కొన్ని నవ్వొచ్చే ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉంటాయంటే…? ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… ‘‘ఎక్సయిజు కమిషనర్ రామకోటేశ్వరరావు నేతృత్వంలో, సూపరింటిండెంట్ యాదగిరిరావు పర్యవేక్షణలో, డీఎస్పీ అజీజ్ సూచనలతో, సీఐ క్రిస్టోఫర్, ఎస్సయిలు రాములు, కోటగిరి బుధవారం రాత్రి దాడులు చేసి, అక్రమంగా తయారీ చేసి, నిల్వ ఉంచిన 25 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు..’’ ఇదీ ప్రకటన… కానిస్టేబుళ్ల పేర్లు, ఎక్సయిజు మంత్రి పేరు, చీఫ్ సెక్రెటరీ పేర్లు రాయలేదు, సంతోషం… పత్రికల్లో వచ్చే రాజకీయ వాణిజ్య ప్రకటనలు చూశారా..? ఉదాహరణకు టీఆర్ఎస్ లీడర్లవి… కేసీయార్, కేటీయార్, హరీష్, కవిత, సంతోష్ ఫోటోలు… (అందులోనూ సైజుల్లో తేడాలు ఉంటయ్…) వీలయితే జిల్లా మంత్రుల ఫోటోలు… కొందరు కాంగ్రెస్ లీడర్లయితే నెహ్రూ దగ్గర నుంచి ఆ ఏరియా కాంగ్రెస్ కౌన్సిలర్ ఫోటోల దాకా కవర్ చేస్తారు… బీజేపీ వాళ్లయితే బండి, కిషన్‌రెడ్డి, మోడీ, నడ్డా, అమిత్ షా, వీలయితే సావర్కర్, ముఖర్జీ ఫోటోలు కూడా వేయాలి… సినిమా ఫంక్షన్ల సంగతి చెప్పనక్కర్లేదు… అవి మరీ జోకుడు జోకు యవ్వారాలు… అంతెందుకు..? అప్పట్లో ఎన్.శంకర్ జైబోలో తెలంగాణ సినిమా తీశాడు, తెలంగాణ ఉద్యమం కోసం ఉన్న పార్టీలు, సంఘాలు, గ్రూపులన్నీ కవర్ చేయలేక నానా తంటాలూ పడ్డాడు… దిశ అనే డిజిటల్ పత్రికలో ఫస్ట్ పేజీలో ఓ వార్త చదివాక ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి, నవ్వొచ్చింది…
మొన్న డిస్కవరీ చానెల్ వాడు ‘‘లిఫ్టింగ్ రివర్’’ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పెషల్ స్టోరీ ఏదో ప్రసారం చేశాడు కదా… తొక్కలో తెలుగు మీడియా… ఈ టీవీలు, ఈ పత్రికల వాళ్లకు రాయడం రాదు, బొంబాట్ చేసి చూపించే తెలివీ లేదు… పైగా డిస్కవరీ అంటే మామూలు విషయమా..? హబ్బో, హది హెంత పేద్ద షర్టిఫికెట్టో తెలుసా..? అన్నట్టుగా… అందరూ చూడండి, చూసి తరించండి అన్నట్టుగా… టీఆర్ఎస్ వర్గాలు, ప్రభుత్వవర్గాలు కూడా మస్తు ప్రచారం చేసిపెట్టాయి… చిత్రమేమిటంటే..? అబ్బో, డిస్కవరీలో ఈ స్టోరీ వచ్చింది తెలుసా అన్నట్టుగా… తెలుగు మీడియా మొత్తం ‘‘కాళేశ్వరం డిస్కవరీ’’ స్టోరీ ప్రసారం కావడాన్ని మెచ్చుకుని మేకతోలు కప్పేశాయి… ఒరే నాయనా, మీలాగే డిస్కవరీ కూడా ఆఫ్టరాల్ ఓ మీడియా ప్లాట్‌ఫారం… మీరెంతో, వాడంతే… వాడు ఏదో త్రీగార్జెస్ రేంజులో ఓ స్టోరీ చేస్తే, మీ నరాలు ఉత్తేజం పొందడమేమిట్రా నాయనా..? ఈ అమిత తృప్తి ఏమిటో, ఈ భావప్రాప్తి ఏమిటో అర్థం కాదు… టీవీ9 వంటి పింకెస్ట్ చానెల్ అయితే ఇతర భాషల్లో కూడా ఈ ఆనందాన్ని అనుభవించి, అనువదించి, పులకరించిపోయింది…
Ads
సరే, విషయానికి వద్దాం… తీరా స్టోరీ ప్రసారం అయ్యాక చూస్తే… అదంతా మేఘా వాళ్ల సొంత డబ్బా… ప్రభుత్వ గొప్పతనం, ప్రభుత్వ ఇంజనీర్ల ఘెప్ప విజ్ఙానం హైలైట్ కాలేదని ప్రభుత్వవర్గాలకు కోపం వచ్చిందట… సీఎం కేసీయార్‌కు కూడా గుస్సా తన్నుకొచ్చిందట… ఇదీ వార్త… ఔను మరి… స్థూలంగా చూస్తే నిజమే కదా అనిపిస్తుంది… కానీ… ఇదేమైనా ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్టోరీయా..? కాదు కదా..! మేఘా వాళ్లు ఆ డిస్కవరీలో ఎవరినో పట్టుకుని, ఆ రేటు మాట్లాడుకుని, ఏవో తిప్పలు పడి, వాళ్ల ప్రమోషన్ కోసం ఓ స్టోరీ చేయించుకున్నారు… అది వాళ్లిష్టం… వాళ్ల గురించి కాకపోతే వేరేవాళ్ల డప్పులు కొట్టడానికా..? కాళేశ్వరం కోసం పనులు చేసే ఇంజనీర్లు, సర్కారును, చిన్న చిన్న ప్యాకేజీలు చేసిన ఇతర కంట్రాక్టర్లను, టిప్పర్లు సప్లయ్ చేసినవాళ్లను, మోటార్ల తయారీ సంస్థను… ఇలా అందరినీ సంతృప్తిపరిచేలా, అందరినీ భేష్ అని మెచ్చుకునేలా ఆ స్టోరీ ఉండాలా..? ఐనా ఒక మీడియా స్టోరీ ఇలాగే ఉండాలి అని నిర్దేశించడానికి వీళ్లంతా ఎవరు..? లేక మీడియా కవరేజీకి కూడా కొత్తగా రూల్స్ పెడతారా..? హహహ… అయితే ఇప్పుడు ఏంటట… అది మేఘా వాళ్ల కీర్తనే… నయా అంబానీ, నయా ఆదానీలుగా ఎదుగుతున్న మేఘా కృష్ణారెడ్డికి భజనే… సో వాట్…? వాళ్ల ఖర్చు, వాళ్లిష్టం… ప్రభుత్వానికి అంత అసహనం కలిగితే… ప్రయత్నించి ఈసారి ‘‘నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్’’ వాడిని పట్టండి… బిల్లు సరేసరి, అదీ మేఘాతోనే ఇప్పిద్దాం… అందులో అందరి డప్పులూ కొట్టిద్దాం… ఏమంటారు..?! ఎవరినీ వదలొద్దు… ఇలా… మచ్చుకు…
Share this Article