ఒక నగరంలో బాగా రద్దీగా ఉండే కూడలి. ఉదయం 9 గంటలవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ చూపించింది. ఒక వైపు వాహనాలు బారులు తీరాయి. హెల్మెట్, చేతులకు తొడుగులు వెనుక బ్యాగ్ తగిలించుకున్నవారు కొందరైతే, మెడలు పూర్తిగా పక్కకు వాల్చేసి ఫోన్లో మాట్లాడే వారు ఇంకొందరు. మిన్ను మీద విరిగి మీద పడినా మనకేం సంబంధం లేనట్లు నిరంతరం రెండు చెవుల్లో పెట్టుకుని మాట్లాడేవారు మరికొందరు.
కుటుంబ కధా చిత్రంలా దంపతులు, ముగ్గురు పిల్లలు, బట్టల బ్యాగ్ లతో భారంగా ఇంకో బండి. కొరియర్ సామగ్రితో రెండు ఆటోలు, లగ్జరీ, చిన్న పెద్ద కార్లు అనేకం. గ్యాస్ బండ్ల ఆటో, ఓలా, రాపిడో, ఉబర్ ఆటోలు, టాక్సీలు, ఐటి సిబ్బంది పూలింగ్ టాక్సీలు, స్కూల్, సిటీ బస్సులు బారులు తీరాయి. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని ఆత్రంగా ఎదురు చూసేవారు కొందరైతే, విసుగ్గా మొహాలు పెట్టేవారు ఇంకొందరు, అబ్బా సిగ్నల్ ఇప్పుడే పడాలా అని తిట్టుకునే వారు చాలా మంది. హారన్ల మోత, మొబైల్ ఫోన్ రింగ్ టోన్లు, ఆటోల గడగడ శబ్దాలు, బస్సుల్లో పిల్లల కేకలు…
Ads
నెమలి పింఛమ్తో మన నెత్తి మీద మెత్తగా తాటించి, సాంబ్రాణి పొగ వేస్తానంటాడు ఓ ఫకీరు. మనం వద్దని అటు తిరిగేలోగానే మన భుజం మీద ఎవరో తట్టినట్టు అనిపించి చూసేలోగానే రెండు చప్పట్ల శబ్దం వినబడుతుంది. బయ్యా అని నోరార పిలుస్తూ నెత్తి మీద, లేదా బుగ్గ మీద అయినా చేయి వేసి నిమరడానికి ప్రయత్నిస్తారు. వారి వేళ్ళ మధ్యలో యాభై నుంచి పది వరకు అన్ని నోట్లు మడత పెట్టి మనకు కనిపించేలా చేతులు ఊపుతుంటారు.
మనం వారి నుంచి దృష్టి మళ్లించేలోగానే బండ్ల మధ్యలోంచి దూరుతూ అయ్యా ధర్మం అంటూ ఒక యాచకుడు వస్తాడు. లేదు, లేదు ఫో అని చెప్పేలోగా, మోచేతి వరకూ చిన్న బొమ్మలు, అలంకరణ దేపాల వంటివి, వేసవి అయితే టోపీలు, ఎండ తగలకుండా ఉండే మాస్కులు, వర్షాకాలం అయితే ఇంద్ర ధనుస్సుల్లాంటి రంగుల గొడుగులు, రెయిన్ కోట్లు, పిల్లలను ఇట్టే ఆకర్షించే సబ్బు నురగ నింపి ఊదితే వచ్చే పంచరంగుల బుడగల గొట్టాలు, బూరల భుజానికి తగిలించుకుని ఏ దేఖియే.. అంటూ ఇద్దరు ముగ్గురు ఉత్తరాది మహిళలు, కుర్రాళ్ళు మనల్ని అభ్యర్దిస్తారు…ఏదో ఒక బొమ్మ తీసుకోమని బతిమాలతారు.. బేరం, గిరాకీ ముఖ్యం కానీ భాష ఎంత మాత్రం కాదంటారు.
