Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన…

March 6, 2025 by M S R

.

నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను…

బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద రెడీగా ఉంది… కిటకిట… సీటు కాదు కదా, బోగీలోకి ఎక్కే చాన్స్ కూడా కనిపించడం లేదు… కానీ తప్పదు, ఎలాగైనా ఇంటికి చేరాలి… పెద్దగా ఆలోచించకుండానే ఓ జనరల్ స్లీపర్ బోగీలోకి ఎలాగోలా ఎక్కాను… టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు చూద్దాం, అవసరమైతే జరిమానా కడదాం… సరే, ఏదయితే అది జరగనీ… 

Ads

ఆ రద్దీలో నన్ను నేను తోసుకుంటూ… లోపలికి కాస్త దూరాను… ఓ బెర్త్ మీద ఓ బక్కపల్చటి పెద్దాయన నడుం వాల్చి పడుకుని ఉన్నాడు అప్పటికే… అయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కాస్త ఈ మూలకు సర్దుకుంటా, ప్లీజ్ అన్నాను…

ఆయన నన్నోసారి చిరునవ్వుతో ఎగాదిగా చూసి సరే, పర్లేదు అన్నాడు, తను కాళ్లు ముడుచుకుని, పొరపాటున కాళ్లు తగిలితే నన్ను తప్పుపట్టకు తమ్ముడూ అంటూ మళ్లీ కళ్లు మూసుకున్నాడు…

హమ్మయ్య, బ్యాగును సీటు కిందకు తోసేశాను, ఆ సీటు మీద సర్దుకున్నాను… అటూఇటూ చూస్తున్నాను… అందరివీ ఆ పాట్లే… రణగొణధ్వనులు… కాసేపటికి రైలు బయల్దేరి వేగం పుంజుకుంది… మెల్లిమెల్లిగా అందరూ సర్దుకున్నారు… లెట్రిన్, డోర్ నడుమ కొందరు, సీట్ల నడుమ కొందరు, కింద దుప్పటి పర్చుకుని కొందరు…

ఫుడ్ ప్యాకెట్లు విప్పారు, కబుర్లు చెబుతూ, ప్లేట్లలో సర్దుతూ ఏవేవో తినేస్తున్నారు… ఆశ్చర్యం వేసింది, పావుగంటలో అంతా సర్దుకున్నారు… బోగీ అంతా రకరకాల ఆహార పరిమళాలు… పులిహోర, పెరుగన్నం, పూరీలు, చపాతీలు, సాంబార్ వడ… వావ్, ఫుడ్ బోగీ…

grand trunk

నన్ను కూర్చోనిచ్చిన ఆ పెద్దమనిషి వైపు తిరిగి చూశాను, అందరినీ చూస్తున్నాడు… పరిచయం చేసుకున్నాను… నాపేరు అలోక్, నేను ఇస్రోలో సైంటిస్టును, మామూలుగా అయితే ఏసీలో తప్ప ప్రయాణం చేయను, కానీ అర్జెంటు ప్రయాణం, ఇలా తప్పలేదు’’ అన్నాను…

ఆయన ఓసారి ఆశ్చర్యంగా చూసి, వావ్, ఇస్రో సైంటిస్టువా..? నా పేరు జగ్‌మోహన్‌రావు, వరంగల్ వెళ్తున్నాను, దాని దగ్గరలో ఓ ఊరు మాది… ప్రతి శనివారం వెళ్తుంటానులే… అన్నాడు కాస్త మర్యాదపూర్వకంగా నవ్వుతూ…

బ్యాగు నుంచి టిఫిన్ బాక్సు తీశాడు, ఇంట్లో చేశారు ఏదో అల్పాహారం, పర్లేదా, తిను అని ఆఫర్ చేశాడు… సర్వపిండి… నా ఆంధ్రా మిత్రుల ద్వారా తెలిసిన రెసిపీయే… టెంప్ట్ చేస్తున్నది కానీ, మర్యాదగా వద్దని చెప్పి, నా బ్యాగు తీసి, ఓ శాండ్‌విచ్ తీసుకుని, నమలసాగాను… 

