నాని అంటే..? నటన..! అంతకుమించిన నిర్వచనమేమీ ఉండదు… అతిశయోక్తి కాదు, మనకున్న హీరోల్లో అన్నిరకాల ఉద్వేగాల్ని బలంగా ప్రదర్శించగల సత్తా ఉన్నవాడు… నేను నిజంగా మొండివాడినా, అలా కనిపిస్తున్నానా, ఏ బంధాలూ తెలియనివాడిలా ఉంటానా అంటూ హీరోయిన్ ఎదుట హీరో మథనపడే ఓ బరువైన సన్నివేశం ఒక్కటి చాలు, నాని ఏమిటో చెప్పడానికి… అలాంటివి చాలా ఉన్నయ్ టక్ జగదీష్ సినిమాలో… సరైన పాత్ర పడాలే గానీ నాని అంటే నానీ అంతే… చెలరేగిపోతాడు… ఈ సినిమాకు బలం తనే… కేవలం తను మాత్రమే… ముందుగా ఒక విషయం చెప్పుకుని రివ్యూలోకి వెళ్లిపోదాం… థియేటర్ల ఓనర్లు ఢాంఢూండుస్సు అని ఈ సినిమా నిర్మాతల మీద, నాని మీద ధుమధుమలాడారు కదా ఈమధ్య, రచ్చ జరిగింది కదా కేవలం ఓటీటీలో విడుదల చేయడం మీద… నిజానికి వాళ్లేమీ నష్టపోలేదు..!! థియేటర్లలో విడుదల చేస్తే ఆరిపోయేవాళ్లు..!! ఎందుకంటే….?
పాత తెలుగు సినిమాలు ఉండేవి… కుటుంబబంధాలు, రక్తసంబంధం, అన్నాదమ్ముల అనురాగం, కుటుంబగౌరవం, పరువుప్రతిష్ట ఇలా రకరకాల పేర్లతో వచ్చేవి… పెద్ద ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి ఆస్తులు, అపోహలు, కుట్రలు, అబద్దాలు, కన్నీళ్లు, కలహాలు, కలతలు, అపార్థాలు… తరువాత హీరో పాత్రధారి త్యాగగుణం, మంచితనం, అనురాగం, ఆప్యాయత, ఎనలేని చాతుర్యంతో మళ్లీ అందరూ కలిసి ఆనందబాష్పాలు రాలుస్తారు చివరలో… కొందరు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు, ఒకటీరెండు పాత్రలు బాధితులుగా మిగిలిపోతాయి… మధ్యలో విలన్లు, డిష్యూం డిష్యూం, హీరోయిన్‌తో ప్రేమాయణం, డ్యూయెట్లు ఎలాగూ తప్పవు కదా… అలాగే అక్కడక్కడా అవసరార్థం, హీరో అనే మర్యాద కోసం ఒకటీరెండు ఫైట్లు… సేమ్, టక్ జగదీష్ ఆ ఫార్ములాకు కాస్త అటూ వెళ్లలేదు, ఇటూ వెళ్లలేదు… ఆ లైన్ తప్పలేదు… ఏ పాత ఎన్టీయారో, ఏఎన్నారో, ఎస్వీఆరో నటించిన జీవనతరంగాలు వంటి సినిమా చూస్తున్నట్టుగానే అనిపించింది… అయితే అది ఈతరం ప్రేక్షకులకు నచ్చుతుందా..? కష్టం… చాలా కష్టం…
Ads
సినిమా ఒక కోణంలో బాగుంది… ఎక్కడా కావాలని మితిమీరిన హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేయలేదు, వి సినిమా చూసినప్పుడు నాని కూడా ఇలా దిగజారిపోయాడేం అనిపించింది… నానిని కమర్షియల్ హీరోగా చూడటంకన్నా బరువైన పాత్రల్లో నానిగా చూడటమే బాగుంటుంది… తన గొంతులోని మార్దవం, ఆర్ద్రత కొన్ని ఎమోషనల్ సీన్లలో నానికి అదనపు బలం… టక్ జగదీష్‌లో కమర్షియల్ వేషాలు ఏమీ లేవు… కామెడీ వికారాల్లేవు… అశ్లీలత లేదు… హాట్ హాట్ సీన్ల వెంపర్లాట లేదు… మరేముంది..? నిజానికి ఏమీలేదు… ఆ కథనం నీరసంగా సాగుతూ ఉంటుంది… ఈతరం ప్రేక్షకులు కోరుకునే సూపర్ ట్విస్టులు, వేగం ఉండవ్… ఒక ప్లెయిన్ అండ్ నీట్ సంసారపక్షం సినిమా…
కొన్ని అంశాల్ని చెప్పుకోవాలి…