వంద, రెండు వందల దగ్గర మొదలుపెట్టి యాభై, అంత కన్నా తక్కువకు కూడా ఇచ్చేస్తుంటారు. వీరంతా చేతి వృత్తుల కళాకారులు. మరికొందరు టోకున తెచ్చుకుని ఇలా అమ్మి పొట్ట పోసుకునే వారు. నిజంగా వీరందర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. వాహన చోదకులు చిరాకు పడినా, పొమ్మన్నా, అసహనం వ్యక్తం చేసినా మారు మాటాడకుండా ముందుకు సాగిపోతారు. ఇక్కడే మనకు ఇంకోవైపు కారు అద్దాల మీద బ్రష్ ఆడిస్తూ, వాటిని కొనమని చేతులతో సైగ చేస్తుంటాడు ఇంకో కుర్రాడు. మరో వైపు రంగురంగుల శాటిన్ వస్త్రాలు ఊపుతూ కావాలా బాబూజీ అని ఇంకొకరు అడుగుతుంటారు. వేరుశనక్కాయలు (పల్లీలు), మొక్కజొన్న పొత్తులు, (సీజన్ ను బట్టి) ఇతర తినుబండారాలు ఒక సంచిలో వేసుకుని, రెండు చేతులతో పట్టుకుని ఇంకో మధ్య వయస్కుడు ఊరిస్తుంటాడు.
గరిష్టంగా 120 సెకన్ల సమయాన్ని టివీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల సమయం కన్నా బాగా సద్వినియోగం చేసుకుంటారు. సహజంగానే వీళ్ళంతా సిగ్నల్ ఎక్కువ సేపు ఉండాలని కోరుకుంటారు. కచ్చితంగా నిర్దారిత వేళలు పాటిస్తారు. భోజన విరామ సమయాలు కూడా తీసుకుంటారు.
అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతున్నా మనకు పది రూపాయలకు ఒక చాయ్ అన్నా దొరుకుతోంది. ఇవాళ రేపు మనం ధర్మం చేయాలనుకున్నా పది రూపాయల కన్నా తక్కువ నోటు మన పర్స్ లోను, జేబులోను ఉండదు. అందువల్ల ఒక పది నోటు తీసి వాడికి ఇచ్చి వెళ్లిపోతాము. ఒక రోజులో ఇలాంటి సిగ్నల్ దగ్గర ఒక యాచకుడి సంపాదన ఎంతో తెలుసా అక్షరాల ఐదు వందల రూపాయలు.
(ఇటీవల ముంబైలో ఓ బిచ్చగాడి వద్ద రూ. 70 లక్షలకు పైగా సొమ్ము దొరికిన సంగతి మనకు తెలిసిందే. అతని ఆస్తి రెంరు కోట్లకు పై మాటే అని. పిల్లలలు ఉన్నత విద్యావంతులని తెలిసింది. ). బొమ్మలు అమ్మేవాళ్ళు ఎలా లేదన్నా పది బొమ్మలు అమ్ముతారట. ఈ లెక్కన మూడో తరం వాళ్ళ ఆర్జన ఊహించుకోండి.
(ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. పదో తరగతి పరిక్షలు రాసి ఇంటికి సెలవులకు వచ్చిన ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ దంపతుల కొడుకు రెండు రోజులుగా ఇంటికి రాలేదు. ఫ్రండ్స్ ఇళ్ళలో వాకబు చేశారు. తర్వాత ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. తీరా ఫోన్ స్టేటస్ చూస్తే వాళ్ళతో దిగిన ఫొటో కనపడింది. వీళ్లు ఎక్కడ ఉంటారా అని ఆరా తీసి, వెళ్తే వాళ్ళు ఈ పిల్లవాడి జేబులో ఒక వెయ్యి రూపాయలు పెట్టి తల్లిదండ్రులతో పంపారు…) [ — హరగోపాలరాజు ]
Share this Article