Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…

October 10, 2021 by M S R

ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు ఆ స్వరంకన్నా అధికంగా ఆ సంగీతం మిమ్మల్ని అలా ఓ ట్రాన్స్‌లోకి తీసుకుపోతుంది… ముందుగా ఈ పాట వినండి, తరువాత మాట్లాడుకుందాం…

తాజ్‌మహల్ కట్టిన జహాపనాను స్మరిస్తూ…. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా అంటూ సాగుతుంది పాట… ఎంఎస్ రామారావు పాడిన పాట ఇది… నీరాజనం అనే చిత్రం కోసం..! తెలుగులో హనుమాన్ చాలీసా, సుందరకాండ రాసి పాడిన ఆయన మీద అప్పటికే ఓ అభిమానం ఉండేది… ఈ పాటతో అది మరింత పెరిగింది… మనం చెప్పుకునేది నిజానికి ఆయన గురించి కాదు… అచ్చు ఇలాంటి గొంతే, ఇలాంటి ట్యూనే… ప్రీతమ్ ఆన్ మిలో అనే పాట 1945లో విడుదలైంది… అదే సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్ మళ్లీ 1989లో… పాడించాడు… ఆశ్చర్యపోతాం… దిగుదిగునాగ, చల్లగాలేస్తోంది, అమ్మడూకుమ్ముడూ వంటి పాటలకు అలవాటుపడిన వాళ్లకు అంతత్వరగా ఇలాంటి పాటలు జీర్ణం కాకపోవచ్చు, పులిహోర, దధ్యోజనం లాగా అనిపించవచ్చుగాక… కానీ ఆ మధుర పరిమళం కాసేపు మనల్ని వెంటాడుతేనే ఉంటుంది ఆ పాట విన్నాక… ఆ పాత పాట ఓసారి వినండి…

Ads

1926… లాహోర్‌లో పుట్టాడు ఓపీ నయ్యర్… అరవై, యాభైలలో బాలీవుడ్‌లో రౌడీ మ్యూజిక్ డైరెక్టర్… ఛాందసాల్ని తెంచేసి, హిందీ సినిమా సంగీతానికి ఓ కొత్త దిశను చూపించాడు… అందరూ డాక్టర్లే ఉండే కుటుంబం… మన సికింద్రాబాదులో కూడా ఆయన సోదరుడు ఆర్మీ డాక్టర్‌గా చేశాడు… హిందీలో ఓ ఊపు ఊపినా సరే, ఆయన లతా మంగేష్కర్‌తో ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడించలేదు… కొన్నింటికి కారణాలను తవ్వకూడదు… ఆశా భోస్లేతో ఆయన ప్రేమ బంధం ఎట్సెట్రా… అది అంతే… ఆయన నిర్మొహమాటి… అప్పటిదాకా బెంగాలీ వాసనల్ని నింపుకున్న హిందీ పాటల్ని మొరటుగానైనా బయటికి లాక్కొచ్చి తనదైన ఓ కొత్త రుచిని అద్దాడాయన… నయ్యర్ అనగానే వినిపించేది గుర్రపు డెక్కల సంగీతం… నిజానికి సంగీతపరంగా ఆయన కృషి తక్కువే… ఓ మోస్తరు నాణ్యతే… తనంతట తానే హార్మోనియం పట్టుకుని వాయించడం నేర్చుకున్నాడు, గురువెవరూ లేరు… అయితేనేం, పదిమందికీ పాఠాలు నేర్పేంత సాధన చేశాడు… అయితేనేం, ఈరోజుకూ పదే పదే వెంటాడే ట్యూన్లు ఆయనవి… ఏమిటయ్యా ఇది అనడిగితే… బుద్ధుడూ, ఏసుక్రీస్తు ఏ బళ్లో చదువుకున్నారు అని ఎదురు ప్రశ్నించేవాడు గడుసుగా… మొదట్లో జలంధర్ రేడియోలో గాయకుడు… తరువాత మెల్లిమెల్లిగా సినిమాల్లోకి వచ్చిపడ్డాడు… పాపులారిటీ వచ్చాక ఇక అంతే… పాటలు, సంగీతం చేశాడంటే ఆ సినిమా గురించే మరిచిపోయేవాడు… చోప్డాలు, శాంతారామ్‌లనూ పట్టించుకోలేదు ఓ దశలో…

nayyar with spbalu

హిందీ పాత గీతాల దాకా ఎందుకు..? తెలుగులో ఆయన చేసిన నీరాజనం సినిమా ఒక్కటి చాలు, ఆయనేమిటో చెప్పడానికి…! జనాన్ని కనెక్ట్ కావడం ఏమిటో చూపించాడు… నయ్యర్ అనగానే గుర్తొచ్చేది ఆ సినిమాయే… అందులో ఒక్క పాట తీసుకొండి… నిన్ను చూడక నేనుండలేను… అనే పాట… సినారె రాసినా సరే, అందులో పెద్ద సాహిత్యమేమీ ఉండదు… నిన్ను చూడక ఉండలేను, ఈ జన్మలో, మరుజన్మలో, ఏ జన్మలోనైనా అంటూ సాదాసీదాగా సాగిపోతుంది… పైగా జగం సెలయేరుగా ఊగింది అనే చిత్రభావనల్ని, హృదయంగమం వంటి విచిత్ర పదాల్ని రాస్తాడు… కానీ ఆ ట్యూన్ ప్లస్ జానకి, బాలుల స్వరమాధుర్యం మనల్ని ఎటో తీసుకుపోతుంది… అందులోని ప్రతి పాటా అంతే… ఘల్లుఘల్లున, మనసొక మధుకలశం, ప్రేమ వెలసింది, ఊహల ఊయలలో, నా ప్రేమకే సెలవు… అన్నీ… తనను ఇతర దర్శకులు ఎందుకు వాడుకోలేకపోయారో తెలియదు… ఐనా మనకు చక్రవర్తి వంటి కొట్టుడు అలవాటయ్యాక నయ్యర్లు ఎలా ఆనతారు..!!

nayyar

చివరగా…… తన మెంటాలిటీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు… వయస్సు మళ్లాక సంగీతాన్ని విడిచిపెట్టేశాడు… కొత్త నీరు వస్తోందని గుర్తించి, హార్మోనియం పక్కన పడేశాడు… హోమియో వైద్యం నేర్చుకుని జనానికి ఉచిత వైద్యం చేసేవాడు… డబ్బు అయిపోయింది… భార్యాపిల్లలతో కూడా చెడిపోయింది… కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ఠాణేకు మకాం మార్చేశాడు… ఓరోజు ఓ పబ్లిక్ బూతుకు వెళ్లి, దాన్ని నిర్వహించే రాణి నఖ్వా అనే ఓనర్‌తో ‘‘నేను తలదాచుకోవడానికి ఏమైనా చోటు దొరుకుతుందా’’ అని అడుక్కున్నాడు… మొదట్లో నయ్యర్‌ను గుర్తుపట్టని ఆమె తరువాత తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చింది… అంత పాపులర్ సంగీత దర్శకుడు మరణిస్తే… ఒక్కరంటే ఒక్క సినిమా సెలబ్రిటీ కూడా రాలేదు… చివరకు ఆ ఆశా భోస్లే కూడా..!! ఒక్క శరద్ పవార్ తప్ప..!! (ఆయన్ని స్మరించుకోవడానికి ఇప్పుడేమీ సందర్భం లేదు, కానీ ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో పాట వింటున్నప్పుడు ఆయన కథ కూడా గుర్తొచ్చి…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions