“కాంతారా … ఓ ముంతకల్లు” ……. డాక్టర్ మనోహర్ కోటకొండ…….
———————————–
తలంతా దిమ్ముగా అయిపోయింది
రెండు గంటలసేపు ఎవరితో ఏమీ మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండిపోయా. రాత్రి రెండవ ఆట కావడంతో ఆ నిశి ఒంటరితనాన్ని కాపాడింది.
ఏం చూసానో ఏం గ్రహించానో ఏం అనుభవించానో
గ్రహింపుకు రాని సందిగ్ధం.
తెలియని స్తబ్దత.
ఒక్క విషయం మాత్రం అర్థమైంది .
నా లోపల నాకు నేనే ఓ ఓ ఓ ఓఁ.. అంటూ ఒక కిలారింపులు చేసుకుంటూనే ఉన్నాను . నా చుట్టూ జరిగే హింసపై యుద్ధం చేయాలనే కాంక్ష నాలో ఆ కిలారింపులు చేస్తున్నాయి.. ఆ కిలారింపుల్లో నా గతం ఉంది నా నడక ఉంది నా తరాల జానపద జీవితం ఉంది.
మనిషి ఒక అడవి.
తనలో మృత్తిక ధాతువులు మూలకాలు లవణాలు పసురున్న మొలకలు వెదుళ్ళే కాదు ముళ్ళకంపలూ… మహా వృక్షాలూ కలిసి ఉంటాయి.
అడవి మన అస్తిత్వం.
అన్నీ కలిసిన ఆ అడవి కాపాడుకునేందుకు తానే ఓ అడవిగా మారిన యోధుడు చేసిన యుద్ధమే మనల్ని ఓఁ ఓఁ ఓఁ అని అరిచేలా చేస్తుంది .
అయస్కాంత క్షేత్రంలో ధన ఋణ ధ్రువాలు ఉన్నట్లుగా అటవీక్షేత్రాన మనుగడ కోసం వ్యతిరేక శక్తులు పోరాడుతూనే ఉంటాయి. ఒక శక్తి దైవ రూపంలో తమను కాపాడుతుందని భావిస్తారు మూలవాసి ప్రజలు. ఆ దైవాన్ని వేడుకుంటారు . పూజిస్తారు. ఆ పూజ క్రియలోనే వారు సంఘటితమవుతారు.. ఓ ఓ అని కిలారిస్తారు ఆదివాసీ జనం. అది వారి జీవిత విధానం.
అది నమ్మకమూ కాదు, బయట నుంచి నాగరీకులమని భావిస్తున్న వారు చెబుతున్నట్టుగా మూఢ నమ్మకమూ కాదు. అది ఒక వేడుక అది ఒక పండగ అది ఒక యుద్ధభేరి.
పోరాటంలో పూనకం వచ్చి వారే దైవంలాగా మారిపోతారు. నిటారు కండరాల కంపన ప్రకంపనలతో విప్పారిన కళ్ళతో గజగజ వణుకుతూ బిగుసుకుపోయి ఉక్కులా మారిన శరీరంతో ఒక సమూహపు యుద్ధాన్ని ఒంటరిగానే చేస్తాడు ఆదివాసి. ఓఁ అని కిలారించి భీభత్సంగా శత్రువు పైన విరుచుకుపడతాడు వెన్ను విరిచేస్తాడు తనలోని అడవిని కాపాడుకుంటారు.
ఒక పెద్ద యుద్ధంలో ముగుస్తుంది ఈ కాంతారా చిత్రం. అందులో అందరూ సైనికులే అందరూ సేనాధిపతిలే అందరూ అతిరథ మహారథులే ఎవరు కూడా సామాన్యుడు ఉండడు.
Ads
భర్త బట్టతల పైన వెంట్రుకలు రావాలని ఆరాటపడే ఒక ఎండిపోయిన మహిళ కూడా యుద్ధానికి ఆయుధం అవుతుంది. బెదురుతూ బెదిరితే కూడా ప్రశ్నిస్తూనే బెదిరిస్తూనే ఉండే ఒక ఆదివాసి కూడా ఈ కయ్యంలో పాల్గొంటాడు. అస్తిత్వం కోసం ఆరాటపడే ఆదివాసీలు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తూ ఉంటే ప్రత్యర్థి విలాసంగా కుర్చీలో కూర్చొని నాటు తుపాకితో దూరాన ఎగురుతున్న పావురాలను కొమ్మమీద వాలి ఉన్న చిలకలను కాల్చినంత సులువుగా ఆదివాసీలను ఒకరొకరిగా తాపీగా కాలుస్తూ ఉంటాడు. చివరికి ఓ చిన్న పిల్లని కూడా వాడు కాల్చేస్తాడు. రేపటికి ఇది కూడా నా భూమి కావాలని ప్రశ్నిస్తుంది కాబట్టి చంపేయాలి అంటాడు.
ఆ యుద్ధంలో ప్రకృతిలోని అన్ని శక్తులని సమకూర్చుకొని గూడెం వాసులు యుద్ధం చేస్తూ ఉంటారు. ‘అస్తిత్వం లేకపోతే ప్రాణం ఉన్నా లేనట్టే’ అన్న స్పృహ వాళ్ళ నరనరాల్లో జ్వాలను అంటిస్తూ ఉంటుంది.
దురదృష్టం ఏమిటంటే ఈ ఆటవిక జాతులు వాళ్ళ పోడు సేద్యపు భూముల కోసం ఎంత శ్రమిస్తారో, వాటిని కాపాడుకోవడం కోసం అంతే శ్రమించాలి. ఇది ప్రతి అడవి చుట్టుపక్కల జరిగే యుద్ధమే. గవర్నమెంట్ తరఫున ఉన్న ఒక ఆఫీసర్ మొదట మనకు విలన్ లాగా కనపడినా నిజాయితీ గల ఆఫీసర్ కాబట్టి దొర ఎత్తుగడలు తెలుసుకొని ఆదివాసీలకు తోడై దొర మనుషులతో యుద్ధం చేస్తాడు.
ఈ సినిమాలో చూపించినట్లుగా నిజంగా ఇలా జరగదు. ఎవరైనా ప్రశ్నిస్తూ పోరాడుతూ ఉంటే వారికి తోడుగా వెళ్ళిన వాళ్ల మీద కూడా కేసులు బనాయించడం మనం చూస్తూనే ఉంటాం.
ఆదివాసీ నాయకుడు కూడా దొర తుపాకీ తూటాలకు తీవ్రంగా గాయపడతాడు. కానీ తమ దైవం ఇచ్చిన శక్తితో అతను తిరగబడి శత్రువును చంపేస్తాడు .
వాస్తవంలో ఇది కూడా జరగదు. కానీ సంఘటితమైతే మనం పోరాడి గెలవచ్చు అన్న ఆశ దైవరూపం ఆడే భూతకోల ద్వారా దర్శకుడు రగిలిస్తాడు.
మనలో ఉన్న ప్రకృతి మనల్ని ఈ సినిమాను ఇంతలా సొంతం అయ్యేటట్లుగా చేసుకుంటుంది. మనం అమ్మ ఊరికో నాన్న ఊరికో పోయినంత సంతోషంగా ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు.
ప్రతి దృశ్యంలోను మనం భాగస్వామ్యం అయిపోయి ఉంటాం అందులో పాల్గొంటూ ఉంటాం. అందులో లీనమైపోతూ ఉంటాం. తెరలో కనపడుతున్న అన్ని పాత్రల్లోనూ మనల్ని మనమే దర్శించుకుంటూ ఉంటాం.
పసిపిల్లవాడు అడవిలోకి నాన్న కోసం చూస్తున్న చూపుల్లోనూ… ‘బాణం తగలని వరాహం ఏంటో’ ఎరుక తెలిసిన వేటగాడిలోనూ... అమ్మ దగ్గర పదేపదే దెబ్బలు తినే యువకుడిలోనూ… చాపల కూర వండించుకొని చొరవగా చనువుగా సరసం జరిపే ప్రేమికుడిలోనూ… కైలాసమంత ఎత్తులో చెట్టుపైని ఓ మంచెలో ఓ పెన వేసుకున్న పెనుబాముల్లోనూ మాత్రమే మనం కనపడం…
‘ఈసారి ఒకటే పతకం వచ్చింది’ వచ్చే సంవత్సరం ఇంకోటి తెచ్చి వేస్తా అని ఎనుబోతులతో సంభాషించే అమాయకత్వంలోనూ మనల్ని మనం దర్శించుకుంటాం.
భయపడుతూ దబాయించే ఒక అమాయకపు యువకుడిలోనూ… మోటు శృంగారం తర్వాత రెండు మోకాళ్లు దుమ్ము కొట్టుకుపోయిన వయసు పైబడ్డ వ్యక్తి లోనూ మనకు మనమే కనపడతాం.
ఎక్కడ ఎక్కువ తాగేస్తున్నాడో అని ఆరాటపడే తల్లి… దొర పైన పోరాడమని చెప్పే తల్లిలోనూ మనమే ఉంటాము.
భర్త ఇంకొక ఆడదాని దగ్గరికి వెళుతూ ఉంటే మౌనంగా చూస్తున్న ఓ తల్లి నిశ్శబ్దంలోను మనమే ఉంటాం. తోడుగా వెళ్తున్న యువకుడికి టార్చిలైట్ ఇచ్చి పంపే జాగ్రత్తలోనూ మనమే ఉంటాము.
ఆ తల్లి బిడ్డ ఎదగని పసి పిల్లాడి చిరునవ్వులోను మనమే ఉంటాం.
చిత్రకథ మనం చాలా సార్లు చూసే ఉన్నాము. కొన్ని వందల తెలుగు సినిమాలు భూస్వాములకు కూలీలకు పెత్తందారులకు చిన్న రైతులకు మధ్య జరిగే సంఘర్షణతో వచ్చాయి. ఎన్నెన్నో చిత్రాలు చూశాం కానీ ఇందులో చూస్తున్నది వేరు అనుభవిస్తున్నది వేరు. అడవి గాలిని పీలుస్తూ ఆ బురదలో మనం దొర్లుతూ ఆ చీకటిలో మనం ముణగదీసుకుంటూ.. ఆ వెలుగులో మనం విప్పారుకుంటూ ఈ సినిమాను చూస్తాను.
ప్రతి చోట ఆ ప్రాంతపు ధ్వని ప్రతిబింబించే వాయిద్యాలు డప్పు తుడుము పలకలు డోలు సన్నాయి పిల్లంగట్టె.. ఇలా స్వచ్ఛమైన తొలి తరం సంగీత వాయిద్యాలు మనల్ని ఆ సినిమా లోపలికి తీసుకెళ్లిపోతాయి. ఒక్క మొఖం కూడా తెలిసి ఉండకపోవడం మనకు చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. అప్పుడే రెప్పలు విప్పారిన పసిబిడ్డ లోకాన్ని చూసినంత కొత్తగా ఆ కథ చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది.
చిత్రం ముగింపులో భూతకోల ఆడిన తర్వాత కథానాయకుడు తన పల్లె ప్రజల చేతులను అటవీ అధికారి చేతులకు అందించి ఆ చేతుల పైన లాలనగా ఊగడం ఎంత స్వాంతనగా అనిపిస్తుందో.
ఆ తర్వాత తను అడవిలో కలిసిపోయి ప్రకృతి తను ఒకటే అని చెప్పే దృశ్యం అద్భుతం.
కాంతారా చూసి బయటకు వచ్చాక మనకు ఈ తరంలో వస్తున్న తెలుగు సినిమాలు స్పృహకు స్మరణకు రావు. కానీ ఆలోచిస్తూ ఉంటే ఎన్ని గొప్ప కథలను మనం పోగొట్టుకున్నాము అన్న చింత మనకు వస్తుంది.
ఏదేమైనా ఈ కథ కూడా మనదే. మన ప్రతి పల్లెదీ. అడివంచు పల్లె మీదుగా వస్తున్నస్తున్న స్వచ్ఛమైన గాలి కథ ఇదే.
70 దశకం మధ్య నుంచి ‘వ్యాపార సూత్రాలంటూ’ తెలుగు చిత్రాలకూ ప్రేక్షకులకూ ద్రోహం చేసిన తెలుగు దర్శకులు ఇప్పటి చిత్రాలను కూడా మార్కెట్ దారినే పట్టించారు. అప్పుడప్పుడు కొన్ని ఆణిముత్యాలు వచ్చినా కృతకత్వాన్ని తెలుగు సినిమాకు వంట పట్టించేశారు. ఒకప్పుడు ‘ఒక రోజులు మారాయి, ఒక రైతు బిడ్డ, ఒక మన ఊరి కథ, ఒక మన ఊరి పాండవులు, చలి చీమలు పునాదిరాళ్లు’ ఇలా ఎన్నెన్నో తెర పండుగ చేశాయి. అలాంటి కథలు మళ్లీ వచ్చి మన తెలుగు తెరకు పట్టాభిషేకం చేస్తాయని ఆశిద్దాం.
కరోనాకాలంలో ఓటీటి ల పుణ్యమాని ఇతర భాష చిత్రాల్లో వస్తున్న మేలిమి చిత్రాలను చూసిన తెలుగు ప్రేక్షకుడు తన దృక్పథాన్ని మార్చుకున్నాడు . సినిమాల్లోని ప్రాంతీయ పచ్చివాసనను సొంతం చేసుకున్నాడు.
ఇక మారాల్సింది తెలుగు చిత్ర రంగమే.
కాంతారా చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకుడు మంచి చిత్రాలను విజయవంతం చేసి కనక వర్షానికి కురిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని ఇంకోసారి ప్రకటించాడు..
.
(కాంతార మీద ముచ్చట బోలెడన్ని వార్తలు వేసింది… అవసరమూ ఉంది… కానీ ఓ మిత్రుడు పంపిన ఓ రివ్యూ చదివాక కాసేపు ఆ హ్యాంగోవర్ నుంచి బయటికి రాలేకపోయాను… అవును, ఈ రివ్యూ కూడా కాంతార సినిమాలాగా ఓ ముంతకల్లులాంటిదే… రచయిత మనోహర్ కోటకొండకు ధన్యవాదాలు, ప్రశంసలతో…)
Share this Article