ట్రావిస్ హెడ్… ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ భార్య జెసికాను ట్రోల్ చేస్తున్నారు… ఆమె ఏం పాపం చేసింది..? ఏమీ లేదు… ఈ బ్యాటర్ హెడ్ మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను విజేతగా చేశాడు కదా… తనకు భార్య కావడమే ఆమె తప్పు అన్నట్టుగా సోషల్ మీడియా ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు… ఎస్, సోషల్ మీడియా అంటేనే ‘ఉన్మాదపు ట్రోలింగ్’ అన్నట్టుగా మారింది కదా పరిస్థితి…
సోషల్ మీడియాలో 60, 70 శాతం ఫేక్ గాళ్లు, ఇలాంటి బుద్ది లేని ట్రోలర్లే కదా నిండిపోయింది… ఒరేయ్, ఇలా నిందించడం, నోరు పారేసుకోవడం మన కల్చర్ కాదురా బాబూ అని కొందరు సుద్దులు చెబుతున్నా, ఎహె, ఇదే మన కల్చర్ అన్నట్టుగా తిట్టేస్తున్నారు… ఆ వెధవలే మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌ను కూడా టార్గెట్ చేశారు… కానీ ఆమె ఉల్టా జవాబు చెబుతూ… హుందాగా స్పందించింది…
‘‘కాస్త క్లాస్‌గా ఉండండి… నేను పుట్టీపెరిగింది ఆస్ట్రేలియాలో… మ్యాక్స్ నా భర్త, నా బిడ్డకు తండ్రి… నేను ఆస్ట్రేలియా తరఫున తప్ప ఇంకెవరి పక్షంలో ఉండాలి..’’ అని భలే కొట్టింది… ఆసీస్ తలెత్తుకునే కోడలు… ఎస్, మ్యాక్స్ ఒక హీరో… అఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఒంటి చేత్తో డబుల్ టన్ సాధించి, కండరాలు పీడిస్తున్నా క్రీజు వదలక విజయం చేజిక్కించుకుని ఫైనల్ దాకా లాక్కెళ్లాడు జట్టును… ఎస్, హెడ్ ఒక హీరో… ఫైనల్స్‌లో ఒత్తిడిని అధిగమించి, స్టేడియంలో లక్షాముప్ఫయ్ వేల మంది ఇండియన్ ఫ్యాన్స్ ఎదురుగా… ఆ కేకలు, ఆ జోరును ఏమీ పట్టించుకోకుండా స్థిరంగా ఆడాడు…
Ads
అంతేకాదు, బాగా రాణిస్తున్న రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకుంది కూడా తనే… టపాటపా మూడు వికెట్లు పడిన స్థితిలో నిలబడి, విజేత ఇన్నింగ్స్ నిర్మించి తన జట్టు పతాకాన్ని ఎగరేశాడు… విచక్షణ ఉన్నవాడైతే హెడ్‌ను అభినందిస్తాడు… ప్రశంసిస్తాడు… కానీ మన ట్రోలర్స్‌కు ఆ ఇంగితం ఎందుకు ఉంటుంది..? తననే కాదు, తన భార్యనూ బూతుల తెర మీదకు తీసుకొచ్చేశారు… ఆ ఆటగాళ్ల భార్యలేం తప్పు చేశార్రా వెధవాయ్స్…
నిన్నటి అపజయాన్ని యాంటీ-మోడీ సెక్షన్లు కూడా చిల్లర వ్యాఖ్యలకు వాడుకున్నాయి… చివరకు మోడీ డ్రెసింగ్ రూమ్ వెళ్లి మన ఆటగాళ్లను ఓదార్చడాన్ని కూడా వెకిలి కామెంట్లతో తప్పుపడుతున్నారు… తను ఈ దేశ ప్రధాని… నాడు చంద్రయాన్ వైఫల్యం వేళ ఇస్రో చీఫ్ శివన్‌ను ఓదార్చి, దేశం యావత్తూ మీ వెంట ఉందని భరోసా ఇచ్చాడో… సేమ్, ఇండియన్ జట్టుకూ అదే ఓదార్పు… అదే భరోసా… అది అభినందించాల్సిన వైఖరి… దానికీ ట్రోలింగ్ అనేది సోషల్ మీడియా వైరస్ రోగలక్షణం…
నిన్నటి నుంచీ గమనిస్తుంటే… కపిల్ దేవ్ మాటలు హుందాగా, ఉన్నతంగా అనిపించాయి… తనను ఈ ఫైన్సల్ మ్యాచ్‌కు పిలవలేదు… తనతోపాటు 1983లో తొలి ప్రపంచ కప్ అందించిన జట్టు మొత్తాన్ని పిలవాలని ఆనాటి కెప్టెన్ కోరాడు… సరే, బాధ్యులెవరో గానీ మూర్ఖులు… కపిల్ నాడు సాధించిన ఆ కప్ పుణ్యమే నేడు ఇండియాలో క్రికెట్ ఓ మతంగా మారిపోయిన సంఘటన… వాళ్లను పిలవకపోవడం ఏమిటి అసలు..? ఐనాసరే తను ఎవరినీ పేరుపెట్టి నిందించలేదు… దీన్ని ఓ పెద్ద ఇష్యూగా కూడా చేయలేదు… రచ్చ మీడియాకు ఉపయోగపడలేదు…
ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్నకు… వాళ్లు పిలవలేదు, నేను వెళ్లలేదు అన్నాడు, అంతే… సగటు ఇండియన్ ఫ్యాన్‌గా టికెట్ కొనుక్కుని వెళ్లడం తనకు ఇష్టం లేదు… అదేసమయంలో ఇండియన్ ప్లేయర్ల మీద వస్తున్న విమర్శలకు బాధపడి… ‘‘మీరు హీరోలు, తలవంచుకోకండి, మీరు తప్పు చేయలేదు… మీ దృష్టిలో కప్పు తప్ప మరే తప్పూ లేదు… బాగా ఆడారు… ఈ దేశం మీ వెంట ఉంది… బాధపడకండి’’ అని సోషల్ మీడియా ముఖంగానే ఓదార్చాడు… గుడ్…
Share this Article