ఉద్యమాలు మాకు కొత్త కాదు…. ఇదీ హరీష్ రావు స్పందన కవిత అరెస్టు మీద..! రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ… ఎందుకు..? దేనికి ఉద్యమం..? అరెస్టు అక్రమం, అనైతికం అనే ముద్రలు దేనికి…? అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఏదో ఆశయసాధనకు ఉద్యమిస్తున్నట్టు, జైలుకు పోతున్నట్టు ఆ పిడికిలి ఎత్తి అభివాదాలు దేనికి..? ఆ విక్టరీ సింబల్స్ దేనికి..?
అవినీతి కేసులో అరెస్టయితే… తెలంగాణ జనం ఎందుకు ఆందోళనలు చేయాలి..? అవినీతిలో కూరుకుపోవడానికా తెలంగాణ సమాజం ఆ కుటుంబాన్ని అందలాలు ఎక్కించింది..? పైగా కేసు విషయం బయటపడ్డాక ఆమె హఠాత్తుగా ఆదర్శాల కోసం, ఆశయాల కోసం పోరాడే ధీరవనిత అయిపోయింది… వుమెన్ రిజర్వేషన్ల నుంచి ఫూలే విగ్రహం దాకా… తండ్రి మూసేసిన ఆ ధర్నాచౌకే మళ్లీ ఆమెకు గత్యంతరమైంది…
సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్టు చేశారు, ట్రాన్సిట్ పర్మిషన్ లేదు అంటున్నారు… దర్యాప్తు సంస్థలు మహిళలను విచారణకు పిలవొచ్చా అనేది కదా కేసు… పైగా ఈడీ జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ, రాష్ట్రాల అడ్డుగోడలు దానికి ఏముంటాయి ట్రాన్సిల్ పర్మిషన్ తీసుకోవడానికి..? ఇది PMLA కేసు అని ఈడీ చెబుతోంది కదా… సరే, ఆమె ఆ కేసులో లేకపోతే, చార్జి షీటులో ఆమె పేరు లేకపోతే, స్కాం ఆధారాలు లేకపోతే, అనుమానితుల జాబితాలో ఆమె లేకపోతే ఆ అరెస్టు అక్రమం… అన్నీ ఉన్నప్పుడు అక్రమం ఎలా అవుతుంది.,? అనైతికం ఎలా అవుతుంది..?
Ads
తెలంగాణ తలవంచదు అని అప్పట్లో కవిత స్పందించేది ఈ కేసుపై… అణిచివేతలకు తెలంగాణ తలవంచదు నిజమే, కానీ చట్టానికి ఎవరైనా తలవంచాలి… సో, వ్యక్తిగత అవినీతి కేసుల్ని తెలంగాణ సమాజానికి రుద్దడం దేనికి..? నిజానికి కవిత అరెస్టు పట్ల బీఆర్ఎస్ ఊహించినంత నెగెటివ్ స్పందనేమీ తెలంగాణ సొసైటీ నుంచి రాలేదు… తెలంగాణ ఆమె అరెస్టును లైట్ తీసుకుంది… చివరకు సోషల్ మీడియా కూడా పెద్ద సానుభూతిని చూపించలేదు… ఇక ఈ అరెస్టు విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటో అర్థం కాదు.,.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమెను అరెస్టు చేయలేదు… ఫలితంగా బీఆర్ఎస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ విజయవంతంగా ప్రచారం చేసింది, జనానికి ఎక్కించింది… దీని కారణంగా బీఆర్ఎస్ మీద ప్రజావ్యతిరేకత ప్రభావం బీజేపీ మీద కూడా పడి, ఇంకా రావల్సిన సీట్లు కొన్ని రాకుండాపోయాయి… ఇప్పుడు అరెస్టు చేయడం ద్వారా బీఆర్ఎస్‌తో మాకేమీ లోపాయికారీతనం లేదని చెప్పదలిచిందా బీజేపీ..? లేక మరో కారణమా…
కవిత అరెస్టు వల్ల బీఆర్ఎస్‌కు ఎంతో కొంత సానుభూతి వచ్చి, కాంగ్రెస్‌కు పడాల్సిన వోట్లు బీఆర్ఎస్ వైపు మళ్లి, కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయనే లోతైన ఎత్తుగడ ఏమైనా ఉందా..? అలా ఆలోచిస్తే బీజేపీ మళ్లీ తప్పులో కాలేసినట్టే… లోకసభ ఎన్నికలు కాబట్టి మోడీ పట్ల జనంలో ఉన్న పాజిటివిటీ బీజేపీకి ఉపయోగపడుతుందనేదీ నమ్మొచ్చు… అది ఇంకా ఫాయిదా చూపాలంటే బీఆర్ఎస్‌తో తమకు ఏ కక్కుర్తి ఒప్పందాలు లేవని జనాన్ని నమ్మించాలి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తమ మీద పడకుండా జాగ్రత్తపడాలి… అందుకే కవితను అరెస్టు చేశారా..?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవితను అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఇన్నాళ్లూ ఆగారా..? మరి ఢిల్లీలో మనీష్ వంటి పెద్ద తలకాయల్ని కూడా లోపలేశారు కదా… సరే, ఇప్పుడు ఆమె అరెస్టు ఈజీ అయిపోయింది… కాగల కార్యం బీజేపీ తీర్చింది అనుకుని కాంగ్రెస్ సైలెంట్… బీఆర్ఎస్, కేసీయార్ మరింత డీమోరల్ అవుతారని, అది తమకు ఫ్లెచింగ్ అని కాంగ్రెస్ క్యాంప్ భావిస్తోంది…
శివుడాజ్ఞ లేనిది చీమైనా కదలదు… కేంద్రంలో పెద్దలు తలూపనిదే కవిత అరెస్టు జరగదు… కానీ ఆ పెద్ద తలకాయలు ఏదో పొలిటికల్ ఫాయిదా ఊహించి ఈ అరెస్టు చేయించి ఉంటే మాత్రం… అది పెద్దగా ప్రభావం చూపించదేమో అనిపిస్తోంది… ఏమో, కాలం చెప్పాలి… కాదు, తెలంగాణ సమాజం చెప్పాలిక..!!
చివరగా… ఇలాంటి కేసులతో ఒరిగేదేమీ ఉండదు, కొన్నిరోజులు చికాకులు తప్ప… ఈ కేసుల్ని ఎలాగూ ఓ లాజికల్ ఎండ్ వరకూ తీసుకెళ్లరు… సో, కవితకు ఏవో శిక్షలు పడతాయని, ఢిల్లీ లిక్కర్ కేసులు కోర్టులో ప్రూవ్ అవుతాయని కానీ తెలంగాణ సమాజం ఏమీ అనుకోవడం లేదు… కానీ బీజేపీ ఏం ఆశించి ఇదంతా చేస్తోంది అనేదే స్పష్టంగా అర్థం కాని ప్రశ్న..!! తమ స్ట్రాటజీ మీద కనీసం తమకైనా క్లారిటీ ఉందా..?!
Share this Article