ఒక వార్త వైరల్ అవుతోంది… జిమ్ చేస్తూ ఆమధ్య కన్నడిగుల ఆరాధ్య కథానాయకుడు పునీత్ రాజకుమార్ కుప్పకూలిపోయాడు కదా… దానికి కోవిషీల్డ్ వేక్సినే కారణమనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బాగా… కష్టం, తను నిజంగానే కోవిషీల్డ్ వేసుకున్నాడా..? ఆ వేక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కారణంగానే రక్తం హఠాత్తుగా గడ్డకట్టి గుండెపోటుకు గురయ్యాడా..? లేక తనకు ఆల్రెడీ గుండెకు సంబంధించిన సమస్యలున్నాయా..? ఇలాంటి అస్సలు తేలవు…
కానీ ఇలాంటి సెలబ్రిటీల మరణం మీద ఇలాంటి పోస్టులు వైరల్ కావడంతో ఓ మంచి జరుగుతుంది… సదరు వేక్సిన్ దుష్ప్రభావాల మీద జనంలో డిస్కషన్ జరుగుతుంది… అఫ్‌కోర్స్, మన మొద్దు ప్రభుత్వ యంత్రాంగాలకు వీసమెత్తు చురుకు కూడా పుట్టదు, అది వేరే సంగతి… నిజానికి కరోనా వేక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నవే… ఎస్, గుండెపోట్లు పెరగడానికి, మరీ చిన్న వయస్సులో కుప్పకూలిపోతున్న ఉదాహరణలకు అదొక్కటే కారణం కాకపోవచ్చు… కానీ..?
Thrombosis with Thrombocytopenia Syndrome (TTS) గా పిలిచే సైడ్ ఎఫెక్ట్‌ను సాక్షాత్తూ కోవిషీల్డ్ వేక్సిన్ తయారీదారు ఆస్ట్రాజెనెకా అంగీకరించింది… ఇది ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఇండియాలో పెద్ద చర్చకు దారితీసింది… దాదాపు 175 కోట్ల డోసులు వేశారు అది… బ్రిటిష్ ఉత్పత్తి వేక్సిన్‌ను మన పూణె బేస్డ్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసి పంపిణీ చేసింది… దానికి దీటుగా మార్కెట్‌లో హైదరాబాదీ ఉత్పత్తి కోవాక్సిన్ రాజ్యమేలింది… కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి అధికారికంగా… మరి కోవాక్సిన్..?
Ads
సరే, యుద్ధప్రాతిపదికన ఓ వరల్డ్ మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి వేక్సిన్ల ప్రయోగఫలితాలు పూర్తిగా తేలకముందే పర్మిషన్లు ఇచ్చేసి కోట్ల డోసులు గుచ్చేశారు… అది అప్పుడు అత్యవసరం… ఆ అవసరం తీరాక కనీసం ప్రయోగ ఫలితాలను పూర్తిచేశారా..? సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంకేమైనా కార్యాచరణ ఉందా..? ప్రభుత్వమైనా ఒత్తిడి తీసుకొచ్చిందా..? అదేమీ లేదు… వేల కోట్లు కుమ్మేశారు, జనాన్ని వాళ్ల ఖర్మకు వదిలేశారు…
ఐతే కోవిషీల్డ్ ఒరిజినల్ కంపెనీ మీద ఇండియన్ కస్టమర్లు లీగల్ ఫైట్ చేయగలరా..? కష్టం..! అనేక అడ్డంకులుంటయ్… పైగా సరిగ్గా వేక్సిన్ కారణంగానే గుండెపోట్లు అనే అంశాన్ని నిరూపించడం కష్టం… ఎందుకంటే..? రక్తం గడ్డకట్టడం, ఇమ్యూన్ సమస్యలు ఉన్న పేషెంట్లకు ఇది సూటబుల్ కాదు అనే డిస్‌క్లెయిమర్ వేక్సిన్ మొదట్లోనే పబ్లిష్ చేసిందనీ, ప్రతి వయల్ మీద ఉందని చెబుతున్నారు… (సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాముల మీద డిస్‌క్లెయిమర్లు ఉన్నట్టుగా కావచ్చు…)
ఇదంతా సరే, మరి రెండేసి డోసులు వేసుకున్నాం, కొందరు బూస్టర్ డోసులు, నాలుగైదు వేసుకున్నారు… మరీకొందరైతే భయం కొద్దీ పది దాకా వేర్వేరు ఫోన్ నంబర్లతో వేయించుకున్న సంఘటనలూ ఉన్నాయి… మరి వాళ్ల పరిస్థితేమిటనే ఆందోళన నిజంగానే ప్రజానీకంలో మొదలైంది… నో, నో, వేక్సిన్లు వేసుకున్న కొన్నాళ్లే ఆ సైడ్ ఎఫెక్ట్స్, మరీ కొందరిలోనే ఉంటాయనీ, ఇప్పుడు ఆ భయం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు…
The Government committee on Adverse Events Following Immunisation (AEFI) 2021లో 18 మరణాలను, మొత్తం 36 కేసుల టీటీఎస్ లక్షణాలను ఖరారు చేసిందట… అది అక్కడ, మరి ఇక్కడ..? ఇక్కడంతా లెక్కలేనితనమే కాబట్టి… పరిహారాలు ఆశించడం, అంతకుమించి మరణాలకు వేక్సిన్‌ను ఫిక్స్ చేయడం కష్టం…
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్, కోవిడ్ మీద WHO సేఫ్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యురాలు గగన్‌దీప్ కాంగ్ ‘‘వేక్సినేషన్ తరువాత కొన్నాళ్లూ ఆ రిస్క్, ఇప్పుడేమీ ఉండదు’ అని తేల్చేస్తోంది… 2022 లాన్సెట్ గ్లోబల్ హెల్త్ స్టడీ ప్రకారం ఆస్ట్రా జెనెక్ వేసుకున్న పది లక్షల మందిలో మొదటి డోస్‌కు 8.1 టీటీఎస్ కేసులు, సెకండ్ డోసుకు 2.3 కేసులు నమోదయ్యాయట…
ఇవన్నీ సరే, ఇప్పుడు వేక్సిన్ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు… నిజం చెప్పాలంటే అవసరం లేదు… ఇండియన్ జనాభాలో ఈ వైరస్‌కు ఇమ్యూనిటీ వచ్చేసింది… మరీ ఇమ్యూనిటీ సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి తప్ప వేరేవాళ్లకు భయం లేదట..!!
Share this Article