.
అప్పట్లో పెగాసస్ రచ్చ చేశాయి ప్రతిపక్షాలు… గాయిగత్తర లేపాయి, ఏమైంది..? కాలక్రమంలో అన్నీ కొట్టుకుపోయాయి… దాన్ని మించిన ట్యాపింగ్ టూల్స్ వాడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు… అంతెందుకు..? కేసీయార్ ఎన్ని ఫోన్లను ఏ రీతిలో ట్యాప్ చేయించాడో తెలిసిందే కదా… అదొక అరాచకం…
ప్రైవసీ అనేది ఓ బ్రహ్మ పదార్థం- ఓ భ్రమ పదార్థం… ఫోన్లలో బిల్ట్ ఇన్ యాప్స్ బోలెడు నిరంతరం మన డేటాను ఎవరికో షేర్ చేస్తూనే ఉన్నాయి… మన లొకేషన్లు, మన కదలికలు రికార్డు అవుతూనే ఉన్నాయి… గడప దాటితే చాలు లక్షల సీసీ కెమెరాలు మన జాడల్ని జల్లెల పడుతూనే ఉంటాయి… అంతెందుకు..? మన ఫోన్ సంభాషణలు కూడా ఎక్కడెక్కడో రికార్డు అవుతూ, వాటికి తగిన మార్కెటింగ్ యాడ్స్ మనల్ని ముంచెత్తుతూనే ఉన్నాయనే సందేహాలూ ఉన్నవే కదా…
Ads
నిన్న ఓ స్టోరీ కనిపించింది… 
అన్ని మొబైల్ ఫోన్లలో ఏ-జీపీఎస్ సాంకేతికను తప్పనిసరి చేయబోతోంది కేంద్రం… నేర విచారణ ప్రక్రియలో అది ఉపయుక్తం… ఉపగ్రహ సంకేతాల్ని, సెల్ టవర్ల సమాచారాన్ని లింక్ చేసి, మన లొకేషన్‌ను ఖచ్చితంగా చూపిస్తుంది… తద్వారా నేరగాడు ఎంత దాగాలన్నా పట్టేసుకోవడం దీని ఉద్దేశం…
మంచిదే… ఉగ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తులకు ఇది షాకింగ్ వార్త… రకరకాల పద్ధతుల్లో సమాచాారాన్ని వ్యాప్తి చేసుకుంటూ ఉగ్రచర్యలకు పాల్పడేవాళ్లను అదుపు చేయడానికి, ట్రాక్ చేయటానికి, పట్టుకోవడానికి ఇది ఉపయోగకరమే… కానీ ఏం జరుగుతుంది..? బిల్ట్ ఇన్ ఫోన్లు అనగానే, వెంటనే సోకాల్డ్ ప్రైవసీ పరిరక్షకులు మళ్లీ గత్తర రేపుతారు… మోడీ కదా, వెంటనే వెనక్కి తీసుకుంటాడు… అచ్చం సంచార్ సాథీ యాప్ విషయంలో తీసుకున్నట్టుగా…
- నిజానికి సంచార్ సాథీ వివాదం ఏమిటి..? ప్రతి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా తయారీ దశలోనే ఆ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి, అదీ డిలిట్, డిసేబుల్ చేయలేని విధంగా..! వెంటనే గగ్గోలు స్టార్ట్ చేశారు కొందరు… నిజానికి అది సైబర్ భద్రతకు, మోసాల నివారణకు మంచి మార్గం… కానీ రాజకీయం ఊరుకోదు కదా…
ప్రైవసీకి గొడ్డలిపెట్టు… తమ ఫోన్లలో ప్రభుత్వ నిఘాకు ఇదో దొంగమార్గం అంటూ ప్రతిపక్షాలు, సోకాల్డ్ గోప్యతా (Privacy) కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది… కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జారీ చేసిన ఆదేశాలు, పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాక, పౌరుల సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించే అవకాశం కల్పిస్తుందని విమర్శ…
సరే, మోడీ ప్రభుత్వం అవసరమైతే ఫోన్ వినియోగదారులు డిలిట్ చేసుకోవచ్చునని ప్రకటించింది… కానీ ఈ వివాదం ఒకింత మేలే చేసింది… సంచార్ సాథీ యాప్ పేరు దేశంలో మార్మోగింది… దీని గురించి తెలియని సామాన్య ప్రజలు సైతం, అసలు ఈ యాప్ ఏమిటి, ఇది నిజంగానే నిఘా పెడుతుందా లేదా సైబర్ నేరాల నుంచి రక్షిస్తుందా అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు…

పది రెట్లు పెరిగిన డౌన్‌లోడ్‌లు
ఈ వివాదం తలెత్తక ముందు, సంచార్ సాథీ యాప్‌ను రోజుకు సగటున సుమారు 60,000 మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకునేవారు… కానీ, ఈ వివాదంతో పెద్ద ఎత్తున చర్చలు జరిగి, వార్తల్లో ప్రముఖంగా కనిపించడం మొదలయ్యాక, పరిస్థితి పూర్తిగా మారిపోయింది…
టెలికమ్యూనికేషన్స్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం ఒక్క రోజులోనే ఈ యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య ఒక్కసారిగా పది రెట్లు పెరిగింది… కొత్త ఫోన్ల మాట తరువాత, ప్రస్తుత ఫోన్లలోనూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు జనం, స్వచ్ఛందంగా…
- ఒకే రోజులో డౌన్‌లోడ్‌ల సంఖ్య: సగటున 60,000 నుంచి దాదాపు 6 లక్షలకు చేరింది.
ఈ అనూహ్య స్పందనకు ప్రధాన కారణం, యాప్ గురించి ప్రజలకు విస్తృత అవగాహన కలగడమే… ఇది కేవలం దొంగిలించబడిన/పోయిన ఫోన్‌లను (CEIR) బ్లాక్ చేయడానికి, లేదా తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులను (TASC) గుర్తించడానికి మాత్రమే కాక, మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల గురించి ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు…
కొన్ని గణాంకాలు ఇలా… మొత్తం యాప్ డౌన్ లోడ్లు ప్రస్తుత సమాచారం మేరకు 1.4 కోట్లు… సంచార్ సాథీ పోర్టల్ సందర్శనలు 21.5 కోట్లు… బ్లాక్ చేయబడిన డివైజ్‌లు 42 లక్షలు (పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు బ్లాక్ చేయబడిన సంఖ్య) … ట్రేస్ చేయబడిన ఫోన్ల సంఖ్య 26 లక్షలు (ట్రాక్ చేయబడి, తిరిగి కనుక్కోబడిన ఫోన్ల సంఖ్య)… పౌరుల ఫిర్యాదు మేరకు తొలగించబడిన కనెక్షన్ల సంఖ్య 41 లక్షలు (తమ పేరిట ఉన్న ఫేక్ కనెక్షన్లు)…. సో, మరక మంచిదే... అవగాహనను పెంచి, స్వచ్ఛంద డౌన్ లోడ్లను పెంచింది...
Share this Article