.
దేశద్రోహిగా వచ్చి దేశభక్తుడిగా మారితే..? భలే ఐడియా గురూ! గూఢచారి కథకు కామెడీ తాలింపు.. కానీ నవ్వుల మిషన్ చివరివరకు సాగిందా?
స్పై సినిమాలంటేనే రహస్యాలు, కుట్రలు, వెన్నుపోట్లు, దేశాల మధ్య గూఢచర్యం. ఒక దేశానికి చెందిన ఏజెంట్ మరో దేశంలోకి చొరబడి, అక్కడి రహస్యాలను సేకరించి, తన దేశానికి చేరవేస్తుంటాడు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి కథల్లో ఉత్కంఠకు కొదవ ఉండదు. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఇస్తే.. అదే కథ కాస్త కామెడీగా మారిపోతుంది. ఆ ట్విస్టే ‘ఉడ్తా తీర్’!
Ads
ఒక దేశం తరఫున పనిచేస్తూ, మరో దేశంలో గూఢచారిగా చొరబడిన వ్యక్తి తన గతాన్ని మరిచిపోతే? తన అసలు గుర్తింపే గుర్తులేకపోతే? తాను ఎవరి కోసం వచ్చాడో, ఎవరికి నష్టం చేయాలనుకున్నాడో మరిచిపోయి.. అదే దేశానికి వీర విధేయుడిగా మారిపోతే? అతన్ని పంపిన వాళ్ల పరిస్థితి ఏమిటి? ఇదిగో.. ఈ ఒక్క పాయింట్‌లోనే బోలెడంత కామెడీ ఉంది. గూఢచారి కథల్లో సాధారణంగా కనిపించే డబుల్ క్రాస్‌కు భిన్నంగా, ఇక్కడ హీరో తనకు తెలియకుండానే సొంతవాళ్లకే షాక్ ఇస్తాడు!
కథ ఏంటి? విక్రాంత్ థాపర్‌గా ఆయుష్మాన్ ఖురానా భారతదేశంలోని కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్‌లో పనిచేస్తుంటాడు. అతను సమర్థుడైన అధికారి. కానీ అసలు విషయం ఏమిటంటే.. అతని నిజమైన పేరు బిలాల్ అహ్మద్. అతను పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి. భారత భద్రతా వ్యవస్థలోకి చొరబడి, అక్కడి రహస్యాలను సేకరించడం అతని పని.
అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఒక ప్రమాదం జరుగుతుంది. బిలాల్ తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. తాను పాకిస్థాన్ గూఢచారినన్న విషయమే మరిచిపోతాడు. తనను తాను భారతదేశానికి చెందిన దేశభక్తుడైన అధికారిగా భావించడం మొదలుపెడతాడు. ఇంకేముంది? భారతదేశాన్ని దెబ్బతీయడానికి వచ్చినవాడే, దాన్ని కాపాడే మిషన్‌లోకి దిగుతాడు!
అతని అసలు యజమానులకు ఇది పెద్ద తలనొప్పి. తమ ఆదేశాలు పాటించాల్సిన ఏజెంట్ ఇప్పుడు తమ పథకాలనే చెడగొడుతున్నాడు. అతన్ని నియంత్రించాలా? తిరిగి తమవైపు తిప్పుకోవాలా? లేక అతని వల్ల తమ రహస్యాలన్నీ బయటపడకముందే ఏదైనా చేయాలా? ఈ గందరగోళమే సినిమాకు ప్రధాన బలం.

స్పై సినిమాకు రివర్స్ గేర్! ఈ మధ్యకాలంలో గూఢచారి సినిమాల్లో ఒకే తరహా ఫార్ములా ఎక్కువగా కనిపిస్తోంది. మన ఏజెంట్ శత్రుదేశంలోకి వెళ్తాడు. అక్కడి కుట్రలను ఛేదిస్తాడు. శత్రువులను చిత్తు చేస్తాడు. చివర్లో దేశభక్తి డైలాగులతో థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాడు. అలాంటి కథలకు అలవాటుపడిన ప్రేక్షకుడికి ‘ఉడ్తా తీర్’ కథనం భిన్నంగా అనిపిస్తుంది.
