నవ్వొద్దు… రెండూ వేర్వేరు వార్తలే… సోషల్ మీడియాలోనే నిన్న ఎవరి వాల్ మీదనో చూసినట్టు గుర్తు… బ్రిటిష్ కొలంబియాలో ఒకాయన ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్నాడట… మొత్తం 150 మందిని పిల్లల్ని కన్నాడట… ‘‘వాడు మగాడ్రా బుజ్జీ’’ అనే హెడింగుతో ఎవరో రాసిన వార్త క్లిప్పింగు కనిపించింది ఫేస్బుక్లో… ఆ తండ్రికి ఈమధ్య దూరంగా… అమెరికాకు వెళ్లి బతుకుతున్న ఓ కొడుకు సోషల్ మీడియా వేదికగా ఈ నిజాన్ని వెల్లడించాడుట… అసలు ఒక భార్యతోనే వేగలేక జీవితం మీద వైరాగ్యాన్ని పెంచుకుని, వేల మంది భర్తలు చస్తూ బతుకుతున్న ఈరోజుల్లో అంతమంది పెళ్లాలను ‘టాకిల్’ చేయగలగడం అంటే… నిజంగా గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్టు… అఫ్ కోర్స్, మన మిజోరంలోనే ఒకాయన 39 మందిని రికార్డు స్థాయిలో పెళ్లిచేసుకున్నాడు కానీ… పిల్లల విషయంలో సెంచరీ సాధించలేకపోయాడు… సో, పిల్లల్ని కనే విషయంలో ఈ కొలంబియా పెద్దమనిషిదే రికార్డు అనుకోవాలి… ఇదంతా బాగానే ఉంది కానీ..?
64 ఏళ్ల వయస్సుకే ఈయన 27 మందిని పెళ్లాడాడు సరే… కానీ 150 మంది పిల్లలకు జన్మనివ్వడం మగతనానికి చిహ్నంగా పెట్టిన ‘‘మగాడ్రా బుజ్జీ’’ అనే హెడ్డింగే నవ్వొచ్చింది… (వీరిలో 22 మందికే సంతానభాగ్యం కలిగింది)… 27 మందికీ డేట్స్ అడ్జస్ట్ చేయడం, సరైన ‘‘ఫ్యామిలీ ప్లానింగు’’ కష్టమైన ప్రక్రియే… అందులోనూ భార్యల సర్దుబాటుఘనత ఉంది గానీ ఈ పెద్దమనిషి గొప్పేమీ కనిపించడం లేదు… ఐనా పిల్లల్ని కనడానికి తను పెద్దగా చేసిన కాయకష్టం ఏముంది..? మగతనానికి సరైన నిర్వచనాలు, అసలు వివరణలూ వేర్వేరు ఉన్నాయి… ఇప్పుడు, ఇక్కడ ఆ విస్తృత చర్చలోకి మనం వెళ్లబోవడం లేదు… ఇక్కడ ఓసారి సీన్ కట్ చేద్దాం… అదే మగతనం అనే చర్చ ఏదో జరుగుతోంది కదా… ఇదీ మొన్నటి వార్తే…
Ads
ఉత్తరప్రదేశ్… భోజిపూర ఏరియా… 52 ఏళ్ల రైతు… పేరు జగన్‌లాల్ యాదవ్… 1990 నుంచీ మొదలుపెట్టాడు… పది పెళ్లిళ్లు… ఆ భార్యల్లో అయిదుగురు ఒకరి తరువాత మరొకరు మరణించారు… అనారోగ్యంతో మరణించారు అని చెప్పేవాడు… అసలు కథేమిటో గ్రామస్థులకూ సరిగ్గా తెలియదు… వరుసగా అయిదుగురూ అనారోగ్యంతోనే మరణించడం ఏమిటో, ఈయన మాత్రం దుక్కలా ఉండటం ఏమిటో ఆ ఊరోళ్లకు తెలియదు… సరే, ముగ్గురు భార్యలు మాత్రం ఈయన్ని విడిచిపెట్టి చక్కా లేచిపోయారు… అంటే, వేరే మగాళ్లను చూసుకున్నారు… సారీ, మొగుళ్లను చూసుకున్నారు… బెంగాల్‌కు చెందిన ఇద్దరు భార్యలు మాత్రం ఇంకా తననే అంటిపెట్టుకుని ఉన్నారు… అకస్మాత్తుగా మొన్న ఆయన హత్యకు గురయ్యాడు… పోలీసులు వివరాల్నీ కెలికేకొద్దీ ఇవన్నీ బయటపడ్డయ్… అసలు విషయం ఏమిటంటే..? పది మందిని పెళ్లి చేసుకున్నాడు కదా… 30 ఏళ్ల నుంచీ ఇదే పని కదా… ఒక్కరికీ సంతానం కలగలేదు… ఈమధ్య తన ఆస్తిని (రోడ్డు పక్కన ఉండి, ఈమధ్య కోట్లు పలుకుతోందట తన భూమి)… తను దత్తత తీసుకున్న ఓ యువకుడిని రాసిచ్చేయడానికి ప్రయత్నించాడట… అదుగో, ఆ తగాదాల్లో తనను ఎవరో కోపమొచ్చి, పొలాల్లోకి తీసుకెళ్లి ‘ఖతం’ చేసేశారు… ఇప్పుడు చెప్పండి… మగతనాలు, మగాడ్రా బుజ్జీ అని ఏదేదో రాస్తున్నారు కదా… ఏది మగతనం..? ఇంకా నయం, ఈ వార్తకు ‘‘వీడు మగాడే కాదురా బుజ్జీ’’ అని ఎవరూ హెడింగు పెట్టలేదు, థాంక్ గాడ్… అసలు ఈ కథలో ట్విస్టు చెప్పనే లేదు కదూ… తను దత్తత తీసుకున్నది ఎవరినో తెలుసా..? ఇప్పుడు తననే అంటిపెట్టుకుని ఉంటున్న ఒక భార్యకు తన మొదటి భర్త వల్ల కలిగిన కొడుకట… వావ్…!!
Share this Article