పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మళ్లీ టీవీ9 అగ్రస్థానానికి ఎగబాకిందనీ, రేటింగ్స్‌లో ఎన్టీవీని వెనక్కి నెట్టేసిందనే సమాచారం పెద్దగా విస్మయకరం ఏమీ కాదు… టీవీ9 ఆఫీసు ఎదుట సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారనే మిత్రులు సందేశాలు కూడా అందుకే ఆశ్చర్యం అనిపించలేదు… అసలు టీవీ9 చానెల్‌ను దాటేసి ఎన్టీవీ కొన్నాళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలబడటమే ఆశ్చర్యకరం… అది తాత్కాలిక సంబరమే అయిపోయి, తిరిగి టీవీ9 తన ఫస్ట్ ప్లేస్‌ను మళ్లీ కొట్టేసింది…
భారీ వసూళ్లు సాధించిన సినిమా మంచి సినిమా కాకపోవచ్చు… భారీగా రేటింగ్స్ సాధించినంత మాత్రాన టీవీ9 మంచి చానెల్ అయి ఉండాలనేమీ లేదు… కాకపోతే తిట్టుకుంటూనో, మెచ్చుకుంటూనో ప్రజలు టీవీ9 చూస్తారు, అలా అలవాటు పడ్డారు… చెత్త సెన్సేషనలిజం, కీలక స్థానాల్లో ఉన్నవాళ్ల అర్థజ్ఙానం, వెర్రిమొర్రి ప్రయోగాల వల్ల చాలామంది దాన్ని తిట్టుకుంటారు… కానీ చూడకుండా ఉండరు… అదే స్ట్రెయిట్, ప్లెయిన్ కవరేజీని నమ్ముకున్న ఎన్టీవీ తాత్కాలికంగా ఫస్ట్ ప్లేసులోకి వెళ్లినా చాన్నాళ్లు దాన్ని నిలబెట్టుకోలేకపోయింది…
బేసిక్‌గా రెండు చానెళ్ల యాజమాన్యాలకు మంచి దోస్తీ… ఇంకా ఏమేం సంబంధాలున్నాయో తెలియదు గానీ… మౌలికంగా రెండూ ఒకటే… కాకపోతే టీవీ9 ఓవరాక్షన్… అప్పుడప్పుడూ మరీ బాలయ్య సినిమాలా అనిపిస్తుంటుంది… ఎన్టీవీ ప్లెయిన్ ప్రయాణం… మెరుపులు ఉండవు… ఐనా ఫస్ట్ ప్లేసుకు ఎలా రాగలిగింది..? అవును, ఆ మర్మమేమిటో ఎవరైనా పీహెచ్‌డీ చేస్తే బాగుండు…
Ads
ఇదీ తాజా బార్క్ రేటింగ్స్ స్థితి… మరీ 12 వ వారంలో ఎన్టీవీతో పోలిస్తే టీవీ9 రేటింగ్స్ దారుణంగా ఉన్నయ్… మెల్లిమెల్లిగా ఎగబాకి, ఎలాగైతేనేం ఎన్టీవీని కిందకు లాగింది… రెండు చానెళ్ల నడుమ పోటీ ఇప్పట్లో ఏమీ ఆగదు… అసలు బార్క్ రేటింగ్స్‌ను మేనేజ్ చేయడం పెద్ద టాస్క్… రాబోయే రోజుల్లో ఈ పోటీ ఇంకెంత రసకందాయంలో పడుతుందో చూడాలి…
మరి మిగతా చానెళ్ల మాటేమిటి అంటారా..? పెద్దగా పాత్రికేయ విలువల కోణంలో రంగు, రుచి, వాసన, చిక్కదనం వంటి ఏ ప్లస్ పాయింట్లూ లేకపోయినా టీవీ5 మూడో స్థానంలో ఎలా కొనసాగుతుందనేది అసలైన ఆశ్చర్యాంశం… బార్క్ రేటింగ్స్ కదా, ఏదైనా జరగొచ్చు అంటారా..? అవును, అదీ నిజమే… నాలుగో స్థానంలో ఉన్న వీ6 చానెల్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒకే ఒక అడుగు దూరంలో నిలబడి ఉంది… వీ6 ప్రస్తుత స్థితి రీత్యా ఏబీఎన్ నాలుగో స్థానానికి రావడం వీజీయే అనిపిస్తోంది…
ఎహె, ఏబీఎన్‌లో ఏముందండీ అనడక్కండి… ఏం..? టీవీ5 మూడో ప్లేసులో ఉండగా లేనిది ఏబీఎన్ నాలుగో ప్లేసుకు వస్తే అందులో వింతపడాల్సింది ఏముంది..? పత్రికల్లో ధూంధాం అని చెప్పుకునే ఈనాడు, సాక్షిల చానెళ్లు మాత్రం 7, 8 ప్లేసులు దాటడం లేదు ఫాఫం… ఇక వాటికి దిగువన, అంటే మరీ 10 రేటింగ్స్ దిగువన ఉన్న చానెళ్ల గురించి చెప్పుకోవడం ఎందుకులే గానీ… ఆమధ్య కొన్నాళ్లు ఇరగదీసిన టీన్యూస్ మళ్లీ వెనక్కిపడిపోయింది… ఇదండీ స్థూలంగా తెలుగు న్యూస్ చానెళ్ల ప్రస్తుత స్థితీ గతీ…
Share this Article