జగ్‌మోహన్‌రావు… ఈ పేరు ఎప్పుడో బాగా విన్నాను, ఎవరబ్బా…. అడిగితే బాగుండదు, ఐనా ఏడెనిమిది గంటల ప్రయాణానికి ఈ పరిచయాలు దేనికిలే అనుకున్నాను… ఈలోపు బోగీలో అందరూ ఆహారయజ్ఞాన్ని పూర్తిచేశారు… కబుర్లు తగ్గాయి, పిల్లల ఏడుపులు, అరుపులు, గదమాయింపులు తగ్గాయి…

కాసేపటికి సద్దుమణిగి నిద్రలోకి జారుకున్నారు అందరూ… నేను ఫోన్ తీసి, ఓ గేమ్ ఆడసాగాను, నిద్ర రావడం లేదు, కూర్చుని తెల్లారేదాకా గడపాలి… రైలు వేగంగా వెళ్తోంది…

అకస్మాత్తుగా నా అపోజిట్ బెర్త్‌లో పడుకున్న ఓ పెద్దాయన నొప్పితో మూలుగుతూ అటూఇటూ కదులుతున్నాడు… నోటి నుంచి నురగ… వాళ్ల ఫ్యామిలీని లేపాను… లేచారు…

ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు, నీళ్లు తాపిస్తున్నారు… మెలికలు తిరుగుతున్నాడు బాధతో… ఎవరైనా బోగీలో డాక్టర్లు ఉన్నారా అని అరిచాను… చైన్ లాగుదామా అని ఆలోచిస్తున్నాను… ఆ ఫ్యామిలీ వాళ్లు ఏడుస్తున్నారు… 

 doctor

ఓ సాధారణ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే డాక్టర్లు ఎవరుంటారు..? నిస్సహాయంగా ఉంది పరిస్థితి… ఈ హడావుడితో నిద్రలేచిన మన జగ్‌మోహన్ అటూఇటూ చూశాడు… పేషెంట్‌ను చూశాడు… ఏమైందీ అనడిగాడు… కనీసం జవాబు చెప్పే స్థితి కూడా లేదక్కడ…

ఆయన సీటు కింద తన బ్యాగును బయటికి లాగాడు… ఓపెన్ చేశాడు… స్టెతస్కోప్ తీశాడు… బోగీ అంతా నిశ్శబ్దం… హమ్మయ్య, ఓ డాక్టర్ ఉన్నాడు… చూస్తున్నాడు… ఇక పర్లేదు…

తను రోగి గుండె మీద పెట్టి పల్స్ విన్నాడు… విషయం అర్థమైంది… నొసలు ముడిపడింది… ఓ క్షణం ఆలోచించాడు… బ్యాగులో నుంచి ఓ సూది తీశాడు, సిరంజీలోకి ఎక్కించాడు… నేరుగా రోగి ఛాతీలోకి గుచ్చాడు… ఛాతీని ఒత్తసాగాడు…

రోగి మూతి నురగను తుడిచి, ఓ దస్తీ కప్పి, కృత్రిమ శ్వాస అందించసాగాడు… సీపీఆర్ అంటారు ఈ ప్రక్రియను, నాకు బ్రహ్మాండంగా తెలుసు… కాసేపటికి రోగి నొప్పి తగ్గింది… 

బ్యాగులో ఉన్న కొన్ని గోళీలు ఆ రోగి కొడుక్కి ఇచ్చాడు… ‘‘భయపడకండి, ఈయనకు సివియర్ హార్ట్ స్ట్రోక్, సమయానికి నేను ఆ సూది ఇచ్చాను కాబట్టి బచాయించాడు… ఐనా ప్రమాదం పూర్తిగా పోలేదు…

ఈ గోళీలు వేస్తుండండి, నేను ప్రిస్క్రిప్షన్ రాస్తాను, వచ్చే స్టేషన్లో దిగిపొండి, ఈ మందులు తీసుకొండి, మంచి హాస్పిటల్ చూసి చేర్పించండి…’’ అన్నాడు… తన లెటర్ హెడ్ తీశాడు… ఆ రోగి కొడుకు ‘‘మీరెవరు సార్’’ అన్నాడు భయం, గౌరవం, భక్తి, కృతజ్ఞత అన్నీ ఉన్నాయి ఆ ప్రశ్నలో…

