్నారా?” అని డల్లాస్‌లోని శ్రీధర్ టైప్ చేశాడు. “భారత్ బియ్యాన్ని డంపింగ్ చేస్తోందట… అంటే, బియ్యంపై సుంకం (Tariff) వేస్తాడా?”
Ads
“సరిగ్గా అదే నా భయం, శ్రీధర్!” అని ఎడిసన్‌లో ఉన్న వెంకటేశ్వర రావు, అలియాస్ వెంకట్, రిప్లై ఇచ్చాడు. “అలా జరిగితే, మన బాస్మతి ధర..? దేవుడా, మన సోనా మసూరి ధర ఆకాశాన్నంటుతుంది! ఇప్పటికే 20 పౌండ్ల సంచికి $25 చెల్లిస్తున్నాం…”
- ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యతో దక్షిణ భారతీయుల్లో ఓ ఆందోళన… ఇప్పటికే రకరకాలుగా భారతీయులను వేధిస్తున్న ట్రంప్ ఇక మనల్ని కడుపు నిండా అన్నం కూడా తిననివ్వడా అనే ప్రశ్న… ఏంటీ ఇండియన్లపై ట్రంపు కక్ష..?
ఉత్తరాది భారతీయులకు గోధుమలు ముఖ్యమైనవి, అవి అమెరికాలోనూ పుష్కలంగా దొరుకుతాయి. కానీ, ఇడ్లీ, దోశ, పులిహోర, బిర్యానీలతో మొదలయ్యే వంటకాల ప్రపంచం దక్షిణాది భారతీయులది… వారికి బియ్యం అనేది కేవలం ఆహారం కాదు, జీవన విధానం… ఈ బియ్యం సరఫరాలో చిన్నపాటి అడ్డంకి వచ్చినా, అది తమ వంటింట్లో సంక్షోభమే..!

వంటింటి భౌగోళిక రాజకీయాలు (Kitchen Geopolitics)
నిజానికి ట్రంప్ వాదన వాణిజ్యపరంగా, రాజకీయంగా,, గణితపరంగా తప్పు… అమెరికాకు భారతదేశం ఎగుమతి చేసే బియ్యం కేవలం “రౌండింగ్ ఎర్రర్” లాంటిది… దాదాపు $ 337 మిలియన్లు, అది కూడా అమెరికాలో పండించడం సాధ్యం కాని ప్రీమియం బాస్మతి రకం… నిజమైన కథ ఏంటంటే, భారత్ అనేది “ప్రపంచపు నిశ్శబ్ద ఆహార శక్తి”… ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు ఆహారం అందిస్తున్న తిరుగులేని ఛాంపియన్ అని ఆ ట్రంప్ వ్యాఖ్య అనుకోకుండా బయటపెట్టింది…
ఆ సాయంత్రం, వెంకట్ తన గ్యారేజీలో నిలబడి, బియ్యం షెల్ఫ్‌ను చూశాడు… అతని ప్రియమైన బాస్మతి (ఒక ప్రత్యేకమైన భారతీయ బ్రాండ్) సంచులు రెండు, అతని భార్య వారం వారం చేసే ఉప్మా కోసం సోనా మసూరి సంచి ఒకటి…
“ఇంతే మన దగ్గర మిగిలింది” అని అతను తన భార్య ప్రియతో అన్నాడు… “ఒకవేళ నిజంగా అధిక సుంకం విధిస్తే, మనం ఆ రుచి లేని కాలిఫోర్నియా లేదా థాయ్ బియ్యానికి మారాలి… మన పిల్లలకు అసలు సరైన పులిహోర రుచి ఎలా ఉంటుందో కూడా తెలీకుండా పోతుంది అప్పుడు…”
మూడు అమెరికన్ ఆర్థిక మాంద్యాలను, ఒక ప్లంబింగ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రియ, ఆచరణాత్మకంగా ఉంది… “వెంకట్, కోరికపై పన్ను వేయలేరు కదా… మంచి బియ్యం కావాలంటే, ప్రజలు ఎంతైనా చెల్లిస్తారు… అయినా సరే, రేపు కాస్ట్‌కోకు వెళ్లి రెండు సంచులు ఎక్కువగా కొను… ముందు జాగ్రత్తగా…”
సగటు ఇండియన్ మెంటాలిటీ కదా… మరుసటి రోజు ఉదయం, ఎడిసన్‌లోని స్థానిక ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనూహ్యంగా రద్దీగా ఉంది… దక్షిణాది భారతీయులు, తమ కార్టుల్లో బియ్యాన్ని నింపుకుంటున్నారు నిశ్శబ్దంగా… వారు భయంతో కొనడం లేదు; వారు దూరదృష్టితో కొనుగోలు చేస్తున్నారు…
నిదానమే ప్రధానం
ఇండియాలోనూ అంతే… పెట్రోల్ ధరలు పెరగ్గానే బండ్లు ఫుల్ చేయించి, ఆ క్షణం విజయానుభూతి పొందుతాడు సగటు ఇండియన్… వెంకట్ కూడా ఇక్కడ తన అదనపు సంచులను భద్రపరచుకుని, కొద్దిగా విజయం సాధించిన అనుభూతిని పొందాడు… తాత్కాలిక విజయం… కానీ మరింత భారాన్ని మోయటానికి అక్కడే సైలెంటుగా మానసికంగా ప్రిపేర్ అయిపోతాడు…
కొన్ని నిజాలు…
1) బెనిన్, సోమాలియా, బంగ్లాదేశ్ వంటి పేద దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన లైఫ్‌లైన్‌గా నిలుస్తున్న నాన్-బాస్మతి బియ్యాన్ని సరఫరా చేసేది ఈ భారతదేశమే…
