కొందరు తమ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు… ప్రతిభ కనబరుస్తారు… డబ్బు కూడా సంపాదిస్తారు… కానీ చిన్న చిన్న అంటే సిల్లీ విషయాల్లో కూడా అనవసర అహాలకు పోయి, కీచులాటల్లోకి దిగి, మెచ్యూర్డ్ మెంటాలిటీ కనబర్చక చిరాకు తెప్పిస్తారు… చికాకు పెడతారు…
ఇది అన్నిరంగాల్లోనూ ఉన్నదే… కాకపోతే జనం పదే పదే గమనించే మీడియా, పొలిటికల్, సినిమా, టీవీ, క్రికెట్ రంగాల్లో మరీ ఎక్కువ… తిక్క ఎక్కువ కేరక్టర్లు అన్నమాట… తెలుగు సినిమాకు సంబంధించి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు… తాజాగా ఎక్కడో చదివాను… అది ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను, స్టార్ సింగర్ సునీతల నడుమ ఇలాంటి సిల్లీ కొట్లాట గురించి…
విషయం ఏమిటంటే..? ఇద్దరికీ పడదు… మాట్లాడుకోరు… నిజానికి సునీతకు యాంకరింగ్ రాదు, ఉదయభాను పాడలేదు… టీవీ, సినిమా రంగాల్లోనే ఇద్దరివీ వేర్వేరు విభాగాలు… ఐనా ఎక్కడో తేడా కొట్టింది… ఎక్కడంటే..?
Ads
ఓసారి అప్పుడెప్పుడో సునీత అమెరికాలో ఓ షో చేసింది, దాని నిర్వాహకులు వేరేనట… ఆర్కెస్ట్రా కూడా సునీతదే… దానికి ఉదయభానును కూడా ఆహ్వానించారట… కానీ సునీత తనను వేదిక మీదకు పిలవలేదట, నిర్వాహకులు పిలిచినప్పుడు వేదిక మీదకు వెళ్తుంటే సునీత ఆర్కెస్ట్రా విషాదగీతాన్ని ఆర్ఆర్‌గా ప్లే చేశారట…
ఇది సునీత కావాలనే చేసింది అంటోంది ఉదయభాను… ఎక్కడో ఇంటర్వ్యూలో సునీత పేరు చెప్పకుండానే ఈ ఇష్యూ ప్రస్తావించి అందుకే తనకు కోపం అని చెప్పుకొచ్చింది… దీన్ని మరేదో ఇంటర్వ్యూలో ఎవరో సునీతను అడిగితే… అబ్బే, ఆర్కెస్ట్రా ఎందుకలా వాయించిందో తెలియదు, అది జరిగిందో లేదో కూడా తెలియదు, అందుకేనేమో నేను పలుసార్లు మాట్లాడించే ప్రయత్నం చేసినా కస్సుమన్నట్టు చూసేది అని చెప్పుకొచ్చింది…
సరే, జరిగింది ఏదైనా సరే… తనను సునీత అవమానించిందనే ఫీల్ ఉదయభానుది… అరె, నాకు సంబంధం లేదు మొర్రో అనేది సునీత వివరణ… నిజానికి ఇద్దరి నడుమ ఇంకేదో అప్పటికే మండుతూ ఉండి ఉండాలి… లేకపోతే అకారణంగా సునీత ఆర్కెస్ట్రా అలా ట్రాజెడీ ఆర్ఆర్ వాయించదు… అదేమిటో సునీత చెప్పదు, ఉదయభాను అడగదు…
ఇదే మెచ్యూరిటీ లేకపోవడం అంటే… ఇంకేదో కారణం లేకపోతే, నేరుగా ఉదయభాను సునీతనే అడిగి ఉండేది కదా… నిజంగానే సునీత దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పేది కదా… సరే, గతంలో ఏదీ లేదనే అనుకుందాం… మరి ఈ చిన్న విషయానికి మనస్సుల్లో అగాధాన్ని పెంచుకుని, పైగా దాన్ని ఇంటర్వ్యూలో చెప్పి, అదీ ఇన్నేళ్ల తరువాత… అంత అవసరమా మీకు..? అంటే అన్నామంటారు గానీ..!!
ఎందరో కొత్త మహిళా గాయకులు వచ్చారు, అదరగొడుతున్నారు, సునీత పాతబడిపోయింది… ఏదో పాడతా తీయగా వంటి షోలకు జడ్జిగా ఏదో నెట్టుకొస్తోంది… ఉదయభాను అయితే ఎప్పుడో తెరకు దూరమైంది… ఈమధ్య మళ్లీ ఒకటీరెండు షోలకు హోస్ట్ అవతారమెత్తినా సరే పెద్దగా క్లిక్ కాలేదు… సుమ, శ్రీముఖిల తరం ఇది… ఇక ఇప్పుడు పెద్దగా పనిలేదని ఈ పాత పంచాయితీలకు తెరమీదకు తెచ్చి మళ్లీ గోక్కుంటున్నారా..?!
Share this Article