‘‘తమ్ముడూ, నేను డాక్టర్‌నే…’’ అంటూ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు… అనుకోకుండా ఆ లెటర్ హెడ్ మీద అక్షరాలు చదివి నా కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి… జగ్‌మోహన్… చెన్నై అపోలోలో ఫేమస్ కార్డియాలజిస్టు ఆయన…

అకస్మాత్తుగా నాకు నా అనుభవమే గుర్తొచ్చింది… కొద్దిరోజుల క్రితం మా తండ్రిని అపోలోలో చెకప్ కోసం తీసుకెళ్లినప్పుడు ఈయన పేరు విన్నాను… మోస్ట్ సీనియర్… అపాయింట్‌మెంట్ కావాలంటే నెలల కొద్దీ వేచి ఉండాలి… అలాంటిది ఆయన ఈ స్లీపర్ కోచులో… ఓ సాదాసీదా ప్రయాణికుడిలాగా… ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను… 

apollo

ఇంతకుముందే కదా… ‘‘నేను సైంటిస్టును, ఏసీలో తప్ప అసలు ప్రయాణమే చేయను అని గప్పాలు కొట్టింది… ఈయన ముందు నేనెంత..?’’ సిగ్గనిపించింది… ఆయన వైపు చూడలేకపోయాను… తరువాత స్టేషన్ వచ్చింది… రోగి, ఆయన కుటుంబం దిగిపోయింది, రోగి కొడుకు డాక్టర్ కాళ్ల మీద పడ్డాడు ఏడుస్తూ…

టీటీ సాయం వల్ల సమయానికి మెడికల్ టీం వచ్చింది అక్కడికి, వాళ్లు వెళ్లిపోయారు… రైలు మళ్లీ కదిలింది… కాస్త ధైర్యం తెచ్చుకుని… మీరేమిటీ..? ఇలా ఈ సాదా స్లీపర్ కోచులో..? అనడిగాను…

‘‘డియర్ బ్రదర్, నేను నా యంగ్ ఏజ్ వరకూ నా ఊళ్లోనే జీవించాను… డాక్టర్ అనేవాడే కనిపించడు… ప్రతివారం మా ఊరు వెళ్తాను… శని, ఆదివారాలు అక్కడే… ఇలాంటి రైల్వే సాధారణ బోగీల్లో చిన్న గోళీ కూడా దొరకదు…

ఎప్పుడైమైనా అవసరం వచ్చిపడినా పట్టించుకునేవాడు ఉండడు… ఎమర్జెన్సీ మందులు ఎప్పుడూ బ్యాగులో ఉంచుకుంటాను… పది మందికి నా వైద్యం ప్రాణాలు ఆ అత్యవసర స్థితిలో గనుక కాపాడగలిగితే… అంతకుమించి నా చదువుకు సార్థకత ఏమిటి..? అన్నాడు…

వరంగల్ రాగానే, చిరునవ్వుతో బైబై చెప్పి దిగిపోయాడు… బెర్త్ మొత్తం ఖాళీ… ఒకసారి బెర్తు మొత్తం ఆక్రమిస్తూ పడుకున్నాను… ఆ గొప్ప డాక్టర్ పరిచయం తాలూకు పరిమళం మొత్తం కమ్మేసింది నన్ను… వీసమెత్తు గర్వం లేకుండా, తనెవరో చెప్పకుండా… ఓ అనామక, అపరిచిత రోగికి ఆ అర్ధరాత్రి ప్రాణం పోసిన ఆయన్ని అలా చూడటం, ఆ జ్ఞాపకం నాకింకా ఆశ్చర్యంగానే ఉంది…!!

((ఏదో వాట్సప్ గ్రూపులో కనిపించిన ఇంగ్లిషు పోస్టుకు ఇది తెలుగు అనువాదం… నిజం కాదూ అని మీరు అనుకునే పక్షంలో… ఓ కథలాగా స్వీకరించండి, పర్లేదు… తులమెత్తు పాజిటివిటీ కూడా తగ్గిపోదు))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions