Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముఖ్యమంత్రి సాయిచరణ్‌ను ఇంటికి పిలిపించుకుని అభినందించారు

May 1, 2024 by M S R

గురుదక్షిణ… ఒక బాలుడి సాహసగాథ… ఎన్నికల ప్రచార చిటికెల పందిళ్లలో నవీన ప్రజాస్వామ్య సమసమాజ సూత్రాల పేరుతో పట్టపగలు మంగళసూత్రాలు దోచుకెళతారనే సిద్ధాంతాల రాద్ధాంతాల మధ్య…

ప్రజల మౌలిక అవసరాలు, అభివృద్ధి చర్చ పక్కకు పోయి…కూడు పెట్టని ఇతరేతర అప్రధాన విషయాలు అత్యంత ప్రధానమైన వేళ…

ఇప్పుడున్నవారే మళ్లీ గెలవకపోతే దేశం దిక్కులేని అక్కుపక్షి అవుతుందని ఒకరు; ఇప్పుడున్నవారే గెలిస్తే ఉన్నవారే మరింత ఉన్నవారు కావడంవల్ల దేశమంతా లేనివారితో నిండిపోతుందని మరొకరు వాదించుకునేవేళ…

Ads

రెండు వార్తలు చిన్నవే అయినా చాలా పెద్దవై మనసంతా నిండేలా ఉన్నాయి. మనుషుల్లో మానవత్వపు విలువలు ఇంకా మిగిలి ఉన్నాయని తెలిపేలా ఉన్నాయి. ఒకటి- రంగారెడ్డి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో పదో తరగతి విద్యార్థి ప్రాణాలకు తెగించి ఐదుగురి ప్రాణాలను రక్షించడం; రెండు- చదువు చెప్పిన టీచర్ పదవీ విరమణ వేళ విద్యార్థులందరూ కలిసి ఆ టీచర్ కు కారును బహూకరించడం.

students

పరోపకారార్థమిదం శరీరం
———————–
ఫార్మా ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. దిక్కుతోచని ఉద్యోగులు పై అంతస్థు నుండి దూకేస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైన దట్టమైన పొగ. హాహాకారాలు. తన మిత్రుడి తల్లి కూడా ఆ ఫ్యాక్టరీ మంటల మధ్య చిక్కుబడి ఉందని తెలిసి పరుగున వెళ్లాడు సాయి చరణ్. గేటు దూకాడు. లోపల ఉన్నవారిలో యాభై మంది మెట్లమీదుగా కిందికి దిగి క్షేమంగా బయటికి వచ్చేశారు. ఆరుగురు మాత్రం నాలుగో అంతస్థులో ఇరుక్కుపోయారు. చుట్టూ మంటలు. మెట్లదారి కూడా మూసుకుపోయింది. గేటు దగ్గర జనం అరుస్తున్నారే కానీ ఎవరూ ముందుకు కదల్లేదు. సాయి చరణ్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒక తాడు తీసుకున్నాడు. నాలుగో అతస్థుకు విసిరాడు. ఆ తాడు సాయంతో నాలుగో అంతస్థుదాకా ఎగబాకి…ఇద్దరిని ఆ తాడు ద్వారానే కిందికి దించాడు. ఈలోపు ఫైర్ ఇంజిన్ వచ్చింది. అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మిగతావారిని కూడా దించి…తానూ క్షేమంగా దిగాడు.

పోలీసులొచ్చారు. మీడియా వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు. అందరూ సాయి చరణ్ ను అభినందించారు. ఎమ్మెల్యే ప్రశంసాపూర్వకంగా అయిదు వేల నగదు ఇవ్వబోతే సాయిచరణ్ సున్నితంగా వెనక్కు జరిగి…తిరస్కరించాడు.

అతడి బంధువులెవరూ ఆ మంటల్లో చిక్కుకోలేదు. అతడి మిత్రుడి తల్లి ప్రమాదంలో చిక్కుకుందేమోనన్న ఆందోళనతో కదిలిన సాయిచరణ్ కాపాడిన అయిదు ప్రాణాల ముందు…ఎమ్మెల్యే ఇవ్వబోయిన అయిదు వేలకు కాగితం విలువకుడా ఉండదు.

విషయం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి సాయిచరణ్ ను ఇంటికి పిలిపించుకుని అభినందించారు. మంచిదే.

“పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥

పరులకోసమే చెట్లు పండ్లనిస్తాయి; నదులు ప్రవహిస్తాయి; ఆవులు పాలనిస్తాయి; పరులకోసం పాటుపడడానికే ఈ శరీరమున్నది”-
అన్న ప్రఖ్యాత నీతిశ్లోకం సాయిచరణ్ కు తెలిసి ఉండకపోవచ్చు. అతడే ఆ శ్లోకమైనప్పుడు తెలియాల్సిన పనే లేదు. తెలుసుకోవాల్సింది మనమే.

గురు దక్షిణ
———-
పల్నాడు జిల్లా మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో బండి జేమ్స్ చిత్రలేఖనం మాష్టారు. ఈనెల 30 న పదవీవిరమణ చేస్తున్నారు. ఆయన గతంలో లేపాక్షి నవోదయ విద్యాలయంలో పనిచేశారు. అప్పటి లేపాక్షి విద్యార్థులందరూ కలిసి ఒక కారు కొని పదవీ విరమణ సమావేశానికి పల్నాడు మద్దిరాల వెళ్లారు. తమ చిత్రలేఖనం మాష్టారు తమ జీవిత రేఖలను ఎంత అందంగా చిత్రించారో వివరిస్తూ వేనోళ్ల పొగిడారు. ఆయన తమ హృదయ ఫలకాలపై చిత్రించిన జీవన వర్ణ చిత్రాలు ఎంత గొప్పవో వైనవైనాలుగా వర్ణించి చెప్పారు. చివర మాస్టారును బడి బయటికి తీసుకొచ్చి…మెడలో ఒక పూలమాల వేసి…కాళ్లకు నమస్కరించి…చేతిలో కారు తాళం పెట్టి…గురుదక్షిణ సార్ అన్నారు.

ఆ సార్ మనసులో ఎన్నెన్ని వర్ణాలు కుంచె లేకుండానే చిత్రాలుగా రూపు దిద్దుకున్నాయో!
ఆ శిష్యుల కళ్లల్లో ఎన్నెన్ని ఇంద్రధనసులు వెల్లివిరిశాయో!

“…మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిం…

మనసును లగ్నం చేసి కేంద్రీకరించాల్సిన చోటు గురువు పాదపద్మాలు తప్ప…ఇంకొకటి లేదు…లేదు…లేదు…లేనేలేదు…”

అన్న ప్రఖ్యాత శంకరాచార్యుడి గుర్వష్టక శ్లోకం ఈ శిష్యులకు తెలిసి ఉండవచ్చు. తెలియకపోయి ఉండవచ్చు. తెలియకపోయినా నష్టం లేదు. తెలుసుకోవాల్సింది మనమే. ఎందుకంటే- ఆ శ్లోకమే వారయ్యారు కనుక… -పమిడికాల్వ మధుసూదన్  9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions