‘పాతాళభైరవి’లోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి, ప్రజల్ని ఆకర్షించి వాళ్లకి కావలసిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న, ‘మంత్రాల డబ్బా’ నుంచి తీసి ఇస్తూ ఉంటాడు. తోటరాముడికి విశేషమైన ధనం కావాలి గనక, అ డబ్బాను లాక్కుని పారిపోతాడు. ఒక అడవిలాంటి ప్రదేశానికి పరుగెత్తి, నోటి కొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు. అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు. ఈ అడవి, చెట్లు అవుట్‌డోర్.
మాంత్రికుడు రాముడి దగ్గర కొచ్చి, ‘అందులో ఏముందిరా, అంతా మన మంత్రశక్తిలో ఉంది’ అన్నప్పుడు అక్కడి నుంచి ఇన్‌డోరు. ఇక్కడ బార్‌ట్లీ, అప్పుడు అవుడ్డోర్‌లో తీసిన ఎండ వెలుతురుని సరిగ్గా మాచ్ చేస్తూ ఫ్లోర్‌లో లైటింగ్ చేసి, తీసి తేడా తెలియనీయలేదు! ఈ సందర్భంలో కళాదర్శకుల్ని, ఎడిటర్‌నీ కూడా మనం అభినందించాలి. అవుడ్డోర్‌లో ఆ చెట్టు, పరిసరాలు ఎలా ఉన్నాయో, అలాగే సెట్టువేసి మాచ్ చేశారు.
ఎక్కడ షాట్ కట్ అయిందో తెలియనీయకుండా, ఎడిటర్ తన నైపుణ్యం చూపాడు. ఈ దృశ్యం సినిమాలో చూస్తున్నప్పుడు అవుడ్డోర్ నుంచి, ఇన్‌డోర్‌కి మారిన విషయం ఛట్టున ఎవరూ గుర్తుపట్టలేదు! అందుకే ఈ టెక్నికల్ స్థాయి అంతర్జాతీయ చిత్ర ప్రముఖుల్ని విస్మయ పరచింది. 1950-51 సంవత్సరాల మధ్య, అంటే 67 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా అంతటి ఖ్యాతిని ఆర్జించింది. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్‌ట్లీ చేసిన వెండితెర మాయాజాలానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మార్కస్ బార్‌ట్లీ వర్ధంతి ఈ సందర్భంగా ఆయన గురించి… (14 మార్చి)
Ads
‘పాతాళభైరవి’ ఆరంభంలో రాకుమారి ఉద్యాన విహారం చేస్తూ ‘తీయని ఊహలు హాయిని గొలిపే’ పాట చెలికత్తెలతో కలిసి పాడడం. ఆ వనం అవుట్‌డోర్ కాదు. పెద్ద ఫ్లోర్‌లో వేసిన సెట్టు. వెనకాల తెరమీద వున్న పెయింటింగ్స్‌తో సహా అంతా సహజంగానే కనిపిస్తుంది. మొక్కలు, వాటి ఆకులూ పువ్వులు మొదటి నుంచి సెట్లో పెడితే, దీపాల వేడి భరించలేక పూర్తిగా వాడి పోతాయి. అంచేత, మార్కస్ బార్‌ట్లీ తన లైటింగ్ అంతా పూర్తయిన తరువాత, ఆ మొక్కల తొట్టిల్ని సెట్టుకి తెప్పించేవారు. ఆకుల మీద సన్నగా నీళ్లు జల్లించేవారు. మిలమిలా మెరిసేవి. తోట మొత్తం సహజంగా, కళకళలాడుతూ కనిపించాలి. చెబితేగాని తెలియనంత సహజంగా అమిరాయి మొక్కలు, పువ్వులూ.
విజయవారు సంస్థ ఆరంభిస్తూనే మార్కస్ బార్‌ట్లీని తమ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. తమ చిత్రం ఉన్నంత కాలం ఆయన బయటి చిత్రాలు చెయ్యకూడదు. మధ్యలో విరామం వస్తే చేసుకోవచ్చు. ‘షావుకారు’, ‘పాతాళబైరవి’, ‘పెళ్లి చేసిచూడు’, ‘చంద్రహారం’, ‘మిస్సమ్మ’ మొదలైనవాటన్నింటికి బార్‌ట్లీ ఛాయాగ్రాహణ దర్శకుడు. మధ్యలో కె.వి.రెడ్డి వాహినికి ‘పెద్దమనుషులు’ తీశారు. దానికి కొండారెడ్డి ఛాయాగ్రాహకుడు. కొండారెడ్డి బార్‌ట్లీ దగ్గరే శిక్షణ పొందారు. బార్‌ట్లీ, కెమెరాలు, లెన్స్‌లూ అన్నీ సర్వీస్ చేసేవారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఆ సర్వీసింగ్ వృత్తి చేపట్టారు.
‘చంద్రహారం’ కె.కామేశ్వరరావు మొదటి చిత్రం. 1954లో విడుదలైంది. ఇది జానపదం గనక, బార్‌ట్లీ విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ‘చంద్రుడు – కలవలు’ నృత్యంలో బార్‌ట్లీ పనితనం ప్రముఖంగా కనిపిస్తుంది. అది అద్భుతంగా ఉందని బీబీసీ వారు, ఆ నాట్యాన్ని మాత్రం టెలికాస్ట్ చేశారు. అప్పటికి మనకి టీవీ అంటే అసలు తెలీదు. ఆ నాట్యంలో అక్కడక్కడ కొంతభాగం అల్లుకుపోయినట్టు, కనిపించీ కనిపించనట్టు ఉంటుంది. తరువాత ఎప్పుడో నేను బార్‌ట్లీని కలిసి అడిగితే… ‘‘కెమేరా లెన్స్ మీద కొద్దిగా వాజ్‌లైన్ రాశానంతే. ఇదొక ప్రయోగం…’’ అని చెప్పారు.
ఈ సినిమాలోని రాత్రి దృశ్యాలు ఎంతో సహజంగా ఉంటాయి. యస్.వి.రంగారావు ‘ఏనాడు మొదలెడితివో ఓ విధీ’ పాట పాడే దృశ్యంలోని లైటింగ్ గమనించండి. విజయవారి మిస్సమ్మ (1955)లో వెన్నెల పాటలున్నాయి. అఖిల భారత దేశం కీర్తించిన ‘మాయాబజార్’ (1957)లో వచ్చింది. రెండు భాషల చిత్రం. ఈ నిర్మాణంలో అందరూ భాగస్తులే. దర్శకుడు, నిర్మాతలు, రచయిత, ఛాయాగ్రాహకుడు, కళాదర్శకులు, సంగీతదర్శకుడూ అందరూ ఎవరికి వారే!
అందరూ చెప్పుకునే ‘లాహిరి లాహిరి’ పాట, బార్‌ట్లీ ప్రతిభకి ఇంకో నిదర్శనం. పాటంతా వెన్నెల మయమైనా, ఏదీ రాత్రివేళ షూట్ చేయలేదు. సినిమా థియేటర్లో ముందు వరుసలో కూచునే సినిమా ప్రేక్షకుల ముఖాల మీద ప్రతిబింబించే వెన్నెల, బార్‌ట్లీ వెన్నెల. ఈ పాట ఒకే చోట తీసిన పాట కాదు. అవుట్‌డోర్, ఇన్‌డోర్, బ్యాక్ ప్రొజెక్షన్ అలా అన్నీ ఉన్నాయి. తెల్లగా పూర్ణచంద్రుడు కనిపిస్తూ రెల్లు దుబ్బులతో మెరిసే షాట్లన్నీ స్టూడియో ఫ్లోర్. బార్‌ట్లీ రెల్లు పొదల నుంచి, తెల్లని తీగల్లాంటి ఆకులు తెప్పించారు. కొన్ని కృతిమమైనవి తయారుచేయించారు. వాటి మీద దీపాల కాంతి పడితే వెన్నెల ప్రతిఫలిస్తుందని ఆయన సిద్ధాంతం. నది గట్టు మీద కనిపించే రెల్లుపొదలు వెన్నెలకాంతికి మెరిసిపోతూ ఉంటాయి. కొన్ని లాంగ్‌షాట్లు, మద్రాసులోని అడయార్ నదిలో తీశారు.
పగలు ‘డే ఫర్ లైటింగ్’ విధానంలో. ఎండలో తీసిన నది షాట్సు మీద అలలు, వెన్నెల అలలు అయ్యాయన్నమాట. వెనకాల నది, వెన్నెల ఉండి క్లోజప్స్ వచ్చిన షాట్లన్నీ బాక్ ప్రొజెక్షన్. అంటే, తెరమీద (స్టూడియోలో) బ్యాక్‌గ్రౌండ్ షాట్లు ప్రొజెక్ట్ చేసి, తెర ముందు నటీనటుల్ని పడవలో కూచోబెట్టి చిత్రీకరించడం. ఇలా ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో తీసిన షాట్లలోని వెన్నెల మాత్రం ఒకే తీరులో ఉండి ప్రేక్షకుల్ని మైమరపిస్తుంది. ఎడిటర్ బాధ్యత కూడా చాలా ఉంటుంది. బ్యాక్ ప్రొజెక్షన్ షాట్లు ఒకటి రెండు సరిగా రాలేదని, తరువాత మళ్లీ రిటేక్ చేసినట్టు ఒక సందర్భంలో సావిత్రి చెప్పారు. ఇలాంటివి సొంత స్టూడియో ఉన్నవాళ్లకే సుసాధ్యమవుతుంది. అంతేకాదు, పాటకి ముందు అభిమన్యుడు, శశిరేఖ అంతఃపురం దగ్గర ఉన్నప్పుడు కూడా అదే వెన్నెల.
ఇంక ట్రిక్‌షాట్స్ గురించి చెప్పనే అక్కర్లేదు. ‘వివాహ భోజనంబు’ పాటలో ఒకే షాటులో ఘటోత్కచుడి ఆకారం పెద్దదవుతుంది. దాంతో పాత్రలు, తక్కిన వస్తువులూ చిన్నవి అవుతాయి. ఆకారానికి తగ్గట్టుగా, గద ఉండదు గనక చిన్నగద చేయించారు. పాత్రలూ చిన్నవి చేయించారు. పదార్థాలున్న పాత్రలు, పళ్లాలూ ట్రిక్ షాట్సులో ఘటోత్కచుడి ముందుకు వచ్చేస్తాయి. గింబళి, గిల్పం షాట్సులోని ‘మాయ’ నిజంగా మాయే! శర్మ, శాస్త్రి కూచున్న గింబళి లోపలికి చుట్టుకోవడం పెద్ద ప్రశ్న! ఆ షాటు ఎలా తీశారని, అప్పటి టెక్నిషియన్స్‌ని అడిగితే, తెలియదన్నారు. షాటులో ఉన్న రామలింగయ్యగారు కూడా, ‘అబ్బే గమనించలేదు, గుర్తులేదు’ అన్నారు.
బజార్‌లో చెప్పులు, పాత్రలు బొమ్మల దుకాణాలన్నీ ట్రిక్స్‌లో ఏర్పడతాయి. ఆ షాట్సు బార్‌ట్లీకి సహన పరీక్ష. ఒకటీ ఒకటీ పేర్చుకుంటూ, ఒక్కో షాటూ తియ్యాలి. ఇలా, ఎంతో శ్రమపడి, శ్రద్ధ చూపించారు గనకనే, ‘మాయాబజార్’ ఇన్నేళ్లయినా ఇంకా హర్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ‘జగదేకవీరునికథ’లో ఐదుగురు ఒకేషాటులో ఉండి ‘శివశంకరీ’ పాడే సన్నివేశం బార్‌ట్లీ వైదుష్యానికి నిదర్శనం,
‘ఐదుగురు, వేరు వేరుగా వచ్చిన రామారావులు కాబోలు’ అని చాలామందిని భ్రాంతిలో పడేసిన ఆ చిత్రీకరణకి ఎన్ని రోజులు పట్టిందో! దర్శకుడికీ, ఛాయాగ్రాహకుడికీ కావలసినంత ఓర్పు, నిదానం… ఆ నటుడికి కూడా కావాలి. అంగుళం తప్పితే ఫలితం రాదు. ఇంకా ఈ చిత్రంలో మాచింగ్ షాట్సు, మాట్ షాట్సు ఉన్నాయి. ఏది చేసినా, ఏది తీసినా మార్కస్ బార్‌ట్లీ నిపుణత్వం కనిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా ఆనాడు తెచ్చుకున్న ఖ్యాతిలో కొంతభాగం దక్కించుకున్న బార్‌ట్లీ సినిమా వైభవానికి ఒక వరం!
— రావి కొండలరావు… (సేకరణ :: Narayanamurthy Kottur )
Share this Article