అప్పుడెప్పుడో రుస్తుం అనే సినిమాలో చిరంజీవి సరసన నటించింది ఊర్వశి… చాలా సీనియర్ నటి కానీ తెలుగులో మళ్లీ ప్రముఖంగా కనిపించలేదు… ఏమో, గుర్తుంచుకునేంతగా లేదు… కన్నడం, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాలు చేసింది… కానీ ఆమె ప్రధానమైన ఫీల్డ్ మలయాళమే… మొదట్లో పెద్దగా ఇంప్రెసివ్ నటి అనిపించలేదు, కానీ అనుభవంతో చాలా బాగా మెరుగుపడింది… టీవీల్లో కూడా చేసింది…
సార్వతి తిరువోతు… ఈమె మలయాళ నటి… అన్ని భాషల్లోనూ చేస్తుంది గానీ తన ప్రధాన ఫీల్డ్ మలయాళమే… డైనమిక్… అప్పట్లో అర్జున్‌రెడ్డి, యానిమల్ సినిమాల మీద ధైర్యంగా గొంతు విప్పి, విమర్శలతో ఆరేసింది… మలయాళ ఇండస్ట్రీ లేడీస్ గ్రూపులో ఫౌండర్ మెంబర్… (వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)… నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూరణి తీసేయడాన్ని విమర్శిచింది… మన ‘మా’లాగే మలయాళ ఆర్టిస్టుల అసోసియేషన్ (అమ్మ)లో వివక్ష మీద పోరాడింది… తనే రిజైన్ చేసింది… (తంగలాన్ సినిమాలో విక్రమ్ భార్య పాత్ర చేసింది)…
Ads
వీళ్ల గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే… ఇద్దరూ మంచి నటులు… వాళ్లిద్దరూ బలంగా పోటీపడిన సినిమా మలయాళంలో ఉల్లోజుక్కు ( Ullozhukku…) (అమెజాన్ ప్రైమ్)… అంటే అంతఃప్రవాహం, అండర్ కరెంట్ అనుకుంటాను… మలయాళం సినిమాల్ని ఎందుకు మెచ్చుకుంటారూ పదే పదే అనే ప్రశ్నకు మరో జవాబు ప్లస్ మనవాళ్లకు నిజంగానే టేస్ట్ లేదా అనే నిరాశకు ఉదాహరణ ఈ సినిమా… ఆ దర్శకులు తక్కువ ఖర్చుతో భిన్నమైన కథల్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు, సాహసిస్తారు, కలలు గంటారు, తెర మీదకు తీసుకొస్తారు… తక్కువ టైమ్… ఎంతసేపూ కమర్షియల్ మూసీలో పడి కొట్టుకుపోరు…
సర్వం కోల్పోయి కొడుకు కోసమే బతికే ఓ తల్లి పాత్ర ఊర్వశిది… ప్రేమ ఒకరి మీద, జీవితం మరొకరితో ముడిపడిన ఓ కోడలి పాత్రలో పార్వతి… మానవ బంధాల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు, చిక్కులు, ఆశలు, కలలు, రహస్యాలను తెర మీద భలే ఆవిష్కరిస్తారు ఇద్దరూ… కాకపోతే సినిమా లాగ్ అనలేం గానీ, కాస్త స్లో నెరేషన్… (థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ ఓటీటీలో బాగా వ్యూయర్‌షిప్ సాధించింది)…
చాలా సీన్లు సినిమాలో రెయిన్ బ్యాక్ డ్రాపులో బాగా పండుతాయని అంటారు… ఈ సినిమాలే వాన కూడా ఓ పాత్రే అనిపిస్తుంది… కుండపోత వాన… ఎడతెరిపిలేని వాన… ఆ వానలోనే కథ తడిసి ముద్దయి, టేస్టున్న ప్రేక్షకులనూ ముంచేస్తుంది… ఓ గ్రామాన్ని ముంచేసిన ఆ కుండపోత, ఆ వానలో రోజుల తరబడీ అంత్యక్రియల కోసం నిరీక్షించే ఓ శవం… అర్థమైంది కదా, సినిమా కథలోని లోతు…
పార్వతి పాత్ర పేరు అంజు… ఓ వ్యక్తిని ప్రేమిస్తుంది, తననే గుండెలో పెట్టుకుంటుంది, కానీ మరో వ్యక్తి చేతిలో చేయి వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది… భర్త థామస్ కుట్టి, అత్తతో బాగానే ఉంటుంది, కానీ ప్రేమించిన కుర్రాడిని మరిచిపోలేక రహస్యంగా కలుస్తూ ఉంటుంది… తప్పే, తప్పేనని తనకూ తెలుసు, కానీ తనను తానే నిరోధించలేకపోతుంది… గుండెలో ఒకడు, ఇంట్లో మరొకడు…
కోడలు తల్లి కాబోతోందనేది అత్త ఆనందం… ఆ ఆనందం వెనుక వెన్నాడే విషాదాలు… కోడలికి తెలియకుండా అత్త ఏ నిజం దాచింది..? అత్తకు తెలియకుండా కోడలు రహస్యంగా సాగిస్తున్న ప్రయాణం ఏమిటి..? అతి భారీ వర్షంలో వారి నడుమ సాగే సంభాషణలు అండర్ కరెంటుగా మనకు కథ చెబుతూ కనెక్ట్ చేస్తాయి… ఇలాంటి రచన అనుకున్నంత ఈజీ కాదు… ఇదుగో ఇక్కడే మలయాళ రచయితలు పరిణతిని, పర్‌ఫెక్షన్ ప్రదర్శిస్తుంటారు…
అనారోగ్యంతో కాలం చేసిన కొడుకు మనవడి రూపంలో మళ్లీ వస్తున్నాడనేది అత్త ఉద్వేగం… కానీ ఆ వయసులో కొన్ని సవాళ్లు… భర్త అంత్యక్రియలు ఎప్పుడు అయిపోతాయో, ఎప్పుడు త్వరత్వరగా ప్రియుడి దగ్గరకు వెళ్లిపోదామనుకునే కోడలి ప్రయత్నాలు… కోడలు తనతోనే ఉండాలని అత్త కోరిక… ఇదే సినిమా కథ… లీలమ్మ కొడుకు (అంజు భర్త) అంత్యక్రియల సీన్ ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటుంది… క్లైమాక్స్ లో అత్తాకోడళ్ళ నడుమ మాటల్లేవ్, సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి కూడా మాటల్లేవ్… భలే నటించారు…
అవునూ, ప్రేక్షకుడు ఎవరివైపు..? అత్త వైపా..? కోడలి వైపా..? అంత్యక్రియలు అయిపోయాక కుండపోత వర్షం కాస్త తెరిపి… కొడుకు మట్టిలో కలిసిపోతాడు… స్మశానం దాటిన తరువాత కొత్త జీవితాలు ఆరంభమవుతాయి… ఎలా..? అదే సినిమా క్లైమాక్స్…!!
Share this Article