నా పేరు కపిలవాయి రవీందర్.
నాకు ఇద్దరు కుమారులు.
పెద్దబాబు B.Tech. చిన్నబాబు MBA..
..
పెద్దబాబును Group-1 అధికారిగా చూడాలని నా కోరిక.. అయితే ఈ నోటిఫికేషన్ కోసం 9 ఏళ్లు ఎదురు చూశాము.
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో చివరి సారిగా 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది.
2014 ల తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఇగ మా రాష్ట్రం మాకు వచ్చింది, మాకు ఇంకేం కావాలి అనుకున్నా. అప్పటి నుండే మా బాబును గ్రూప్-1కు ప్రిపేర్ చేయిస్తున్నా.
కొత్త రాష్ట్రం కదా.. రెండు మూడు సంవత్సరాల తరువాత అయినా నోటిఫికేషన్ వస్తదిలే అనుకున్నా.
తొమ్మిది సంవత్సరాలైంది..రాలేదు..
చివరకు గత సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చిన్రు.
లక్షలాదిమంది నిరుద్యోగుల తల్లిదండ్రులు, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రేయింబవళ్ళు కష్టపడి చదివించి ప్రయోజకులుగా తీర్చుదామనుకుంటే,
మన తెలంగాణలో సైతం తొమ్మిదేండ్లు నిరీక్షించక తప్పలేదు.
నోటిఫికేషన్ వచ్చింది…
సరే, ఆలస్యమే అయినా మన తెలంగాణ కోసం అన్నీ భరించినట్టు ఇది కూడా భరించాను.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష మొదటి సారి జరిగింది. పేపర్ లీకైంది. కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చి పరీక్ష రద్దు చేశిన్రు. మన తెలంగాణ కోసం అన్నీ భరిస్తున్నట్టే.. మల్లొక్కసారి భరిద్దామని నాకు నేనే సమాధానం చెప్పుకున్నా. అంతకు మించి చేసేదేం లేదు గద..
Ads
అప్పటికీ మా బాబు అంటనే ఉన్నడు.
నాన్నా ఇవి జరగవు. జరిగినా మనకు వస్తయని నమ్మకం లేదు అని.. అసలే అవినీతి ఆరోపణలు గదా. అందుకే వాడు మనకు రావనే దానికి ఫిక్స్ అయిపోయిండు. మా బాబుతో రెండో ప్రిలిమ్స్ పరీక్షకు సిద్దం చేసి రాయించిన.
బయోమెట్రిక్ విధానం లేదు నాన్నా. ఇది కూడ రద్దు అవుతదేమో అని వాడు పరీక్ష రాసి వచ్చిన నాడే చెప్పిండు. అన్నట్టే, నోటిఫికేషన్‌ల ఉన్న నిబంధనలు పాటించలేదని కోర్టు పరీక్షను రద్దు చేసింది.
నిబంధనలు పాటించకపోతే రద్దు చేస్తరని సర్కార్‌కు తెలవదా? తెలిసీ ఈ తప్పు చెయ్యటంల అర్థమేంది?
తప్పు జరగాలె.. పరీక్ష జరగొద్దనేదే ప్రభుత్వ ఉద్దేశం అనుకోవాల్నా!
టీఎస్‌పీఎస్సీని కోర్టు తప్పు పట్టింది. అయినా మన సర్కార్ వాళ్లను తియ్యదు.మార్చదు..
తెలంగాణ రాకముందు అన్నీ భరించినం.
ఆ కష్టాలు, నష్టాలు ఇగ వద్దనే తెలంగాణ తెచ్చుకుంటిమి. తెలంగాణ వచ్చినంకా కూడా భరిస్తున్నాం. ఇంకెంత కాలం భరించాలె?
నలుగురైదుగురి కోసం ఇన్ని కష్టాలు భరించాల్నా?
నాకు ఖర్చు రెండు లక్షల రూపాయల పైననే ఖర్చైంది. మల్లొకసారి పరీక్ష అంటే ఇంకో లక్ష అయితయ్. ఇగ కూలీనాలీ చేసుకునెటోల్ల పరిస్థితి ఏంది?
అప్పులకు తెచ్చి చదివిచ్చిన తల్లిదండ్రుల బాధ ఎవడింటడు? వాళ్ల ఆశలమీద నీళ్లు జల్లిరి.
వాళ్లను ఊహల మేడల మీదికెల్లి కిందికి పడేస్తిరి.
పుస్తెలమ్మి, ఉన్న భూములమ్మి, కష్టపడ్డ ఆ తల్లిదండ్రుల శ్రమ, వృధా అయిపాయె. వాళ్ల కన్నీళ్ళు ఎవరు తుడవాలె?
ఎందుకు సరిగ్గా పరీక్ష నిర్వహించరు అని ఎవరిని అడగాలె? ఎందుకు రద్దు చేసిన్రని ఎవరిని అడగాలె?
అడిగితె లాఠీలు ఇరుగుతయ్..కేసులైతయ్ గద!
మల్ల పరీక్ష పెట్టే టైంకు ఎన్నికలొస్తే ఇక ఇంతే సంగతులు. ఎన్నికలైనంక గిదే సర్కార్ వస్తే, మళ్ళ ఎన్నికల వరకూ ఉద్యోగాల ఊసే ఉండదు.
అందుకే పదేండ్లకొకసారి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, సక్కగ జరపలేని గీ సర్కార్ మనకు అవసరమా? ఆలోచించండి…
ఇది ఒక బిజెపి కార్యకర్తగా కాదు..
సగటు తండ్రిగా నా ఆవేదన…
కపిలవాయి రవీందర్..
Share this Article