.
ఏ మీడియాకైనా ప్రకటనలే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు లేకపోతే మరుక్షణం ఆ మీడియా ఊపిరి ఆగిపోయినట్లే. కంటికి కాటుక అందం. కంటిని మించిన కాటుక వికారం. ప్రస్తుతం మీడియాలో ప్రకటనలు కంటిని మించిన, ముంచిన కాటుకలా పాఠకుల, శ్రోతల, ప్రేక్షకుల సహనానికి పరీక్షలా తయారయ్యాయని ఒక సర్వేలో తేలింది.
భాష ఏదయినా భాషే. మాట్లాడే భాషకంటే రాసే భాష కొంచెం ఫార్మల్ గా, కర్త కర్మ క్రియా పదాలు సరయిన అన్వయంతో ఉండాలి. మామూలుగా రాసే భాషతో పోలిస్తే ప్రకటనల్లో భాష ఇంకా అందంగా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారమివ్వాలి. పాఠకుడిని ఆకట్టుకోవాలి. కళ్లను కట్టి పడేసేలా డిజైన్ ఉండాలి.
Ads
యాడ్ చూశాక ఆ వస్తువును తప్పనిసరిగా కొనాలి అనిపించేలా ఆ యాడ్ లో భాష, భావం, డిస్ ప్లే ఉండాలి.
కంపెనీల నిర్లక్ష్యమో, యాడ్ ఏజెన్సీల చేతగానితనమో, అనువాదకుల అజ్ఞానమో లేక వీటన్నిటి కలగలుపో తెలియదు కానీ-ఇప్పుడొస్తున్న ప్రకటనలు చూడ్డానికే తప్ప చదవడానికి పనికి రావు.
సాధారణంగా ప్రకటనలు ఎవరూ చదవరు. ఒకవేళ సాహసించి ఎవరయినా చదివినా అర్థం కావు. అలా అర్థం కాకుండా రాయడం, యాడ్ ను ఇనుప గుగ్గిళ్లతో దుర్భేద్యమయిన విషయంగా తయారు చేయడం దానికదిగా ఒక విద్య.
కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మంది మనసు గెలవాలని చేసే ప్రకటనల్లో అనువధ జరిగి పాఠకులకు కడుపులో ఎలా దేవినట్లు ఉంటుందో ప్రకటనకర్తలకు తెలియదు. లేక తెలిసినా పగబట్టి పాఠకులను హింసిస్తూ అజ్ఞానానందంలో మునిగితేలుతున్నారేమో తెలియదు.
ఇంతగా భాష, భావం విషయంలో పగబట్టి…వెంటపడే ప్రకటనలను ఒకసారి వినడానికి, చూడ్డానికే కష్టంగా ఉంటే… అవే పదే పదే వెంటపడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. భారతదేశంలో పత్రికలు, రేడియో, కేబుల్ టీవీ, డిటీహెచ్, ఓటీటీ, డిజిటల్ అన్ని మాధ్యమాల్లో ప్రకటనలతో తలనొప్పి వస్తోందని 70 శాతం మంది తమ ఇబ్బదులను ఏకరువు పెట్టారు.
(మిగతా ముప్పయ్ శాతం మందికి ఇబ్బంది లేదని అర్థం చేసుకునేరు- పొరపాటున. యాడ్స్ దెబ్బకు వారి బాధను వారు సరిగ్గా చెప్పుకునే స్థితిలో కూడా లేనివారై ఉంటారు మిగతా ముప్పయ్ శాతం మంది!)
# టీవీలో యాడ్ రాగానే ఛానెల్ మార్చడం అలవాటు అయ్యింది. దాంతో ఏ ఛానెల్ పెట్టినా ఆ సమయంలో యాడ్సే వచ్చేలా టీ వీలవారు కూడబలుక్కుని ప్లే చేస్తున్నారు.
# అప్పటిదాకా చెవికోసుకున్నా వినపడని కార్యక్రమం, యాడ్ రాగానే చెవుల్లో రక్తం కారేట్లు ఆటోమేటిగ్గా సౌండ్ పెరుగుతుంది. అంటే టీవీకి యాడే ముఖ్యం తప్ప… ప్రేక్షకుల చెవి భద్రత కాదని చెప్పకనే చెబుతున్నారు.
# పదే పదే యాడ్ ను పబ్లిష్/ప్లే చేస్తూ పాఠకుల/ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోవాలన్న కంపెనీల తపన మీడియావారికి కాసులు కురిపిస్తోంది కానీ పాఠకులకు, ప్రేక్షకులకు మాత్రం ఇబ్బందిగా ఉంది. దాంతో ప్రకటనలు లేని ఛానెళ్లు, కంటెంట్, మాధ్యమాలను వెతుక్కుంటున్నారు.
# బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ముసురుకుంటాయి. ఎక్కడ ఎక్కువ రేటింగ్ ఉంటే అక్కడ యాడ్స్ ముసురుకుంటాయి. ఏ మీడియాకు ఎక్కువ ఆదరణ ఉంటే ప్రకటనలు అక్కడ వెల్లువెత్తుతాయి.
# జెఈఈ ఫలితాలొచ్చినప్పుడు పేపర్లలో, టీవీల్లో, రేడియోల్లో ఒకటి ఒకటిగా వేనవేలుగా ప్రతిధ్వనిస్తూ వార్తలన్నీ మాయమై… ప్రకటనలే ఉన్నా మనం చూడడం లేదా? చదవడం లేదా? వినడం లేదా? కాకపోతే ఆ రోజు రోజువారీకంటే ఒక డబ్బా జండూబామ్ ఎక్కువ వాడతాం- అంతే.
# యాడ్స్ వల్ల ఇబ్బందిగా ఫీలైనవారెంతమంది అని సర్వే చేసినవారే… యాడ్స్ వల్ల అనారోగ్యం పాలైనవారెంతమంది? అర్థంలేని యాడ్స్ కు అర్థం ఉందని అనవసరంగా అర్థం వెతుక్కుంటూ పిచ్చివారైనవారెంతమంది? అని కూడా సమగ్రంగా సర్వే చేసి ఉంటే… ఈ సర్వేకు సార్థకత చేకూరి ఉండేది!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article