ఎనిమిదేళ్ల క్రితం… అప్పటికి విజయ్ దేవరకొండ హీరో కాదు… నాని స్టార్ హీరో కాదు… ఓ కొత్త పిల్ల మాళవిక నాయర్, అప్పటికి ఇంకా పాపులారిటీ రాని రీతూ వర్మలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా… పేరు ఎవడే సుబ్రహ్మణ్యం..! దర్శకుడి ఉత్తమాభిరుచి కనిపిస్తుంది ప్రతి సీన్‌లో… హీరో తనను తాను అన్వేషించుకుంటూ హిమాలయాల్లోకి సాగించే ప్రయాణమే కథ… చివరకు ఏం తెలుసుకుంటాడు, ఎలా మారతాడు అనేది కథ… వ్యాపారబంధాలకన్నా ఈలోకంలో అవసరమైన బంధాలు చాలా ఉన్నాయని చెప్పే కథ…
ఎంతసేపూ డిష్యూం డిష్యూంలు… మాఫియాలు, అండర్ వరల్డ్ కథలు, పిచ్చి స్టెప్పులు, తిక్క డైలాగులు, నరుకుడు, చంపుడు, ఐటమ్ సాంగ్స్‌తో భ్రష్టుపట్టిన మాస్ మసాలా సినిమాల నడుమ ఓ పెద్ద రిలీఫ్… సేమ్, హిందీ సినిమాలు కూడా అంతే కదా… సేమ్, ఊంచాయి అనే సినిమా చూస్తుంటే కూడా ఇలాగే అనిపిస్తుంది… కథ కూడా దాదాపు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది… ఇంకాస్త నాణ్యంగా కనెక్ట్ అవుతుంది…
చూడాలి… ప్రేక్షకుడే కాదు… థియేటర్లలోనే కాదు… మన తోపులు, స్టారాధిస్టార్లు చూడాలి… దశాబ్దాలుగా సినీరంగాన్ని క్షుద్ర ఇమేజీ బిల్డింగులతో ఏలిన పెద్ద పెద్ద స్టార్లు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇవీ నేను పోషించిన గొప్ప పాత్రలు అని చెప్పడానికి ఏమీ ఉండవు… అదుగో ఆ హీరోలు చూడాలి… వయస్సు మీద పడుతున్నా సరే, ఒక్క సరైన పాత్ర ఎంచుకోక ఇంకా తొలినాళ్ల రొటీన్ మాస్ పాత్రల్ని ఎంచుకుని, ఎగురుతూ ఆనందపడే హీరోలు చూడాలి…
Ads
అమితాబ్… 80 ఏళ్లు… ఐనా సినిమాయే ప్రపంచం… అయితే ఎంచుకునే పాత్రలు తన పట్ల గౌరవాన్ని మరింత పెంపొందింపజేసేలా జాగ్రత్తపడుతున్నాడు… బోలెడు భిన్నమైన పాత్రలు, ఈ వయస్సులోనూ విరామం లేదు, కానీ ప్రేక్షకుడికి నచ్చే వైవిధ్యభరితమైన పాత్రల్ని సెలక్ట్ చేసుకుంటున్నాడు… 65 సంవత్సరాలు దాటిన ఆప్తమిత్రులు ఉన్నవారి గుండెల్ని పిండేసే సినిమా ఊంచాయి… గొప్ప నటులు ధరించారు ఆ నలుగురు ఆప్తమిత్రుల పాత్రల్ని… అమితాబ్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, డేనీ డంజోపా…
రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్లకు ఇది అరవయ్యో సినిమా అట… ఆ నలుగురితోపాటు సారిక, నీనా గుప్తా తదితరులూ నటించిన ఈ సినిమా Zee 5 ఓటీటీలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఉంది… ఆ నలుగురి నటన ప్లస్ సారిక… సినిమా చూడటమే ఓ మంచి ఫీల్… కథలో వైరాగ్యం ఉంది, ఏదో మనకే అర్థం కాని ఉద్వేగం ఉంది… అందుకే హార్ట్ టచింగ్… ఈ ఆర్ద్రతను పండించే సౌత్ సినిమా ఏముంది..? మన సౌత్ ముసలితోపులకు ఆ అభిరుచి ఎక్కడ ఏడ్చింది..?!
Share this Article