- జగపతిబాబులో కొంత సాత్వికం, కొంత విలనీ కలగలిపి కొత్తకొత్తగా ఉంది… తన నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ప్రత్యేకం లేదు… పాత సినిమాల్లో సత్యనారాయణ వేసేవాడు ఇలాంటి పాత్రల్ని…
- సినిమాలో రావు రమేష్ ఉన్నాడు, సీనియర్ నరేష్ ఉన్నాడు… ఈమధ్య నరేష్ ఏ పాత్ర ఇచ్చినా ఇరగేస్తున్నాడు, రావు రమేష్ సరేసరి… కానీ వాళ్లను వాడుకున్నదే లేదు… దారుణం… ఇద్దరికీ మహాఅయితే ఆరేడు సీన్లు ఉంటాయేమో… కొంతలోకొంత రేవతి నయం…
- ఘోరం ఏమిటంటే..? ఐశ్వర్యా రాజేష్‌ను చూడగానే సెకండ్ హీరోయిన్ అనుకుంటాం… ఆమెను బకరీని చేసేసి, చివరకు ఓ కేరక్టర్ ఆర్టిస్ట్‌గా మార్చేశారు… కాకపోతే కాస్త కథాపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్ర… ఆమెను చూస్తే జాలేసింది…
- రీతూ వర్మ అందంగా ఉంది… ఆమె పాత్రకు పెద్దగా నటనను పండించే స్కోప్ లేదు… దానికి ఆమె మాత్రం ఏం చేయగలదు..?
- విలన్, వాడి తమ్ముడు పర్లేదు, బాగానే చేశారు… అయితే హీరో మీద, హీరో కుటుంబం మీద కోపమొచ్చినప్పుడల్లా తన ఇంట్లో ఉన్న ఆడవాళ్లను చితకబాదే పాత సినిమాల తరహా సీన్లు చూస్తుంటే నవ్వొచ్చింది… దర్శకుడు విలన్ల పాత్రల్ని సరిగ్గా కేరక్టరైజ్ చేయలేదు…
- టక్ జగదీష్ అంటే ఏమీలేదు, ఎప్పుడూ ఇన్‌షర్ట్‌నే ఇష్టపడేవాడు… టక్ జోలికొస్తే తాటతీస్తాడు… అంతే… నాని నటనను ప్రేమించేవాళ్లు సినిమాను చూడొచ్చు, పాత తెలుగు సినిమా కథల్లాంటి కుటుంబబంధాల కథల్ని ఇష్టపడే పక్షంలో సినిమాను చూడొచ్చు, ఇప్పుడొస్తున్న సినిమాల తీరు తెలుసు కదా… ఇది భిన్నం… ముందే చెప్పుకున్నాం కదా… ప్లెయిన్ అండ్ క్లీన్…!!
- అన్నట్టు దర్శకుడు శివ నిర్వాణ గారూ… ఓ కుటుంబంలో కలతల్ని చెరిపేయడానికి ఎమ్మార్వో ఆ ఇంటికి నాన్-వెజ్ భోెజనానికి వెళ్లినప్పుడు, చొక్కా నుంచి ఓ వేటకత్తిని తీయడం, ఆ తరువాత ఏవో నీతులు చెప్పడం, చివరకు ఒక ఉల్లిగడ్డను నరకడం, అందరూ కన్నీళ్లు పెట్టుకుని కలిసిపోవడం గట్రా మరీ మరీ సినిమాటిక్‌గా ఉంది… మరి ఇది కూడా సినిమాయే కదా అంటారా..? అవున్లెండి… ఇంటి మీద ఎర్ర లైటు, వెలిగిస్తే వస్తాననే హామీ కూడా అలాగే తిక్కతిక్కగా ఉందిలెండి…!!
- పాటలు సోసో… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసో… పాటలు బాగా పడి ఉంటే, పండి ఉంటే… కథనంలో స్పీడ్ ఉండి ఉంటే… రెండుగంటల 20 నిమిషాలు అవసరం లేదు, రెండు గంటల్లో ముగించేసి ఉంటే… కాస్త కథలో నవ్యత ఉండి ఉంటే… సినిమా ఇంకాస్త ఇంట్రస్టింగుగా కళకళలాడేది…
- మరో ప్రశ్న… సినిమా మొత్తం చూశాక… ఎవరు ఎవరికి ఏమవుతారో, ఎవరు ఎవరిని చంపారో చెప్పగలరా అంటూ ఓ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తరహా క్విజ్ పెడితే బెటరేమో… నాకు తెలిసి ఒక్క ప్రేక్షకుడు కూడా పాస్ కాడు… పాపం శమించుగాక… దర్శకుడు, హీరో, నిర్మాత, హీరోయిన్ కూడా పాస్ కారు…!!
Share this Article