ఇక్కడ హీరోకు శత్రుదేశంలోకి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే అక్కడికి సంబంధించిన గూఢచారి. సమస్య ఏమిటంటే, అతనికి ఆ విషయం గుర్తులేదు! దేశభక్తి మాత్రం గుర్తుంది. కానీ ఏ దేశం మీద దేశభక్తి చూపించాలో మరిచిపోయాడు!
ఇదొక మంచి కామెడీ పాయింట్. గూఢచారికి జ్ఞాపకశక్తి పోయింది.. కానీ దేశభక్తి పోలేదు. దురదృష్టం ఏమిటంటే, ఆ దేశభక్తి ఇప్పుడు అతని యజమానులకే వ్యతిరేకంగా పనిచేస్తోంది! ఈ పరిస్థితుల్లో అతని ప్రవర్తన, అతన్ని రహస్యంగా నియంత్రించాలనుకునే వాళ్ల తంటాలు, అతని నిజమైన గుర్తింపును దాచిపెట్టే ప్రయత్నాలు…
ఆయుష్మాన్ ఖురానాకు తగిన పాత్రే! విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ఆయుష్మాన్ ఖురానాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సీరియస్ పాత్రలోనైనా, కామెడీలోనైనా సహజంగా కనిపించడం అతని బలం. ఈ సినిమాలోనూ తన అసలు గుర్తింపు తెలియని గూఢచారిగా, తాను దేశం కోసం ఏదో గొప్ప మిషన్ చేస్తున్నానని నమ్మే అధికారిగా రెండు కోణాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఒకవైపు అతని అమాయకత్వం.. మరోవైపు అతని శిక్షణలో భాగంగా వచ్చిన గూఢచారి నైపుణ్యాలు. తనకు తెలియకుండానే తన పాత మిషన్‌కు అడ్డుపడే పరిస్థితులు. ఈ వైరుధ్యాన్ని కామెడీగా మార్చడంలో ఆయుష్మాన్‌కు మంచి అవకాశం దక్కింది.
అసలు సమస్య రెండో భాగంలోనే! ఒక మంచి పాయింట్ దొరకడం వేరు. ఆ పాయింట్‌తో రెండున్నర గంటల సినిమాను ఆసక్తికరంగా నడిపించడం వేరు. ‘ఉడ్తా తీర్’కు మొదటిది బాగానే కుదిరింది. రెండో విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది.
ఈ సినిమా మొదటి భాగంలో విచిత్రమైన పరిస్థితులు, గూఢచారి వ్యవస్థలోని గందరగోళం, హీరో జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల ఏర్పడే పరిణామాలు వినోదాన్ని అందిస్తాయి. కానీ రెండో భాగానికి వచ్చేసరికి కామెడీ నుంచి సీరియస్ దేశభక్తి వైపు కథ మళ్లడం, పాటలు కథనానికి అడ్డుపడటం, కథలోని కొన్ని అంశాలు మరీ సంక్లిష్టంగా మారడం వంటి సమస్యలు కనిపిస్తాయి…
అంటే కథలో కామెడీకి కావాల్సిన సరుకు ఉంది. పాత్రలూ ఉన్నాయి. కానీ ఆ సరుకును చివరివరకు ఒకే స్థాయిలో ఉపయోగించడంలోనే దర్శకుడికి సవాలు ఎదురైంది. స్పై కామెడీగా మొదలైన కథ మళ్లీ సాధారణ దేశభక్తి సినిమాల బాట పట్టినప్పుడు, మొదట్లో కనిపించిన కొత్తదనం కొంత తగ్గుతుంది.
‘ఉడ్తా తీర్’ కథలో ఉన్న కొత్తదనాన్ని మాత్రం మెచ్చుకోవాలి. శత్రుదేశానికి ఉపయోగపడాల్సిన గూఢచారి, తన జ్ఞాపకశక్తిని కోల్పోయి అదే దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెడితే.. అతని శత్రువులు ఎవరు? మిత్రులు ఎవరు? తనను తాను ఎవరిగా భావించాలి? ఈ ప్రశ్నలతోనే మంచి కామెడీ..! ఉడ్తా తీర్ అంటే రివర్స్ గేర్… అదే దురంధర్‌కు రివర్స్ !!
Share this Article