.
సీనియర్ నరేష్ (వీకే నరేష్)… ఒకప్పుడు హీరో… సరే, ఏం పాత్రలు చేశాడో, ఎన్ని నిలబడ్డాయో, ఎన్ని కొట్టుకుపోయాయో వదిలేస్తే…. కేరక్టర్ ఆర్టిస్టుగా మారాక మంచి మంచి పాత్రలు ఎంచుకుంటున్నాడు…
పాత్రల స్వభావానికి తగ్గట్టు మంచి నటననే కనబరుస్తున్నాడు… (వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లు, వివాదాలు గట్రా సమాంతరంగా మరో కథ)… అయితే ఒక్కసారిగా కే-ర్యాంప్ అనే తాజా సినిమాలో పోషించిన పాత్ర మాత్రం తన పాత్రల ఎంపికలోని విజ్ఞతను కాలరాచినట్టయింది.,.
Ads
ఈ సినిమా ప్రెస్‌మీట్‌లోనే ఎవరో అడిగారు… పచ్చి బూతులు అవసరమా అని… దానికి నరేష్ సమాధానమిస్తూ మరి పండు బూతులు అంటే ఏమిటి అని వ్యంగ్యంగా జవాబు చెెప్పానని తనకు తనే నవ్వుకున్నాడు, కాస్త వెకిలిగా…
ఈ సినిమా రొటీన్ రివ్యూ కాదు ఇది… అందులో నరేష్ పాత్రను మలిచిన తీరు, ఇతరత్రా బూతుల గురించి చెప్పుకోవడం…! 65 ఏళ్ల వయస్సులో ఇలాంటి చిల్లర, వెకిలి పాత్ర చేయాలా తను..?
సరే, ఈ సినిమా హీరో దగ్గర మొదలుపెడదాం… కిరణ్ అబ్బవరం, కాస్త వైవిధ్యమున్న పాత్రలు, రొటీన్ హీరోల రొడ్డకొట్టుడు కథలకన్నా డిఫరెంట్ కథలతో ఇండస్ట్రీలో నిలబడ్డాడు… ఫ్లాపులు, సక్సెసుల మాటెలా ఉన్నా… డౌన్ టు ఎర్త్ పాత్రలు చేస్తాడనే పేరొచ్చింది…
ఇందులో మొదటి నుంచీ తాగుతూనే ఉంటాడు… పైగా బూతులు… చీప్ టేస్ట్ సరదాలు… హీరోయిన్ పేరు యుక్తి తరేజా… ఆమెతో బోలెడు ముద్దు సీన్లు… అదేమిటో హీరోయిన్‌కు వెర్రెత్తినప్పుడల్లా, ఓ మెంటల్ సమస్యలాగా చంద్రముఖిలా (Post-Traumatic Stress Disorder (PTSD) మారినప్పుడల్లా… హీరో ముద్దు పెడితే సెట్ రైట్ అవుతుందట… అసలు ఎంట్రీ సీన్‌లోనే హీరో నోట్లో నోరుపెట్టి గాలి ఊదుతుంది…
ఇక నరేష్‌ది జుగుప్స కలిగించే చిల్లర ప్లేబోయ్ పాత్ర… ఈ సినిమాలో “మొహం మీద గుడ్డ వేసి….” ‘‘అమ్మాయి ముద్దుపెడితే ఓచోట ఫీలింగ్స్ వస్తాయి కదా, వణుకుతున్నాయి’’ అంటూ నరేష్ తో చెప్పించిన డైలాగులు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చీదరించుకునేలా ఉంటాయి…
నేను యంగ్, అందుకే బోల్డ్ రోల్స్ చేస్తున్నాను, యూత్ ఫుల్‌గా ఉంటున్నాను అనే పిచ్చి భ్రమల్లో ఉన్నాడా తను..? అఫ్‌కోర్స్, అప్పట్లో గుంటూరు టాకీస్‌లో కూడా ఇలాంటి పాత్రే తనది…
సెకండాఫ్‌లో వచ్చే కామ్నా జెఠ్మలాని ఎపిసోడ్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది… వాళ్ల కాంబినేషన్ కంటే నరేష్ తన కొడుకు పాత్ర కిషోర్ కి ఎందుకు ట్రై చేస్తున్నాడని వివరించే విధానం ఇంకా అసహ్యంగా ఉంది… నరేష్ చేయి మహిళ నడుముకు తగిలే ట్రాక్, కాస్త ఆపుకుని ఉంటే నువ్వు పుట్టేవాడివే కావు వంటి డైలాగులు, ఐస్- సాంబార్ నడుముల పోలికలు… ఓవరాల్‌గా టేస్టున్న ప్రేక్షకులు నరేష్‌ను చూసి ఫాఫం అని జాలిపడటమే…
అసలు మాస్ ఆడియన్స్ కి నచ్చే న్యూట్రెండ్ సినిమా ధోరణి ఇదే అని దర్శకుడు అనుకుంటే… జాలిపడటం తప్ప మరేమీ చేయలేం… అక్కడక్కడా కొన్నిచోట్ల కామెడీ కాస్త కుదిరింది, అలాగని సినిమాలోని డైలాగులు, ప్రత్యేకించి నరేష్ పాత్ర చీదర… రోత..!!
2023లో ఓ వార్త… తన పేరు ముందు హిజ్ ఎక్సలెన్సీ, సర్, డాక్టర్ అనీ పెట్టుకుంటుంటే దానిపై రాసిన వార్త…
‘‘2018లో ఐసీడీఆర్‌హెచ్‌ఆర్‌పీ (international-commission-of-diplomatic-relations-human-rights-and-peace) నుంచి హిజ్ ఎక్సలెన్సీ టైటిల్, పీహెచ్‌డీ పొందాడట… అది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థ అట… ఓహో, ఐరాస ఈ దందాలు కూడా చేస్తుందా..? ఎవరికైనా సరే, ఇలా హిజ్ ఎక్సలెన్సీ టైటిళ్లు ఇచ్చేస్తుందా..?
ఇదేదో తేడాగా ఉన్నట్టుంది అని చెక్ చేస్తే… సదరు సంస్థ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే… వెంటనే యాంటీ వైరస్ దాన్ని ఓపెన్ చేయకుండా అడ్డుపడింది… అంతటి ప్రమాదకరమైన సైట్ అట… licensed Commission of International Diplomacy of this Independent Sovereign Inter Governmental Organization, with universal jurisdiction of the international law, Consisting of Sovereign subjects of international law, thereby processing inherent capacity for diplomatic relations అని ఇంగ్లిష్ వివరణ… సదరు సంస్థ చీఫ్ కూడా దీన్ని అర్థమయ్యేలా చెప్పగలడు అనుకోను…’’
.
అవునూ, అంతటి హిజ్ ఎక్సలెన్సీ, సర్, డాక్టర్ నరేష్‌కు ఈ చీదర పాత్రలు అవసరమా..? అన్నట్టు… ఆ మూడో భార్యతో పంచాయితీ తెగినట్టేనా నరేషుడూ..?!
Share this Article