2) ఒక సంవత్సరం క్రితం, దేశీయ ధరలను స్థిరీకరించడానికి భారత్ ఎగుమతిపై పరిమితి విధించినప్పుడు, ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించి, ప్రపంచపు అన్నం గిన్నె భారతీయ రైతుల చేతుల్లో ఉందని నిరూపించింది…
3) దశాబ్దాల వ్యవసాయ సంస్కరణలు, కనీస మద్దతు ధర (MSP) ఆధారిత ప్రోత్సాహకాలు, రైతుల సంకల్పం కారణంగా ఒకప్పుడు అమెరికా సహాయం (PL-480)పై ఆధారపడిన ఈ దేశం, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల ఎగుమతిదారుగా మారింది…
ఇదీ రియాలిటీ… ట్రంప్ ఆవేశపూరిత వ్యాఖ్యపై కోపం, ఆందోళన త్వరగా తగ్గిపోయి, ఒక నిశ్శబ్దమైన గర్వం చోటు చేసుకుంది… ఆ వ్యాఖ్య, ఇండియాను డంపింగ్ దేశం అని విమర్శించటానికి ఉద్దేశించినప్పటికీ, అనుకోకుండా ఒక అసాధారణ సత్యాన్ని వెల్లడించింది…
అమెరికాకు ప్రీమియం బాస్మతి కోసం ఉన్న చిన్నపాటి అవసరం, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతలో భారతదేశం ఆధిపత్యం ముందు చాలా చిన్నది… అమెరికన్ అధ్యక్షుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా, ప్రపంచానికి భారతదేశపు బియ్యం అవసరం… అమెరికాలోని దక్షిణ భారత వినియోగదారుడు ఎల్లప్పుడూ భారతీయ బియ్యం సంచి కోసం చూస్తాడు.., ఎందుకంటే దానిలో కేవలం ధాన్యాలు మాత్రమే కాదు, నాణ్యత, రుచి తాలూకు వారసత్వం కూడా ఉంది… ఆహార సంస్కృతితో సహా..!
ఇంటికి చేరుకున్నాక, వెంకట్ తన ‘బాస్మతి బంకర్’ను జాగ్రత్తగా దాచి, తన కూతురు ఆనందంగా తింటున్న పెరుగు అన్నాన్ని చూశాడు… అతను నవ్వాడు… “కంగారు పడకు, కన్నా, ఎంత టారిఫ్ వేస్తాడో వేయనీ…” అని అతను మనసులో అనుకున్నాడు… “వారు ఎన్ని సుంకాలు వేసుకున్నా సరే… ఆంధ్ర, తెలంగాణల వెలుపల ఎవరైనా సరైన సోనా మసూరి పండించడం నేర్చుకునే వరకు, మన అన్నపూర్ణ క్షేమంగానే ఉంటుంది…”
అమెరికాకు ఇండియా నుంచి ఏటా లక్ష టన్నుల బియ్యం ఎగుమతి జరుగుతుందని ఓ అంచనా… ఇంకొన్ని వివరాలు చూద్దాం… (నిజానికి ఇండియాతో ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి వచ్చేవరకు... లేదా పుతిన్ లాగే జిన్‌పింగ్, నెతన్యాహూ కూడి ఇండియాకు వచ్చి సెల్ఫీలు దిగేవరకు... ట్రంప్ బెదిరింపులు, సతాయింపులు సాగుతూనే ఉంటాయి... ఈ సుంకాల బ్లాక్‌మెయిలింగ్ దానికోసమే... అమెరికా అంటేనే బ్లాక్ మెయిలర్ కదా...)
.
ప్రపంచ బియ్యం ఉత్పత్తి (World Rice Production)… 500 మిలియన్ టన్నులకు పైగా (సుమారుగా)
భారతదేశం వాటా (ఉత్పత్తి) (India’s Share in Production)… 28% కంటే ఎక్కువ
భారతదేశ వార్షిక ఉత్పత్తి (India’s Annual Harvest)… దాదాపు 150 మిలియన్ టన్నులు
ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా (India’s Share in Global Exports)… 30%
భారతదేశ వార్షిక ఎగుమతులు (India’s Annual Exports)… 20 మిలియన్ టన్నులకు పైగా (గత సంవత్సరం)
భారతదేశం నుండి US కి ఎగుమతులు (India’s Exports to US)… $337 మిలియన్లు (భారత్ మొత్తం ఎగుమతుల్లో చాలా తక్కువ భాగం)
భారతదేశ మొత్తం బియ్యం ఎగుమతుల విలువ (India’s Total Rice Export Value)… $13 బిలియన్లు
బాస్మతి ఎగుమతుల వాటా (విలువలో) (Basmati Share in Total Export Value)… 52%
నాన్-బాస్మతి ఎగుమతుల వాటా (పరిమాణంలో) (Non-Basmati Share in Total Export Volume)…. 70%
Share this Article